రాజ్యసభలో శునకోపాఖ్యానం

రాజస్థాన్ లో జరుగుతున్న రాహుల్ భారత జోడో యాత్రలో పాల్గొన్న ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభ దద్దరిల్లింది. ఇంతకీ మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో యాత్రలో ఏమన్నారంటే.. భారత దేశం కోసం నిజమైన త్యాగాలు చేసినది కాంగ్రెస్సేననీ, బీజేపీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదనీ అన్నారు. ఈ వ్యాఖ్యలే రాజ్యసభను అట్టుడికించేశాయి. మల్లికార్జున్ ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఖర్గే నిరాకరించారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ వారిస్తున్నా బీజేపీ సభ్యలు శాంతించలేదు. ఆందోళనకు దిగారు . సోమవారం(డిసెంబర్ 19) ఖర్గే రాజస్థాన్ లోన అల్వార్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లడారు. పులిలా గర్జిస్తామంటుంది కానీ పిల్లిలా  ప్రవర్తిస్తుందంటూ కేంద్ర ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు.  సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా.. చేతులు ముడుకుచుని కూర్చుంటుందని దుయ్యబట్టారు. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చకు మాత్రం అంగీకరించదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కాంగ్రెస్ నిలబడిందనీ, ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారనీ ఖర్గే అన్నారు. అదే సమయంలో బీజేపీ దేశం కోసం ఒక్క శునకాన్ని  కూడా కోల్పోలేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలే మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభలో దుమారానికి కారణమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సభలో ఆందోళకు దిగింది. ఖర్గే క్షమాపణకు డిమాండ్ చేసింది. అయితే ఖర్గే క్షమాపణకు ససేమిరా అన్నారు. పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారనీ, బీజేపీలో ఎవరు  ప్రాణ త్యాగం చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు.  

యువతి కిడ్నాప్

తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్ధం నిర్ణయించారని నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన మరువక ముందే.. దాదాపు అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి గుడికి వెళ్లి వస్తున్న యువతిని కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన తండ్రిని తోసేసి మరీ ఆమెను కారులో ఎక్కించుకుని ఉడాయించారు. కాగా ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుకా ప్రేమ వ్యవహారమే ఉందని అనుమానిస్తున్నారు. కాగా తండ్రిని తోసేసి యువతిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో మంగళవారం(డిసెంబర్ 20) జరిగింది. వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాడపల్లికి చెందిన గోలి శాలిని తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా  ఈ కిడ్నాప్ జరిగింది.  కాగా అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్ తన కుమార్తెను కిడ్నాప్ చేయించాడని శాలిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు ఏడాది కింద కూడా జాన్ శాలినిని తీసుకు వెళ్లాడనీ, అప్పటికి శాలిని మైనర్ కావడంతో పోలీసులు జాన్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శాలినిని తల్లిదండ్రులకు అప్పగించారు. మైనారిటీ తీరిన శాలినికి వేరే యువకుడితో నిశ్చితార్ధం జరిగిన నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరగడంతో పోలీసులు కూడా జాన్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాలిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.  

మిల్లెట్స్ కు వ్యవస్థీకృత ప్రచారం.. యోగా అంతటి ప్రాచుర్యం

ప్రపంచానికి భారత్ ఇచ్చిన అపురూప కానుక యోగా.. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్య రక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. యోగాకు ఎంతటి ప్రాచుర్యం లభించిందో మన సిరిధాన్యాలు (మిల్లెట్స్) కు కూడా అంతటి ప్రాచుర్యం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అత్యధిక పోషక విలువలు ఉన్న సిరిధాన్యాల వినియోగం మానవ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పిన మోడీ వీటికి వ్యవస్థీకృత ప్రచారాన్ని కల్పించాలని అన్నారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎంపీలందరికీ మంగళవారం (డిసెంబర్ 20) మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని హాజరయ్యారు. ఎంపీలకు మిల్లెట్స్ లంచ్ లో రాగి, జొన్న, బజ్రా తదితర మిల్లెట్స్ పదార్థాలను వడ్డించారు. 

