తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయా? రెచ్చగొట్టే రాజకీయమా?
posted on Oct 29, 2021 @ 12:46PM
ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఏకమవుతాయా? ఇటు నుంచి మహా రాష్ట్ర, అటునుంచి కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాలు కూడా వచ్చి తెలంగాణలో చేరిపోతున్నాయా? అదేమో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పీఠాలు కదులుతున్నాయి. అందుకే కావచ్చు, మళ్ళీ సెంటిమెంట్స్’ను రెచ్చగొట్టి అసలు సమస్యలను పక్కదారి పట్టించే వికృత రాజకీయ క్రీడకు రెండు రాష్ట్రాల పాలక పక్షాలు తెరతీస్తున్నాయని అంటున్నారు.
ఆంధ్రాలోనూ తెరాస పార్టీ పెట్టాలని అక్కడి అక్కడి ప్రజలు కోరుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. నిజానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ వేదిక నుంచి పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించలేదు. హుజూరాబాద్ ఓటర్లను ఉద్దేశించి ఉప ఎన్నిక ప్రచార ఉపన్యాశం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్’ను ఎంతో కొంత రెచ్చగొట్టేందుకు, పనిలో పనిగా దళిత బంధు విషయంలో హుజూరాబాద్ ఓటర్ల అనుమానలను తొలిగించే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నాయకులు కొంచెం ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. ముందు ‘ఆల్ ఇన్ వన్’ సలహదారు సజ్జల, ఆ తర్వాత ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. అయితే మంత్రి వర్గ సమావేశం తర్వాత బహుశా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సలహా మేరకు కావచ్చు, మంత్రి నానీ, కథను కొత్త మలుపు తిప్పారు.“ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’’ అని పేర్ని నాని ట్విస్ట్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ తరఫున తాము సహకరిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.
అయితే ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదు. ఆ విషయం కేసీఆర్’కు మంత్రి నానీకి తెలుసు. అయినా, ఉప ఎన్నిక సమయంలో ఉభయ ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యాలు చర్చకు రాకుండా, కేసీఆర్ సెంటిమెంట్ తేనే తుట్టెను రేపారు. అయితే, సెంటిమెంట్ ఆధారంగా పుష్కరకాలానికి పైగా సాగిన తెలంగాణ, సమైఖ్య ఆంధ్ర ఉద్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాయో గుర్తుచేసుకుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ సెంటిమెంట్స్ రెచగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా అది నేరం కాదు మహాపరాధం అవుతుంది.