చంద్రబాబు రాజీనామాల సవాల్.. జగన్‌కు దమ్ముందా?
posted on Dec 11, 2021 @ 1:35PM
మా వాళ్లు రెడీ.. మీ వాళ్లు రెడీయా? జగన్‌కు చంద్రబాబు విసిరిన సవాల్ ఇది. విజయంపై ఎంత నమ్మకం ఉంటే టీడీపీ అధినేత ఈ సవాల్ చేసుంటారు. మరి, ప్రజలంతా మావెంటే అన్నారంటూ విర్రవీగుతున్న వైసీపీ.. చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తుందా? రాజీనామాలకు సై అంటుందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటీ రాజీనామాల సవాల్? చంద్రబాబు ఎందుకంత దూకుడు మీదున్నారు?
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ సీఎం జగన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు.
"హోదాపై ఎందుకు పోరాడలేక పోయారు? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చెయ్యమనండి. మా ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తారు. హోదా కోసం 25 మంది ఎంపీల రాజీనామాల సవాల్‌కు జగన్ సమాధానం చెప్పాలి." అన్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు నిలదీశారు. హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైద్రాబాద్ అవుతుందని నాడు జగన్ అన్నారు. హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందని జగన్ అనలేదా?హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకహోదా తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దని జగన్‌కు చంద్రబాబు హితవు పలికారు.
విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం చెబితే ప్రభుత్వం ఏం చేస్తోంది? విభజన హామీల అమలు విషయంలో సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. విశాఖకు రాజధాని తెస్తాం అంటున్న జగన్.. రైల్వే జోన్ గురించి ఏమి చెబుతారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్‌కు ముందే సమాచారం ఉంది. విశాఖ ఉక్కు ఒక పరిశ్రమ మాత్రమే కాదు..సెంటిమెంట్ అని చంద్రబాబు అన్నారు.
వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని.. రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చంద్రబాబు తేల్చి చెప్పారు.