ఖమ్మంలో సైకిల్ సవారీ
posted on Dec 14, 2022 @ 1:48PM
కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తన కారును దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు దేశ రాజధాని హస్తినలో సమాయత్తమైతే.. సైకిల్ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో సైకిల్ సవారీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో డిసెంబర్ 21వ తేదీన ఖమ్మంలో తెలంగాణ టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అంతా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని సమాచారం. అయితే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు బాధ్యతను ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లకు చంద్రబాబు అప్పగించారని.. అందుకు సంబంధించిన పనులు వారు.. వాయువేగంతో చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అలాగే పార్టీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా తెలంగాణలోని పలువురు కీలక నేతలతో చంద్రబాబు భేటీ అయి చర్చించారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాతోపాటు హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తొలుత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు టీటీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. అదీకాక.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు పార్టీలోకి జంప్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకొని.. దేశ రాజధాని హస్తినలో చక్రం తిప్పి..బీజేపీకి ఝలక్ ఇవ్వాలని తెగ ఊవ్విళ్లూరుతోంది. దీంతో గులాబీ పార్టీ ప్రాంతీయ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ వాదాన్ని చేపట్టినట్లు అయింది. అలాంటి వేళ.. టీడీపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతానికి రంగం సిద్దం చేసుకొంటోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సైకిల్ పార్టీలోని కీలక నేతలంతా... కారు పార్టీలో చేరిపోయారు. దీంతో సదరు పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చనట్లు కనిపించింది. కానీ సైకిల్ పార్టీలో కేడర్ మాత్రం అలాగే జెండా కర్రలాగా నిలబడి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా..ఆ ఎన్నికల్లో తెలుగు దేశం తన సత్తా చాటుతోంది. తాజాగా కాసాని జ్జానేశ్వర్.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సైకిల్ సవారీ జోరందుకొందనే ఓ చర్చ అయితే తెలంగాణలో సవారీ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో కూడా తెలుగుదేశం పార్టీ భారీ సభ నిర్వహించేందుకు సన్నాహలు చేపట్టనుందని.. దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు నయా జోష్ వస్తుందనే ఓ టాక్ అయితే పసుపు దళంలో వైరల్ అవుతోంది.