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారం కోసం దిగ్విజయ్ సింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఒక వైపు సీనియర్ల అలక, మరో వైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన నాయకుల రాజీనామాలతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణకు పార్టీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. పార్టీలో సీనియర్ నేత, సంక్షోభ నివారణలో దిట్టగా గుర్తింపు పొందిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. తెలంగాణ కాంగ్రెస్ సలహాదారు బాధ్యతలను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఆయన నేడో రేపే రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం  రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు రేపిన సంగతి విదితమే.   టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పింది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెట్టే యత్నం చేసింది. ఇందులో భాగంగానే వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు  చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది.   టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు. తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను  తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ మేరకు వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కులేఖ రాశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన పార్టీ హైకమాండ్ డిగ్గీ రాజాను రంగంలోకి దింపింది. ఆయనను  టీ కాంగ్రెస్ అడ్వయిజర్ బాధ్యతను అప్పగించింది.నేడో రేపో దిగ్విజయ్ సింగ్ టీ. కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారని అంటున్నారు.   

అధికారులపై విమర్శల వెనుక మోహన్ బాబు టార్గెట్ జగనేనా?

మోహన్ బాబు నటనలోనే కాదు.. వ్యవహార శైలిలోనూ తనదైన విలక్షణత ప్రదర్శిస్తారు. ఆయన ఏం మాట్లాడినా నిర్మొహమాటంగా ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని తన మనసులో మాటను చెప్పకుండా ఉండరు. అయితే  ఆ నిర్మొహమాటం తరచుగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. దీంతో మోహన్ బాబును వివాదాలు వెతుక్కుంటూ వస్తాయా? మోహన్ బాబే వాటిని వెతుక్కుంటూ వెళతారా అన్న సంశయం ఆయన అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ తరచూ వ్యక్తం అవుతూ ఉంటుంది. నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు తన రాజకీయ ప్రస్థానంలో కూడా విజయాల బాటే పట్టారు. తెలుగుదేశం తరఫున ఒక సారి రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత రాజకీయంగా ఏ మంత క్రియాశీలంగా లేరనే చెప్పాలి. తొలుత తెలుగుదేశంలో ఒకింత క్రియాశీలంగా వ్యవహరించినా.. ఆ పార్టీకి దూరమైన తరువాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే వరకూ ఆయన రాజకీయంగా చురుకుగా లేరు. జగన్ అదికారంలోకి వచ్చిన తరువాత ఏదో పదవి రాకపోతుందా అని మూడున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నా.. పదవి కాదు కదా, కనీస గుర్తింపు లేకుండా పోయిందన్న వేదన ఆయనలో గూడుకట్టుకందని అంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ తెలుగు దేశం గూటికి చేరతారన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమైంది. ఇందుకు తార్కాణంగా వారు ఇటీవల ఒక సందర్బంగా మోహన్ బాబు తెలుగుదేవం అధినేత చంద్రబాబునాయుడిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడాన్ని చెబుతున్నారు. అయితే తన కాలేజీ ఆవరణలో షిరిడీ సాయిబాబా విగ్రహావిష్కరణకు చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లినట్లు చెప్పారు అది వేరే విషయం. అయితే ఆ భేటీ మాత్రం అప్పట్లో సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కూడా పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు   తిరుపతిలోని తన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం  ఆందోళన చేశారు. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా కూడా నిర్వహించారు.  ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలా ఆయన జగన్ పార్టీకి దగ్గరయ్యారు. చివరికి ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత పార్టీలో ఆయనకు వీసమెత్తు గౌరవం కానీ, ప్రాధాన్యత కానీ దక్క లేదు. దీంతో ఆయన కూడా నెమ్మది నెమ్మదిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒక సారి ప్రధాని మోడీతో భేటీ అయినా ఆయన రాజకీయంగా క్రియాశీలంగా మాత్రం లేరు. అయినా ఆయనలో తాను వైసీపీ కోసం కష్టపడి పని చేసినా.. పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తనను నిర్లక్ష్యం చేయడం పట్ల మోహన్ బాబులో అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మోహన్ బాబు చూచాయిగా బయటపెట్టారు కూడా. అప్పట్లో అంటే చంద్రబాబు హయంలో తన విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని రోడ్డెక్కిన మోహన్ బాబు.. ఇప్పుడు అంటే జనగ్ హయాంలో కూడా అదే పరిస్థితి ఉంది ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మోహన్ బాబు తనకు టీటీడీ  చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించారని, అయితే జగన్ పట్టించుకోకపోవడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారనీ ఆయన సన్నిహితులు చెబుతారు.  ఈ నేపథ్యంలోనే చిన్నవో చితకవో అలీ, పోసాని, సింగర్ మంగ్లిలకు పదవులిచ్చిన జగన్ మోహన్ బాబును పూర్తిగా విస్మరించడంతో రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన విశాల్ సినిమా లాఠీ ప్రముష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు జగన్ సర్కార్ లక్ష్యంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. నిజమే లాఠీ ప్రమోషన్ కార్యక్రమంలో మోహన్ బాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో చేసిన వ్యాఖ్యల టార్గెట్ జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కార్యక్రమంలో తనకు పోలీసు అధికారులంటే గౌరవం అని చెబుతూనే వారు అధికారంలో ఉన్న వారి కోసమే పని చేస్తారని, సామాన్యుల గురించి పట్టించుకోరనీ అన్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన తాను చేసిన వ్యాఖ్యలను నిర్మొహమాటం మాటున కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థపై విమర్శలు చేయడమంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే. తిరుపతిలో మోహన్ బాబు అదే చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనీ, అధికారులకు కొమ్ముకాయడమే పోలీసులు డ్యూటీగా భావిస్తున్నారనీ చెప్పకనే చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.  

