ఊరంతా ఒక్కటై ఆ ముగ్గురిని చెట్టుకు కట్టేశారు.. కేటీఆర్ చూశారా?
posted on Oct 29, 2021 @ 2:46PM
"నా కడుపు నిండితే దరిద్రం పాయె" అని తెలంగాణలో ఓ సామెత ఉంది. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అలాంటి సామెతలే గుర్తుకొస్తాయి మరి. ప్రభుత్వాలు నడుపుతున్న పెద్ద సార్లందరూ పెద్దపెద్ద డీళ్లో మునిగిపోయి పేదోళ్ల ఆకలిని పట్టించుకోకపోతే జరిగే సామాజిక ఘోరాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఆరంభం మాత్రమేనని, సమస్య ముదురుతున్నకొద్దీ దాని సామాజిక పర్యవసానాలు మరింత ఘోరంగా ఉంటాయని, కళ్లు తెరవాల్సిన నాయకులు విస్మరిస్తే ఆ పరిణామాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యంగా పరిణమించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు చెప్పగానే టీఆర్ఎస్ యువనాయకుడు, ప్రభుత్వంలో నెంబర్ టూ గా చెలామణీ అవుతున్న కేటీఆర్ గుర్తుకొస్తారు. ఆయన నియోజకవర్గమైన సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ మండలంలో కొంతకాలంగా ఓ దొంగల ముఠా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. చేతికి పనిలేని, చిల్లిగవ్వా లేని కొందరు యువకులు తమ అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం సులభంగా ఆస్తులు కూడబెట్టాలని భావించారు. దీంతో వారంతా ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.
పత్తి ఏరిన తరువాత మార్కెట్ కు తరలించే ముందు సంచుల్లో నింపి పొలాల్లోనే పెడతారు. వాటిని అట్నుంచి అటే మార్కెట్ కు తరలిస్తారు. అలా పత్తితో నిండిన బోరాలు, గోనె సంచుల్లో నిల్వ ఉంచిన వరి పంటను ఈ దొంగల ముఠా ఎత్తుకుపోతోంది. అంతేకాదు.. కరెంటు మోటార్ల మీద కూడా వీరి ప్రతాపం చూపిస్తున్నారు. దేవాలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకెళ్లిన ఘటనలు కూడా ఇక్కడ జరిగాయి. దొంగల ముఠాను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా... వీరు మాత్రం పోలీసుల కళ్లుగప్పి హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. తాజాగా రాచర్ల గొల్లపల్లిలో కొందరు రైతులు పత్తి చేలో గోనె సంచుల్లో నిల్వ ఉంచిన పత్తి దొంగలపాలవడంతో వారు ఎంతో చాకచక్యంగా ఈ ముఠాను రెడ్ హేండెడె్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలోో కొందరు దొంగలు పారిపోగా ఈ ముగ్గురు మాత్రం దొరికిపోయారు. వీరి ద్వారా మొత్తం ముఠా సభ్యులను పట్టుకుందామని భావించిన రైతులు ఆ ముగ్గురిని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేశారు. తీరిగ్గా పోలీసులకు అప్పగించారు. తాము వెదికి పట్టుకోవాల్సిన దొంగలను రైతులే పట్టుకోవడంతో పోలీసుల పని సులభంగా మారింది. దొంగల్ని పట్టుకున్న రైతుల తెగువ, స్ఫూర్తిని పోలీసులు అభినందించారు.
ఒకప్పుడు వరుస బలవన్మరణాలతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల... తెలంగాణ వచ్చిన తరువాత అక్కడి మరమగ్గాలకు పని కల్పించింది. పెద్దసంఖ్యలో ఉన్న పద్మశాలీలకు మరమగ్గాలు నడిపించడం ద్వారా చేతినిండా కల్పించింది. ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలకు పెద్దఎత్తున ఆర్డర్లు ఇచ్చి భారీగా చీరలు తయారు చేయించింది. దీంతో గత మూడేళ్లుగా ఆత్మహత్యలు ఆగిపోయాయి. నేతన్నల బతుకుల్లో వెలుగులు పూస్తున్నాయని ప్రభుత్వం కూడా ఘనంగా చెప్పుకుంటోంది. అయితే అది నాణేనికి ఒకవైపు మాత్రమేనని, ఆ రెండోవైపు సమస్య తీవ్రత అలాగే ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. సిరిసిల్ల పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపేటలో ఈడుకొచ్చిన యువకులు చేతినిండా పనిలేక, అవసరాలు తీరే మార్గం లేక, అడిగితే ఇచ్చే నాథుడు లేక అసాంఘిక శక్తుల అవతారం ఎత్తుతున్నారు. ఈజీ మనీ కోసం ముఠాలు కట్టి దొంగతనాలు చేస్తున్నారు. ఇలా వదిలేస్తే వీరే రేపటి రోజుల్లో దోపిడీ దొంగలుగా తయారవుతారని స్థానికులు అభిప్రాయపుతున్నారు.
ఈడుకొచ్చి, పెళ్లి చేసుకొని ప్రయోజకులు అవ్వాల్సిన వయసులో ఎంతో భవిష్యత్తున్న యువకులు ఇలా దొంగలుగా మారితే అది నియోజకవర్గానికే గాక యావత్ రాష్ట్రానికే తలవంపులు తెస్తుందంటున్నారు. కేవలం పద్మశాలీల అవసరం తీర్చామని ఘనంగా చెప్పుకుంటున్న కేటీఆర్, తన నియోజకవర్గంలోనే వివక్షకు గురవుతున్న యువతరాన్ని పట్టించుకోకపోతే ఇక తెలంగాణలోని యువకులం సంగతేంటని ప్రశ్నిర్శిస్తున్నారు. తమకు చిక్కిన ముగ్గురు యువకుల ద్వారా మిగతా ముఠా సభ్యులను పట్టుకునేందుకు... ఆ దొంగలు రైతులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరి.. ఈ సమస్యను కేటీఆర్ ఓ చిన్న సంఘనటగా చూస్తారా.. లేక రానున్న సామాజిక సమస్యకు ఆనవాలుగా భావించి అడ్డుకట్ట వేయడానికి పూనుకుంటారా... అన్నది చూడాలి.