కరోనాను రోగులనూ వదలని కరప్షన్
posted on Dec 10, 2021 @ 6:04PM
కరోనా సెకండ్ వేవ్ మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వేల లక్షల ప్రాణాలను బలితీసుకుంది. మన దేశంలో అయితే, కరోనా సెకండ్ వేవ్కరాళ నృత్యమే చేసింది. మృత్యుఘోష వినిపించింది. ఫోన్ మొగిందంటే ఏ చావు కబురు వినవలసి వస్తుందో అని ప్రజలు భయపడిపోయారు. మరో వంక కోవిడ్ బారిన పడి ప్రతి రోజూ వేల మంది ప్రాణం వదిలారు. ఆక్సిజన్, ఔషధాలు లేక ప్రజలు నరకం అనుభవించారు. కుటుంబాలకు కుటుంబాలే వీధుల పాలయ్యాయి.
అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ దేశంలో అవినీతి రాజ్యమేలింది. ఆసుపత్రులలో, వైద్యులు , నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, వందల వేల మంది ప్రాణాలను కాపాడారు. నిజం, కానీ, అదే సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు, మధ్య దళారీలు అవినీతికి పాల్పడ్డారు..ప్రాణాలతో వ్యాపారం చేశారు. ఇందుకు సంబంధింఛి ‘లోకల్ సర్కిల్ ‘ సోషల్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన సర్వే లో ఆసక్తికర కాదు భయంకర వాస్తవాలు వెలుగు చూశాయి.
సెకండ్ వేవ్లో కరోనా చికిత్స పొందిన ప్రతి 10మంది పౌరుల్లో నలుగురు ఆరోగ్య సిబ్బందికి, ఆస్పత్రి యాజమాన్యానికి లంచాలు ఇచ్చినట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఔషధాలు వంటి కనీస వసతుల కోసం ప్రజలు ముడుపులు చెల్లించినట్లు వెల్లడైంది.
చికిత్స అనంతరం ఆస్పత్రి వేసిన బిల్లును తగ్గించేందుకు 9శాతం మంది లంచం ఇచ్చినట్లు సర్వే స్పష్టం చేసింది. ఐసీయూలో ఉన్న తమ వారి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు, వారిని సందర్శించేందుకు కూడా ప్రజలు ఇదే సంఖ్యలో డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. ఆస్పత్రి పారిపాలనా విభాగం, ఇతర సిబ్బందికి ఈ ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న వారిలో ఒక్కరు కూడా డాక్టర్కు గానీ, నర్సుకు గానీ లంచం ఇచ్చినట్లు చెప్పలేదు. ఆస్పత్రులలో అవినీతి జరగకుండా ప్రభుత్వమే కఠిన నిబంధనలు తీసుకురావాలని అప్పడే డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని వారు అభిప్రాయపడ్డారు.28 శాతం వార్డు బాయ్స్కు లంచాలు ఇచ్చారు. 27శాతం మంది ఆస్పత్రుల్లో పరిపాలానా సిబ్బందికి ముడుపులు చెల్లించారు. 10శాతం మంది స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మరీ ఆస్పత్రి సేవలు వినియోగించుకున్నారు.దేశవ్యాప్తంగా 300 జిల్లాలకు చెందిన 16,000 మంది నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ఇందులో మెట్రో నగరాలకు చెందినవారు 40శాతానికి పైగా ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 30శాతానికి పైగా ఉన్నారు.లోకల్ సర్కిల్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో చేసిన మరో సర్వేలో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం ప్రజలు 13శాతం అధికంగా ఫీజు చెల్లించారు. రెమ్డెసివిర్, ఫాబిఫ్లూ, టాసిలిజుమాబ్ వంటి ఔషధాలను రిటైల్ ధర కన్నా ఎక్కువ వెచ్చింది కొనుగోలు చేశారు.
వేరియంట్ను గుర్తించిన తర్వాత భారత్లో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. రోగుల సంఖ్య ఒక్కసారే లక్షల్లో పెరిగి ఆస్పత్రుల సరిపోక విపత్కర పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఫిల్లింగ్ కేంద్రాల వద్ద జనం సిలిండర్లతో బారులు తీరారు. కొవిడ్ చికిత్సలో అప్పుడు బాగా ఉపయోగించిన రెమ్డెసివిర్ ఔషధం బంగారం రేటును తలపించింది. బ్లాక్ మార్కెట్ మాఫియా ఈ ఔషాధాన్ని అధిక ధరకు విక్రయించింది. సాధరణ పరిస్థితులలోనే అవినీతికి పాల్పడడం చట్ట రీత్యా,ధరం విరుద్ధం. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, ఆసుపత్రుల యాజమాన్యాలు, రాజకీయ నాయకులు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనాను కాసుల పంటగా చేసుకున్నారు.