కుప్పంలో పోటీకి విశాల్ నో.. జగన్ తో భేటీకి సై..

తమిళ సూపర్ స్టార్ విశాల్ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ మూలాలున్న విశాల్ తమిళనాట స్థిర పడి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు  పొందారు. విశాల్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి విజయవంతమయ్యాయి. దీంతో తెలుగునాట కూడా విశాల్ కు మంచి గుర్తింపు ఉంది.  అటువంటి విశాల్  ఏపీలో రాజకీయ ప్రవేశం చేయనున్నారన్న వార్త గత కొంత కాలంగా ఏపీలో హల్ చల్ చేస్తోంది. మామూలుగా ఆయన ఏదో ఒక పార్టీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతారన్న వార్తలైతే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు.. కానీ ఆయన ఏకంగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో పోటీకి నిలబడనున్నారన్న ప్రచారం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కుప్పం టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ఎంతో మందిని అక్కడ నుంచి నిలబెట్టాలని చూశారు. కుప్పం నుంచి కచ్చితంగా గెలిచే అభ్యర్థినే రంగంలోకి దింపాలని భావించిన ఆయనకు పార్టీలో అందుకు సమర్ద నాయకుడెవరూ కనిపించలేదు. దీంతో కుప్పంతో సంబంధాలున్న తమిళనటుడు విశాల్ పై ఆయన దృష్టి పడింది. దీంతో విశాల్ అంగీకారంతో సంబంధం లేకుండానే కుప్పం వైసీపీ అభ్యర్థి విశాల్ అన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో జరిగింది.  ఒక దశలో ఇది వాస్తవమే అని అంతా నమ్మే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇందుకు కారణం కుప్పంతో విశాల్ కు ఉన్న అనుబంధం. గతంలో విశాల్ తండ్రి కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో తండ్రికి సహాయంగా విశాల్ కూడా కుప్పంలోనే ఉండేవారు. అందుకే కుప్పంలోని వీధి వీధి విశాల్ కు తెలుసు. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అదీ కాకుండా తమిళనాడుకు సమీపంగా ఉండే చిత్తూరు జిల్లాలో తమిళ సినిమాలకూ, తమిళ నటులకూ మంచి క్రేజ్ ఉంది. అందుకే విశాల్ ఏపీ రాజకీయాలలో  కుప్పం నుంచి అడుగుపెడతారన్న ప్రచారానికి ప్రాధాన్యత పెరిగింది. అన్నిటికంటే విశాల్ కుప్పం వ్యవహారానికి రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి కారణం కుప్పం తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  సొంత నియోజకవర్గం. దీంతో విశాల్ అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం అన్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా విశాల్ తన కొత్త చిత్రం లాఠీ ప్రమోషన్్సలో భాగంగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఆయన కుప్పం పొలిటికల్ ఎంట్రీ వార్తలన్నీ ఒట్టి వదంతులేనని తేల్చేసింది. తాను ఏపీ రాజకీయాలలో కాలుపెట్టడం లేదని నిర్ద్వంద్వంగా చెప్పేసిన విశాల్.. ఈ సందర్బంగా తనకు ఏపీ సీఎం జగన్ అంటే అభిమానమని కూడా చాటారు. ఆయన మీద అభిమానం ఉన్నంత మాత్రాన ఆయన చెప్పినట్లుగా కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని ఎలా భావిస్తారని ఎదురు ప్రశ్నించారు. కానీ అదే సమయంలో విశాల్ తాను జగన్ తో మంగళవారం బేటీ కానున్నారని చెప్పారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాముఖ్యత ఏదీ లేదని కూడా ఎవరూ అడగకుండానే చెప్పారు. దీంతో ఈ భేటీ ఆంతర్యమేమిటన్న చర్చ సర్వత్రా మొదలైంది. విశాల్ తన స్థాయి ఎమ్మెల్యే కంటే ఎక్కువ అని చెప్పుకున్నారు. గుర్తింపు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ ఎమ్మెల్యే కంటే తన స్థాయి ఎక్కవ అన్నారు విశాల్. రాను రానంటూనే.. విశాల్ జగన్ తో భేటీకి సిద్ధమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   వైసీపీ ఎప్పటి నుండో కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఉంది. ఇక్కడ దెబ్బకొట్టి టీడీపీ అధినేత చంద్రబాబును కోలుకోకుండా చేయాలన్నది జగన్ తన లక్ష్యంగా చెబుతూ వస్తున్నారు. అందుకే విశాల్ జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకే సమయంలో విశాల్ రాజకీయాల పట్ల అనాసక్తిని, జగన్ పట్ల అనురక్తినీ ప్రకటించి ఏపీ సీఎంతో భేటీపై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండేంత ఉత్కంఠ రేకెత్తించారు. ఆయన ఎంతగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టే ప్రశ్నే లేదని చెబుతున్నా.. తమిళ ఫిల్మ్ అసోసియేషన్ వ్యవహారాలలో విశాల్ పోషించిన క్రియాశీల పాత్ర ఆయన అడుగులు రాజకీయాలవైపే అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ ఏపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తారా అన్న చర్చ మాత్రం సశేషంగా సాగుతూనే ఉంది. జగన్ తో భేటీ అనంతరం విశాల్ ఏం చెబుతారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది.   సినిమా నటుడిగా విశాల్ కు ఎంత అభిమానం ఉన్నా.. రాజకీయ నాయకుడిగా ఆయనను జనం ఆదరిస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తమౌతోంది. కేవలం సినిమా గుర్తింపుతోనే రాజకీయాలలో రాణించడం ఏమంత సులువు కాదని చిరంజీవి, పవన్ కల్యాణ్ ల విషయంలో ఇప్పటికే రుజువైపోయింది. ఎంతటి ప్రముఖ నటుడైనా విశాల్ నటన, ప్రజాదరణ విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు సాటి రారనడంలో సందేహం లేదు.  అయినా వైసీపీ శ్రేణులు అవసరానికి మించి విశాల్ కు హైప్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

అమెరికాలో అన్నగారి విగ్రహం

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు వారి గుండె చప్పుడు, నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్. అయన మరణించి ఎన్నేళ్లు అవుతున్నా అయన సినిమాలు, ప్రజా సేవ ఆయనకు ప్రజల హృదయాలయాల్లోసుస్థిర స్థానం ఏర్పరిచాయి.  ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయనను తమ అభిమాన నాయకుడిగా గుండెల్లో గుడి కట్టిపూజిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఆయన విగ్రహం ఏర్పాటు కాబోతోంది.    అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అక్కడి స్థానిక నాయకులు ముందుకొచ్చారు. అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఎడిసన్ సిటీ మేయర్ కు ప్రతిపాదించారు. అందుకు ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. దీంతో 2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా  తెలుగు  వెలుగు నందమూరి తారక రామారావు  విగ్రహాన్ని అమెరికా న్యూ జెర్సీ ఎడిసన్ సిటీలో ప్రతిష్టించనున్నారు. 

మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు.. నిజమేనా?

