ఎమ్మెల్సీ పోలింగ్ సరళితో కేసీఆర్‌లో టెన్షన్.. ఈటల నుంచి రిటర్న్ గిఫ్ట్ తప్పదా?
posted on Dec 10, 2021 @ 4:59PM
లెక్క ప్రకారమైతే ఆరుకు ఆరు అధికార టీఆర్ఎస్ ఖాతాలో పడాలి. కానీ, పడతాయా? లేదా? అనే టెన్షన్ ఇప్పుడు కేసీఆర్‌ను ఉత్కంఠకు గురి చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నుంచి రిటర్న్ గిఫ్ట్ తప్పదా? అనే టెన్షన్ ఆయన్ను అసహనానికి గురి చేస్తోందిన తెలుస్తోంది. అందుకు తగ్గట్టే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం.. ఎక్కడో తేడా కొడుతోంది. కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఝలక్ ఇచ్చేందుకే.. ఓటర్లు ఇంత భారీగా తరలివచ్చారా? అనే అనుమానం కలుగుతోంది.
టీఆర్ఎస్ రెబెల్ కేండిడేట్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడంతో కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. రవీందర్‌సింగ్‌ను పోటీలో పెట్టింది తానేనంటూ ఈటల ప్రకటించడంతో మరింత దిమ్మతిరిగిపోయింది. రవీందర్ గెలుపు ఖాయమంటూ ఈటల రాజేందర్ సవాల్ చేయడం.. తెరవెనుక సమీకరణాలు మార్చేయడం కాక రేపింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సైతం తమ ఓటర్లతో క్యాంప్ నిర్వహించడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. హుజురాబాద్ ఎలక్షన్ మాదిరే.. ఈటల వర్గం, కాంగ్రెస్ వర్గం.. రెండూ కలిసి అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. భారీగా ఓటింగ్ జరగడం అందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. అందుకే, ఈ నెల 14న జరిగే కౌంటింగ్‌పై కేసీఆర్‌లో టెన్షన్ నెలకొందని అంటున్నారు.
ఇక, తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం పోలింగ్ నమోదైంది. 1,324 ఓట్లకుగాను 1,320 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.