కుప్పంలో రచ్చ.. పట్టాభి కేసులో పోలీస్ యాక్షన్.. ఓటుకు ఎన్నినోట్లు? టాప్‌న్యూస్ @1pm
posted on Oct 29, 2021 @ 1:04PM
1. కుప్పంలో పెక్సీల రగడ కలకలం రేపుతోంది. లక్ష్మీపురంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ బ్యానర్లు చింపేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం దగ్గర టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను చింపడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు గత పర్యటనలోనూ దుండగులు ఇలానే ప్లెక్సీలు చించేశారు.
2. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఏసీపీ రమేష్, సీఐ నాగరాజును విధుల నుంచి తప్పించారు. అరెస్టు సమయంలో ఖాళీలతో నోటీస్ ఇవ్వడంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిద్దరి బదిలీ జరిగినట్టు తెలుస్తోంది.
3. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డబ్బు మనిషని, ఆయనకు ఏమి తెలుసునని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ విమర్శించారు. పీకే జర్నలిస్టులను పక్కన పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడమేంటి.. ఆయన ఓ బచ్చగాడని మండిపడ్డారు.
4. పోలింగ్‌కు ముందు హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. వీణవంకలో ఇతర ప్రాంతాల వాళ్లు డబ్బుల పంపిణీ చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌లు ఇంకా గ్రామాల్లోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలు సైతం డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు 6వేలు ఇస్తుంటే.. బీజేపీ మాత్రం రూ.1500-2000 మాత్రమే ఇస్తున్నారని స్థానికుల మండిపడుతూ.. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.
5. కడప జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బద్వేల్‌లోనూ భారీగా వర్షం పడుతుండటంతో.. శనివారంనాటి పోలింగ్‌కు ఆటంకం ఇబ్బంది అవుతుందేమోనని నేతలు, అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి గొడుగులు, రెయిన్ కోట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
6. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 300 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో రఘునందన్‌రావును హౌజ్ అరెస్ట్ చేశారు.
7. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఆమె 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేశారు. శుక్రవారం 10వ రోజున వైఎస్ షర్మిల పాదయాత్ర ఇబ్రహీంపట్నం నుంచి సీతంపేట, నోముల, లింగంపల్లి, మంచాల, చాంద్‌ఖాన్ గూడ,అస్మతపూర్లో కొనసాగుతోంది.
8. ఎల్బీనగర్‌లో ఎస్.ఓ.టి పోలీసులు మరోసారి భారీగా గంజాయి పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పట్టుకున్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
9. గోవాకు తాము ముఖ్యమంత్రి అయ్యేందుకు రాలేదని, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ దాదాగిరిని అడ్డుకునేందుకు వచ్చామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మూడు రోజుల గోవా పర్యటనలో ఉన్న మమతా.. గోవా, బెంగాల్ మధ్య చేపలు, ఫుట్‌బాల్‌కు మధ్య ఉన్న సంబంధం ఉందని అన్నారు. కేంద్రం పిడికిలి నుంచి గోవాను రక్షిస్తానని పిలుపిచ్చారు.
10. డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హిట్ కొట్టిన అజయ్.. సెకండ్ మూవీ 'మహా సముద్రం' ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ మూవీ రిజల్ట్ గురించి నిలదీస్తుండటంతో.. అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. ‘మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి.. ఈసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను’.. అని ట్వీట్ చేశారు డైరెక్టర్ అజయ్ భూపతి.