సాయితేజ మృతదేహం గుర్తింపు.. విమానంలో స్వస్థలానికి తరలింపు
posted on Dec 11, 2021 @ 9:49AM
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిలో చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం కూడా ఉన్నట్టు సైన్యం తెలిపింది. నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలు కూడా వున్నాయి. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సైన్యాధికారులు తెలిపారు. గుర్తించిన వారి మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
తమిళనాడులోని కూనురు సమీపంలో బుధవారం మధ్యహ్నం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి కెప్టెన్ వీరేందర్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలను గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదంలో శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో కొన్ని మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. తెలుగు తేజం సాయితేజ మృతదేహం గుర్తింపు కూడా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం రాత్రి సాయితేజ డెడ్ బాడీని గుర్తించారు. దీంతో అతని మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో సొంతూరు తరలించడానికి సైన్యం ఏర్పాట్లు చేసింది.