వీరుడా మళ్లీ పుట్టాలిరా.. రావత్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు..
posted on Dec 10, 2021 @ 4:28PM
యావత్ దేశం కన్నీరు కార్చింది. యావత్ సైన్యం చలించిపోయింది. ప్రముఖులంతా తరలివచ్చారు. సైనికులంతా సెల్యూట్ చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రముఖుల నివాళుల అర్పించిన తర్వాత.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రావత్‌కు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్ అంత్యక్రియల్లో 800 మంది రక్షణ సిబ్బంది అధికారికంగా పాల్గొన్నారు.
రావత్ అంత్యక్రియలకు పలు దేశాల సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీలంక సీడీఎస్ అండ్ కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వా, శ్రీలంక మాజీ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి (నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో రావత్‌కు మంచి మిత్రుడు), రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ డోర్జీ రించన్, నేపాల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డివిజన్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌తో పాటు పలు దేశాల రాయబారులు హాజరై.. రావత్ పార్థివ దేహం దగ్గర నివాళులు అర్పించారు.
ప్రముఖులు, సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్ దంపతుల భౌతికకాయాలను ఉదయం కామ్‌రాజ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం రెండు గంటల పాటు అంతిమ యాత్ర కొనసాగింది. దారి పొడువునా ప్రజలు రావత్‌కు వీడ్కోలు పలికారు. రావత్ అమర్‌రహే అంటూ నినదించారు.
అంతిమ యాత్రలో.. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది అధికారులు పాల్గొన్నారు. 33 మందితో ట్రైసర్వీస్ బ్యాండ్ ముందు నడిచింది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్ ఎస్కార్ట్‌గా అంతిమయాత్రను అనుసరించింది. 17 శతఘ్నుల సెల్యూట్‌తో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. అలా ఒక వీరుడు నేల విడిచి నింగిని చేరాడు. భారతమాత ముద్దుబిడ్డ మళ్లీ పుట్టాలని.. మళ్లీ సైనికుడిగా దేశ సేవ చేయాలని ప్రజలంతా బరువెక్కిన హృదయాలతో కోరుకుంటున్నారు.