జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం?
posted on Dec 14, 2022 @ 10:14AM
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ లక్ష్మీనారాయణకు పరిచయం అవసరం లేదు. సిబిఐలో ఆయన హోదా (జేడీ)నే ఇంటి పేరుగా మార్చుకున్నఆయన అసలు పేరు, వీవీ లక్ష్మి నారాయణ, వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ. ఆ పేరుతో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టక పోవచ్చును కానీ, జేడీ అంటే చాలు, లక్ష్మీనారాయణ కళ్ళ ముందు కనిపిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జేడీ లక్ష్మినారాయణ వార్తల్లో వ్యక్తిగా, మీడియలో తరచు కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పడు ఇక్కడ ఆయన ప్రస్తావనకు ఆయన సిబిఐ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం లేదు. అయితే అందుకో కారణం వుంది. నో .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిబిఐ విచారణ ఎదుర్కుంటున్న తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కుమార్తె తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కేసు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విశ్లేషణలు, ఇక్కడ ఆయన ప్రస్తావనకు కారణం కాదు.
నిజానికి ఆయన పూర్వాశ్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయినా సిబిఐ వాసనలు ఆయనను వదలక పోయినా, ఆయన ప్రస్తుతం ఒక పొలిటీషియన్. రాజకీయ వేత్త. ఆరేడేళ్ళ కిందట స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఓడి పోయారు.ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. అయితే అయిన రాజకీయాలను వదిలేయలేదు. మరో పార్టీలో చేరలేదు కానీ రాజకీయాలో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అంతే కాదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి మళ్లీ పోటీ చేస్తానని.. ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఇప్పడు అదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. జేడీ ఏ పార్టీలో చేరతారు అనే విషయం కట్టప్పను ఎవరు చంపారు స్థాయిలో టెన్షన్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు.
మరో వంక చాలా కాలంగా జేడీ రాజీకీయ భవిష్యత్ ప్రస్థానం గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బీజేపీలో చేరతారని అంటుంటే.. మరికొందరు వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇంకొందరు టీడీపీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారు. మరోవంక మాజీ జేడి అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే అదలా ఉంటే గత నాలుగైదు రోజులుగా జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ప్రస్థానం గురించి మరో బ్రేకింగ్ న్యూస్ వినవస్తోంది. అవును జేడీ లక్ష్మినారాయణను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పార్టీలలో మరో పార్టీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా జాతీయ రాజకీయ యవనిక పై తెలంగాణ జెండా ఎగరేసే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల ‘జాతీయ’ పార్టీ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారాస ఏపీ బాధ్యతలు చూస్తున్నట్లు చెపుతున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాజీ జేడీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే తలసాని జేడీతో కలవాలని అనుకుంటోంది, అందుకోసంగా ఆయనను ఫోనులో సంప్రదించింది నిజమే అయినా ఆయనని పార్టీలోకి ఆహ్వానించేందుకు కలవాలనుకుంటున్నారా లేక కవిత కేసులో సలహాలు తీసుకునేందుకు కలవాలని అనుకుంటున్నారా? అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. నిజానికి, ఈ అనుమానంతోనే కావచ్చును జేడీ లక్షినారాయణ ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా ఒక ఆలోచనకు రాలేదని సున్నితంగా తలసానికి నో .. చెప్పినట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే, ఇంతవరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై అంతగా దృష్టి పెట్టని కేసీఆర్ ఇప్పడు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించారని ఏపీలో ముఖ్యంగా కాపు వర్గం పై దృష్టి పెట్టారని అంటున్నారు. అందులో భాగంగానే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కోడి పందేల బంధుత్వాలు, టీడీపీ రాజకీయ చుట్టరికాలు ఉన్న తలసాని శ్రీనివాస రావుకు ఏపీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికకి చెందిన జేడీ లక్ష్మీనారాయణతో సంప్రదింపులు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎలగైనా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని గట్టిగా భావిస్తు జేడీ లక్ష్మీనారాయణ అసలు ఏ పార్టీలోనూ చేరక పోవచ్చని చివరకు ఒక జాతీయ పార్టీ ప్రత్యక్ష, మరో ప్రాంతీయ పార్టీ పరోక్ష మద్దతుతో విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన నడుస్తోందని అంటున్నారు.
నిజానికి స్వయంగా జేడీ లక్ష్మినారాయణ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం లేకపోలేదని సూచన ప్రాయంగా చెప్పారు. కర్ణాటకలో సినీనటి సుమలత అంబరీష్ ఎంచుకున్న మార్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరి మద్దతు పొందే అవకాశం ఉంటుందని ఆయన అత్యత సన్నిహిత మిత్రులు అంటున్నారు. సో .. జేడీ భారాస లో చేరతారా, లేదా, అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందనే అనుకోవచ్చును.