హుజురాబాద్‌లో మాయం.. వరంగల్‌లో ఈటల ప్రత్యక్షం.. చంపుకుంటారో-సాదుకుంటారో!
posted on Oct 29, 2021 @ 3:23PM
హుజురాబాద్ హోరెత్తుతోంది. ప్రచారం ముగిసినా.. డబ్బుల పందేరం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వాళ్లు ఓటుకు 6వేలు ఇస్తున్నారు-అంటున్నారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ ఇచ్చే ఆరు వేలు తమకు అందలేదంటూ మహిళలు ధర్నాకు దిగడం ఆసక్తికరం. ఆ రేంజ్‌లో సాగుతోంది డబ్బుల పంపకం. అయితే, ఓటర్లకు డబ్బులు ఇవ్వడంలో బీజేపీ బాగా వనకబడిందని అంటున్నారు. ఈటల తరఫు వాళ్లు ఓటుకు 1500 నుంచి 2 వేలు మాత్రమే ఇస్తున్నారని.. అంతకుమించి ఇవ్వడం లేదని టాక్. ఆ ఇచ్చేది కూడా కొందరికే అట. ఫలానా వాళ్లు పక్కాగా తమకే ఓటేస్తారని అనిపిస్తేనే.. డబ్బులిస్తున్నారట. లేదంటే లేదు. ఆ కాస్త డబ్బులు కూడా ఇవ్వకుండా ఇటు టీఆర్ఎస్ కేడర్, అటు ప్రభుత్వ యంత్రాంగం బీజేపీ డబ్బు పంపిణీని బాగా కట్టడి చేస్తున్నాయని అంటున్నారు. ఈటల మనుషుల చుట్టూ.. గులాబీ మనుషులు మోహరించి.. పైసలు పంచకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సడెన్‌గా హుజురాబాద్ నుంచి మాయమవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్లారంటే..
మరికొద్ది గంటల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కేవలం డబ్బుల పందేరమే నడుస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి ఎలక్షన్ కోడ్ లేని వరంగల్ జిల్లాలో వాలిపోయారు. ఆయన వచ్చే సరికే పలువురు బీజేపీ కీలక నేతలు వరంగల్‌లో ఈటల కోసం ఓ హోటల్‌లో వేచి చూస్తున్నారు.
వరంగల్‌లోని హోటల్‌లో బీజేపీ నేతలు-ఈటల రాజేందర్ సమావేశం కావాల్సి ఉంది. విలేకరుల సమావేశమూ జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని పోలీసులు అడ్డుకున్నారు. ఈటల హోటల్ లోపలికి వెళ్లకుండా పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను వారించి రాజేందర్‌ను బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, రావు పద్మ తదితరులు హోటల్ లోపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈటల భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రజలతో 19ఏళ్ల బంధం నాది. చంపుకుంటరో-సాదుకుంటరో మీకిష్టం నేను చచ్చినా బతికినా మీవెంటే’ అంటూ ఆవేదన చెందారు.