చంద్రబాబు వర్సెస్ దగ్గుబాటి.. ఏంటి గొడవ? అసలేం జరిగింది?
posted on Dec 11, 2021 @ 12:00PM
నారా చంద్రబాబు నాయుడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. నందమూరి తారకరామారావు అల్లుల్లు. తోడల్లుళ్లుగా ఎంతో సఖ్యతగా ఉండేవారు. టీడీపీలో ఎన్టీఆర్ సుప్రీం లీడర్ అయితే.. పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3గా నారా, దగ్గుబాటి ఉండేవారు. రామారావుకు కుడి-ఎడమలా దన్నుగా నిలిచేవారు. రాజకీయ చాణక్యం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న చంద్రబాబు.. దగ్గుబాటి కంటే యాక్టివ్‌గా పాలిటిక్స్ చేసేవారు. ఆగష్టు సంక్షోభంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. నాదెండ్ల ఎపిసోడ్‌ను డైనమిక్‌గా హ్యాండిల్ చేశారు. ప్రభుత్వంలో, పార్టీలో చురుగ్గా ఉంటూ.. ఎన్టీఆర్‌కు మరింత సన్నిహితులయ్యారు చంద్రబాబు.
అలా అలా ఏళ్ల పాటు టీడీపీ నావ సాఫీగా సాగిపోయింది. చంద్రబాబు, దగ్గుబాటిల ధ్వయానికి పార్టీలో తిరుగులేకుండా పోయింది. తోడల్లుళ్లు ఎన్టీఆర్‌తో, ప్రజలతో శెభాష్ అనిపించుకున్నారు. అంతలోనే లక్ష్మీపార్వతి రూపంలో.. ఇటు నందమూరి కుటుంబంలో, అటు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. అది సునామీలా మారింది. లక్ష్మీపార్వతి పెత్తనం, ఆమె చేతిలో పులిలాంటి ఎన్టీఆర్ పిల్లిలా మారడాన్ని ఎదురించక తప్పలేదు. అలాంటి అత్యంత సంక్లిష్ట సమయంలో.. చంద్రబాబు-దగ్గుబాటి జోడి.. మరోసారి కీలకంగా వ్యవహరించింది. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తాన్ని వారిద్దరే హ్యాండిల్ చేశారు. నందమూరి కుటుంబ మద్దతులో.. పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్‌తో.. ఎన్టీఆర్ నుంచి పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు తన చేతుల్లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు.
ఇక్కడే చంద్రబాబుకు వెంకటేశ్వరరావుకు తేడాలొచ్చాయి. అప్పటికే ఎన్టీఆర్ తర్వాత నెంబర్ 2గా మారిన.. పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన.. మంత్రిగా, నాయకుడిగా నిరూపించుకున్న.. చంద్రబాబు నాయకత్వానికే టీడీపీ శ్రేణులంతా జై కొట్టారు. ముఖ్యమంత్రి స్థానానికి చంద్రబాబుతో దగ్గుబాటి సరితూగలేకపోయారు. తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదని భావించిన దగ్గుబాటి.. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచీ తోడల్లుళ్ల మధ్య మాటలు లేవు. సఖ్యత లేదు. సంబంధాలు లేవు. 25 ఏళ్లుగా ఎవరి దారి వారిదే. ఎవరి రాజకీయం వారివే.
ఈ గ్యాప్‌లో చంద్రబాబు మూడు సార్లు సీఎం, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో దగ్గుబాటికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అటు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పురందేశ్వరీలు నందమూరి కుటుంబంతో కలిసే ఉన్నా.. నారా వారితో మాత్రం దూరం జరిగారు. భువనేశ్వరీతో టచ్‌లో ఉన్నా.. చంద్రబాబుతో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరించేవారు. తర్వాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబుపై కసితోనే వాళ్లు వైఎస్సార్ కు దగ్గరయ్యారని అంటారు. వైఎస్సార్ హయాంలో వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురందేశ్వరి ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు దగ్గుబాటి వైసీపీలో చేరగా.. పురందేశ్వరి మాత్రం బీజేపీ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసిన దగ్గుబాటి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో ఉండీలేనట్టు కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. దగ్గుబాటి సతీమణి పురందేశ్వరీ మాత్రం బీజేపీలో జాతీయ నేతగా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇలా.. 25 ఏళ్ల సుదీర్ఘ దూరం తర్వాత.. నందమూరి ఫ్యామిలీ వేడుకలో తొలిసారి నారా-దగ్గుబాటి కుటుంబాలు ఆప్యాయంగా పలకరించుకున్నాయి. తోడల్లుళ్లు చిరకాలం తర్వాత చెయ్యి-చెయ్యి కలిపారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. సన్నిహితంగా మెదిలారు. ఒకే ఫ్రేమ్‌లో వారిద్దరూ ఉండటం చూసి.. ఎన్నాళ్లో వేచిన రోజంటూ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబ సఖ్యత.. రాజకీయ సఖ్యతగానూ మారుతుందా? తోడల్లుళ్లు మళ్లీ ఏకం అవుతారా? గతంలోలా కలిసి రాజకీయాలను శాసిస్తారా? అంటే.. ఏమో.. కాలమే డిసైడ్ చేయాలి!