అక్కడా.. ఆ నలుగురే!.. కేసీఆర్ ఒంటరే
తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత, కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయ ప్రస్థానంలో మరో ముందుగు వేశారు. నిజానికి, కేసేఅర్ గత నాలుగు సంవత్సరాలుగా జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా జాతీయ కలలలో తెలిపోతూనే ఉన్నారు. అలాగే, అనేక సమయాల్లో అనేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వ్యూహాలు మారుస్తూనే ఉన్నారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్’ ఇంకో ఫ్రంట్ మరో ఫ్రంట్ అంటూ నాలుగు సంవత్సరాలుగా కేసేఆర్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించ లేదు. కేసీఆర్ తో చేతులు కలిపేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాంతీయ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ నేపధ్యంలో, ఆయన ఫ్రంట్ టెంట్ ఆలోచనను పక్కన పడేసి, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చి, జాతీయ రాజకీయాలలో కాలు పెట్టేందుకు కేసేఆర్ తనకు తాను ఒక వేదిక తయారు చేసుకున్నారు. ముహూర్తం చూసుకుని దేశ రాజధాని ఢిల్లీలో కాలు పెట్టారు. జాతీయ పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కత్తిరించారు. బీఆర్ఎస్ జెండాని ఢిల్లీలో అవిష్కరించారు. అయితే ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ అదే కుమార స్వామి, అదే అఖిలేష్ యాదవ్ తప్పించి మరో ముఖ్య నాయకుడు ఎవరూ అటు కేసి కన్నెత్తి చూడలేదు. చివరికి కుమారస్వామి కేసీఆర్ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక రోజు ముందు ఆయన తండ్రి హెచ్ డి దేవెగౌడ్ హస్తినలో ప్రధాని మోడీని కలిసి వచ్చారు. అదీ సంగతి. సరే, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల నుంచి కొందరు రైతు నాయకులు బీఆర్ఎస్ వేడుకల్లో పాల్గొన్నా, ఆ నాయకులకు వారి సొంత రాష్ట్రాలలో ఉన్న క్రెడిబిలిటీ ఏమిటో ఎవరికీ తెలియదు. దేశంలో రైతు నాయకుడిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్న తికాయత్ వస్తారని ప్రచారం జరిగినా, ఆయన రాలేదు. అలాగే, స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా బీఆర్ఎస్ వేదిక మీద కనిపించలేదు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. కేజ్రివాల్ కాదు కదా ఆయన పార్టీ నుంచి మరో నాయకుడు కనీసం ఉప ముఖ్యమంత్రి సిసోడియా అయినా కేసీఆర్ ను పలకరించిన పాపాన పోలేదు. అంతే కాదు, హైదరాబాద్’ లో కట్టి నట్లు , అడ్డదిడ్డంగా అనుమతులు లేకుండా, కట్టిన, ‘దేశ్ కీ నేతా కేసేఆర్ బ్యానర్లు, పోస్టర్లను ఆప్ సర్కార్ కట్ట కట్టి చెత్త కుప్పలో పడేసింది. అనుమతులు లేకుండా బ్యానర్లు, హోర్డింగులు కట్టినందుకు ఢిల్లీ ఆప్ సర్కార్ కేసులు పెట్టిందో లేదో తెలియదు కానీ, తెలంగాణ ప్రజల పైసలు మూట కట్టి ఆప్ ఏలుబడిలోని పంజాబ్ లో పందారం చేసినా, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాత్రం తమ్ముడు తమ్ముడే పేకాటే అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస మర్యాద ఇవ్వలేదు. నిజానికి ఇప్పుడే కాదు గతంలోనూ కేసేఆర్ ను కేజ్రీవాల్ ఇంతకంటే ఘోరంగా అవమానించారు. ఇంచుమించుగా వారం రోజులు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు దగ్గరే ఆపేశారు.
ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు, గతంలో ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు డబ్బుల మూటలో వెళ్ళినప్పుడు కేసేఆర్ కు స్వగతం పలికిన బీహార్, ఝారఖండ్ ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ వేడుకకు రాలేదు. కనీసం ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన విషయాన్నీ గుర్తించ లేదు. కనీసం, మాటవరసకు అయినా ‘ఆల్ ది బెస్ట్’ చెప్పలేదు. చివరకు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, తెరాసతో జట్టు కట్టిన ఉభయకమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులు కనీసం మర్యాదపూర్వకంగా అయినా కేసేఆర్ ను పలకరించలేదు.
ఎవరి దాకానో ఎందుకు, రాష్ట్రం నుంచి అనేక అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెక్కలుకట్టుకుని విమానాల్లో ఢిల్లీ వెళ్ళారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ఎందుకనో ఢిల్లీ పండక్కి డుమ్మా కొట్టారు. వై ..ఎదుకు .. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమం చాంతాడంత రాగం తీసి ఏదో పాట పడినట్లు ముగిసిందని, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో కేసేఆర్, సింపుల్ గా మరోసారి ఒంటరి అయిపోయారనే విషయం రుజువైందే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదని పార్టీ నాయకులు మరో ‘సారీ’ నిట్టురుస్తున్నారు. అక్కడా .. ఆనలుగురితోనే అయింది, అనిపించారని, ఢిల్లీ వెళ్లి వచ్చిన ముఖ్య నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.