ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం! జగన్ రెడ్డికి చంద్రబాబు సవాల్...
posted on Oct 29, 2021 @ 5:34PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని హెచ్చరించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు తనకు లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసారు. తన మీద బాంబు వేస్తామని ఒకాయన అంటున్నారని, తనను ప్రజా దేవుళ్లే కాపాడుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధర్మ పాలనపై తాను చేసేది ధర్మపోరాటమని అన్నారు.
తన సొంత నియోజక వర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. రెండు రోజుల పర్యనటలో భాగంగా తొలిరోజు బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన పర్యటనకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడికొస్తారో రండి.. చూసుకుందాం, ధైర్యం ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసి, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి దాడి సమయంలో ఎందుకున్నాడని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో షాక్ కొట్టేలా విద్యుత్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. . పన్నులు పెంచుతూ.. ప్రజలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఏపీని సారాయి, గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారన్నారు. అక్రమ కేసులకు భయపడి మేం సరెండర్ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వదిలేసి పారిపోవాలా అని చంద్రబాబు నిలదీసారు.