హస్తినలో బీఆర్ఎస్.. క్యా సీన్ హై!
posted on Dec 15, 2022 @ 11:00AM
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం దొరకదు. దాదాపునాలుగేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం చేయని ప్రయత్నం లేదు.. కలవని పార్టీ లేదు.
ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరకు, బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ మొదలు యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేతఅఖిలేష్ యాదవ్ వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి తమిళనాడు సీఎం స్టాలిన్ దాకా అందరినీ కలిసారు. వీళ్లూ వాళ్లూ అని లేకుండా బీజేపీ యేతర పార్టీల నేతలందరినీ కలిశారు. కానీ జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని మినహాయిస్తే ఇంకెవరూ కేసీఆర్ తో కలిసి నడవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేసేశారు.
కానీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని, కేసీఆర్ ఆయన పరివారం ఎంతగా ప్రచారం చేసుకున్నా అదిఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ కాదు. దానికా గుర్తింపు రాదు. సరే అధికారిక గుర్తింపు సంగతి పక్కన పెడదాం. కానీ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి ఏమైనా స్వాగతం లభిస్తోందా? అంటే దానికీ సంతృప్తి కరమైన సమాధానం రాదు. సరే హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆర్భాటంగా యాగం చేసి మరీ ప్రారంభించిన కేసీఆర్ కు అక్కడైనా ఏమైనా సానుకూల స్పందన లభించిందా అంటే అదీ లేదు.
హైదరాబాద లో పార్టీ ఆవిర్బావ సభకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మాత్రమే వచ్చారు. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామికి అదనంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒకరు కలిశారు అంతే. పోనీ జాతీయ మీడియా అయినా రాజకీయ యవనికపై ఒక కొత్త పార్టీ వచ్చి చేరిందన్న ఆసక్తి కూడా కనబరచలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం వ్యవహారం అంతా ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారంగా జాతీయ మీడియా లైట్ తీసుకుంది. బీఆర్ఎస్ ను అస్సలు పట్టించుకోలేదు.
ఏదో ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని ఢల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటోందంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించింది. దేశ రాజధాని నగరంలో యాగం చేసి, నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లతో హడావుడి చేసినా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలకు జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా కేసీఆర్ జాతీయ మీడియాకు కోట్లాది రూపాయల అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. జాతీయ చానెళ్లకైతే స్లాట్లు తీసుకుని మరీ తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేసుకున్నారు. అవేవీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేసే విధంగా జాతీయ మీడియాను కదిలించలేకపోయాయి. అంతే కాకుండా బీఆర్ఎస్ కు జాతీయ, అంతర్జాతీయ మీడియా కో ఆర్డినేటర్ గా కేసీఆర్ తన బిడ్డ కవితను నియమించారనీ, ఆమె రికమెండ్ చేసిన విధంగా ఒక పీఆర్వోను కూడా నియమించారనీ అంటున్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీసంగా కూడా ప్రచారం చేయించుకోలేకపోయారు.
మీడియా సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం జరుగుతోందనే గుర్తించ లేదు. కనీసం అటుకేసి తొంగి చూడలేదు. ఆయన ఆహ్వానం అందిందా? అందలేదా అన్నది వేరే ప్రశ్న.. కానీ బీజేపీని వ్యతిరేకించే బలమైన పార్టీ నాయకుడిగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరో బీజేపీ వ్యతిరేక పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడమే బీఆర్ఎస్ విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నది స్పష్టమౌతుంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీరెవరూ ఇటు కేసి కనీసం చూడను కూడా చూడ లేదు. దీనిని బట్టి చూస్తే పేరు మార్పు తప్ప బీఆర్ఎస్ తో కేసీఆర్ సాధించిందేమీ లేదని పరిశీలకలు అంటున్నారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరు మార్పు ప్రహసనంగానే మిగిలిపోయిందంటున్నారు.