జైలుకు జగన్... ఉమ్మడి ఏపీ సీఎంగా కేసీఆర్?
posted on Oct 29, 2021 @ 6:07PM
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్ తేవడం వెనుక ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని గురువారం ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ట్వీట్ పై దుమారం రేగుతుండగానే మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు.
షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడం, కలిసిపోదాం అని ఏపీ మంత్రి పేర్ని నాని అనడం అనుకోకుండా జరిగినవి కావన్నారు రేవంత్ రెడ్డి. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందన్నారు. కేటీఆర్ భీమవరం లో పోటీ చేస్తారో, లేక బొబ్బిలి లో పోటీ చేస్తారో తెలువదు.కానీ ఇలాంటి కుట్రలు ప్రజలు సహించరని అన్నారు. జరుగుతున్న కుట్రలను ప్రజలు ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ జైలుకు వెళుతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పేర్ని వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే నాని వ్యాఖ్యలు స్వాగతించినట్లే కదా అని రేవంత్ రెడ్డి చెప్పారు
హైదరాబాద్ లో సోమవారం జరిగిన పార్టీ ప్లినరీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంట్ సమస్య ఉందని, అందుకే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు సూచించారు ఏపీ మంత్రి పేర్నినాని. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లు చేయడం తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది.