కుప్పంలో చంద్రబాబు షో.. ఫ్లెక్సీల రచ్చతో ఉద్రిక్తత..
posted on Oct 29, 2021 @ 2:50PM
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు షో. సొంత నియోజకవర్గంలో బాబుకు ఘనస్వాగతం. బెంగళూరు విమానాశ్రయం నుంచి వచ్చిన చంద్రబాబుకు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని రాళ్లబూదుగూరు దగ్గరికి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు చేరుకున్నారు. తమ అభిమాన నేతను ఘన స్వాగతం పలికారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో కుప్పంకు తీసుకొచ్చారు. చంద్రబాబు రాకతో రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఇక, ఉదయం నుంచీ కుప్పంలో హైడ్రామా నడుస్తోంది. చంద్రబాబు రాకను తట్టుకోలేని కుళ్లుబోతు వైసీపీ నేతలు.. బాబు ఫ్లెక్సీలను చింపేశారు. లక్ష్మీపురంలో టీడీపీ బ్యానర్లను డ్యామేజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం దగ్గర టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు దుండగులు.
చంద్రబాబు గత పర్యటనలోనూ వైసీపీ వాళ్లు ఇలానే టీడీపీ ప్లెక్సీలు చింపివేశారు. అప్పట్లో బాబు బస చేసిన గెస్ట్‌హౌజ్‌లో కరెంట్ కూడా నిలిపేశారు. జనరేటర్‌తో కరెంట్ సరఫరా చేశారు. ఈసారి సైతం ఫ్లెక్సీలను చించేచి రచ్చ రాజేశారు అధికారపార్టీ నేతలు. దీంతో.. బీపీ పెరిగిన తెలుగు తమ్ముళ్లు రోడ్డుపై నిరసన, ధర్నాకు దిగారు. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన మొదలైంది.