వీరుడికి వీడ్కోలు.. చంద్రబాబు-దగ్గుబాటి టాక్స్.. పవన్ దీక్ష.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Dec 10, 2021 @ 5:59PM
1. ఢిల్లీలో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో ముగిశాయి. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. వారి కుమార్తెలు కృతిక, తరిణి చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
2. రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం లేని ఊహాగానాలు చేయవద్దని భారతీయ వాయు సేన కోరింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవ, మర్యాదలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ప్రమాదంపై త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేసినట్టు.. విచారణ వేగంగానే పూర్తవుతుందని, వాస్తవాలు బయటికి వస్తాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
3. చాలా కాలం తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలిశాయి. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్‌మెంట్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని మనసారా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య మాటలు లేవు. ఇప్పుడు కలుసుకోవడంతో నందమూరి ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది.
4. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదని.. అలాంటి వారికి నిబంధనల పేరుతో పథకాలను దూరం చేస్తున్నారని విమర్శించారు. 300 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే గిరిజనుల పెన్షన్లు, పథకాలు కట్ చేస్తున్నారని లోకేశ్ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
5. డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు కూర్చోనున్నారు. డిసెంబర్ 12 ఉదయం 10.00 గంటలకు దీక్ష ప్రారంభించి.. సాయంత్రం 5.00 గంటలకు ముగించనున్నారు.
6. రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. లక్ష్మీనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది.
7. తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్, బండి సంజయ్‌లు మాత్రం ఓటు వేయలేదు.
8. దళితుడి పట్ల బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అరాచకంగా ప్రవర్తించారు. దళితుడన బాబూరావు ఎంపీ సహాయం కోరుతూ ఆయన ఫోన్‌కు మెసేజ్ పెట్టారు. తనకే మెసేజ్ పెడతావా అంటూ సురేశ్.. బాబూరావును ఫోన్లో దూషించారు. తన తిట్లను ఫోన్లో రికార్డు చేశాడనే అనుమానంతో పోలీసుల సాయంతో బాబురావును తన ఇంటికి రప్పించి ఎంపీ సురేశ్ ఆ దళితుడిని చితకబాదినట్టు తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను బాబురావు కలవడంతో విషయం బయటకు వచ్చింది.
9. జగనన్న గృహపథకం వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతోందన్నారు. పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు రూ.10 వేలు కట్టాలంటూ దిగజారి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని.. అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు రఘురామ.
10. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్‌ను.. మూడేళ్లయినా రద్దు చేయలేదని సీఎం జగన్‌పై ఏపీ జేఏసీ ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అనేక రకాలుగా సహకరించాయన్నారు. ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చినా.. మిగతా డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని విరమించేది లేదని తేల్చిచెప్పాయి. సీపీఎస్ రద్దు చేస్తేనే ఉద్యమం విరమిస్తామని స్పష్టం చేశాయి.