కేసీఆర్ పై భగ్గుమన్న ఓయూ.. తెలుగు రాష్ట్రాలను కలిపే కుట్రలా?
posted on Oct 29, 2021 @ 2:58PM
రాజకీయ నాయకుల అనాలోచిత వ్యాఖ్యలు ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తాయో ఉహించడం కష్టం. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ నాయకులు ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. అలాకాకుండా ముందు వెనకా చూసుకోకుండా నోటికి ఎదోస్తే అది, మాట్లాడితే ఇదిగో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోవలసి వస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో, తమ గొప్పలు చెప్పుకునే క్రమంలో, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలో కూడా తెరాస పెట్టాలని కోరుతున్నారని, కుప్పలు, కుప్పలుగా విజ్ఞప్తులు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఏపీ మంత్రి పేర్ని నానీ, కేసీఆర్ వ్యాఖ్యలఫై స్పందిస్తూ చాలా క్యాజువల్’ గా మళ్ళీ ఇక్కడో పార్టీ, అక్కడో పార్టీ ఎందుకు, రెండు రాష్ట్రాలను కలిపేస్తే, అక్కడా ఇక్కడా పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని మీరే ఎలుకోవచ్చును కదా ..అని అన్నారు.
ఇలా, కేసీఆర్ రేపిన తెనేపట్టుతో ఇప్పుడు ఉస్మానియాలో భగ్గుమంది. ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాలను కలపాలని కేసీఆర్,జగన్ లు కుట్ర చేస్తున్నారని విద్యార్థి జేఏసీ నేతలు ఆరోపించారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
టిఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ తల్లి విగ్రహం బదులు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టి అమర వీరుల త్యాగాలను కేసీఆర్ కించపరిచాడని ఆరోపించారు. అలాగే కేసీఆర్;కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిజానికి కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదే. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే, కేసీఆర్ ప్లీనరీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్ధులు ఆయన కోరుకున్నవిధంగానే స్పందించారు, అయితే ఇది ఇంతటితో ఇది ఆగుతుందా, లేక మరోమారు బలిదానాల వరకు వెళుతుందా ..అనేది చూడవలసి ఉంది.