రూల్స్ పాటించకుండా అరెస్టు! పట్టాభి కేసులో ఇద్దరు పోలీసులపై వేటు..
posted on Oct 29, 2021 @ 3:27PM
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. తర్వాత ఆయన అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదమైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు అతిగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. పట్టాభి అరెస్ట్ విషయంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించారు. రూల్స్ పాటించకుండా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. వాళ్లంతా ఇప్పుడు చిక్కులో పడ్డారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అరెస్ట్ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకుంది. అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించలేదని హైకోర్టు కూడా సీరియస్ గా స్పందించింది. పట్టాభి అరెస్ట్ సమయంలో రూల్ ఆఫ్ లా పాటించలేదంటూ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై దృష్టిసారించిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఏ పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించారనే దానిపై ఆరా తీశారు. చివరకు ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని ఆ పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీటీసీ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో, సీఐ నాగరాజును ఏలూరు రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సురేష్‌ను గవర్నర్‌పేట ఇన్‌చార్జి సీఐగా సీపీ శ్రీనివాసులు నియమించారు. పట్టాభికి బెయిల్ మంజూరులో అసంపూర్తి నోటీసులు, అయన నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు అంశాలు కీలకమయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.