రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ మంత్రులు.. కారణం ఆయనేనా?
posted on Oct 29, 2021 @ 4:20PM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకునే వైసీపీ మంత్రులు.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుపై విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని గురువారం రాత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వారు ఇలాగే మాట్లాడతారని చెప్పారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని తెలిపారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించకూడదని సూచించారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది.