జగన్ పై కామ్రెడ్ ఫైర్.. సాయితేజను గుర్తించారు.. శిల్పా చౌదరి రగడ.. టాప్ న్యూస్@1PM
posted on Dec 11, 2021 @ 11:59AM
కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన వేద విద్యార్థుల మృతి బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వేద విద్యార్థులు చనిపోవడం కలచివేసిందన్నారు. నదీ సమీపంలో వేద పాఠశాల ఉన్నందున విద్యార్థుల భద్రత పట్ల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
----
ఏపీ సీఎం నిరంకుశ ధోరణి వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు అడ్డంకులు సృష్టించొద్దనని హితవు పలికారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని రాజా పేర్కొన్నారు. సీఎంకు పరిపాలన ఏమాత్రం చేత కాదన్నది తేటతెల్లమైందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు.
-------
ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయి తేజ భౌతిక కాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి తేజ భౌతికకాయాన్ని తరలించనున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వగ్రామానికి సాయి తేజ భౌతికకాయం చేరే అవకాశం ఉంది.
----
తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్ రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది.అధికార సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
--
వైసీపీ పాలనలో దళితులపై వివక్షత కొనసాగుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఒంగోలుకు చెందిన దళితుడైన వినోద్ కుమార్‌ను పోలీసులు వేధిస్తున్నారని హర్షకుమార్ తెలిపారు.
--
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12న నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తెలిపారు. జనసేన అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డు మీదికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం కలిసి వస్తే అందరం కలసి పోరాటం చేద్దామన్నా స్పందన లేదన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో నిరహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
---
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో లక్ష్మణరావు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఇనుప కమ్మిపై పడ్డాడు. దీంతో లక్ష్మణరావు శరీరంలోకి మూడు అడుగుల కమ్మి ఇరుక్కుపోయింది. వెంటనే అతడిని స్విమ్స్‌కు తీసుకురాగా.. వైద్యులు 4 గంటలు శస్త్ర చికిత్స చేసి కమ్మిని విజయవంతంగా తొలగించారు.
---
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. సీనియార్టీ లిస్ట్ ఫైనల్ కాకుండా ట్రాన్స్ఫర్‌ల ప్రక్రియను కొనసాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేపటి లోపు పూర్తి అవుతున్న ఆప్షన్స్ గడువును మరో వారం వరకు పెంచాలని మంత్రిని ఉపాధ్యాయులు కోరారు.
---
శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్ పేరుతో శిల్ప లేడీ క్లబ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్ ఆఫర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కస్టడీలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
------
దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వంటి ధైర్యసాహసాలుగలవారు జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుతూ, పరిరక్షిస్తూ ఉంటారని, ఫలితంగా జాతీయ పతాకం సమున్నతంగా ఎల్లప్పుడూ ఎగురుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ కేడెట్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌ను ఉద్దేశించి శనివారం కోవింద్ మాట్లాడారు.