డిమానిటైజేషన్ తరువాత మాయమైపోయిన వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి వెయ్యి రూపాయల నోట్లు చెలామణిలోకి రానున్నాయా? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చ  సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ రాబోతున్నాయన్న చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా రద్దవుతాయని, వాటి స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వెయ్యి రూపాయల నోట్లు విడుదల కావట్లేదని తెలుస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ తేల్చేసింది. ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని పేర్కోంది. రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడాన్ని ఆర్బీఐ ఎప్పుడో ఆపేసిందని ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందన్న ఊహాగానాలు మెదలయ్యాయి. అలాగే త్వరలో వెయ్యి రూపాయల నోట్ల విడుదల కానున్నాయన్న ప్రచారమూ మొదలైంది. అయితే ఈ రెండు ప్రచారాలలోనూ వాస్తవం లేదని పీఐబీ అనే ఫ్యాక్ట్ చెక్  సంస్థ తెలిపింది. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. పీఐబీ సంస్థ ప్రభుత్వ పథకాలపై జరిగే ప్రచారాల విషయంలో వాస్తవాలు వెలికి తీస్తుంది. ప్రజల సందేహాలు తీరుస్తుంది.  

ఇదేం అరాచకం తల్లీ... హోటల్ లో ఫారిన్ టూరిస్ట్ వీరంగం

అరాచకత్వానికి , విశృంఖలతకు పరాకాష్ట అన్నట్లుగా వ్యవహరించిందో ఫారిన్ టూరిస్ట్. హోటల్ కారిడార్ లో నగ్నంగా తిరుగుతూ సిబ్బందిపై దాడికి పాల్పడింది. మత్తు తలకెక్కితే విచక్షణ మాయమౌతుంది. తామెక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం ఉండదు. రాజస్థాన్ లో ఒ విదేశీ టూరిస్టు వ్యవహరించిన తీరు అచ్చం అలాగే ఉంది.ప జైపూర్ లో ఓ విదేశీ మహిళా టూరిస్టు హోటల్ సిబ్బందిపై విరుచుకుపడటం చూస్తే.. ఆమె ఒళ్లు తెలియనంతగా మత్తులో ముగినిపోయి ఉంటుందని అనిపించక మానదు.ప ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. విదేశీ వనిత జైపూర్ కు టూరిస్టు గా వచ్చి ఆ హోటల్ లో బస చేసింది. ఏం జరిగిందన్నది తెలియదు కానీ ఆమె నగ్నంగా తన గది నుంచి బయటకు వచ్చింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా..వారిపై ముష్టిఘాతాలతో దాడికి దిగింది. కాలితో తన్నింది. ఆమె ఇంత వయలెంట్ గా ప్రవర్తించడానికి కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే సిబ్బంది మాత్రం ఆమెను నియంత్రించలేక పోలీసులను ఆశ్రయించారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా తన గది నుంచి బయటకు వచ్చిన ఆ విదేశీ పర్యాటకురాలిని నచ్చజెప్పి గదిలోకి పంపించడానికి ఆ హోటల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారామెను సముదాయించడానికి ప్రయత్నించిన కొద్దీ రెచ్చిపోయి దాడులకు దిగింది. ఆమె సిబ్బందిని దూషిస్తూ, దాడి చేయడాన్ని కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి నెట్టింట పోస్టు చేశారు.  ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది. డ్రగ్స్ మత్తులో ఆమె అలా వీరంగం సృష్టించి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. 

వైసీపీ మంత్రులకు ఎదురుగాలి?.. 60 నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి ఖరారేనా?

వైసీపీ మంత్రులకు రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోంది. జగన్ సర్కార్ తీవ్ర మైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. తమ తమ నియోజకవర్గాలలో వారికి ప్రజాదరణ కరవైందని తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం తమ తమ నియోజకవర్గాలలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మంత్రులలో రోజా, విడదల రజని,  ఉషశ్రీ చరణ్ , గుడివాడ అమర్నాథ్,  సిదిరి అప్పలరాజు, జోగి రమేష్, శంకర్ నారాయణ,  మెరుగు నాగార్జున ఉన్నారు. ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రమంతా నడిచి  వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నిజమే.. అఖండ మెజారిటీతో ఆయన ఒంటి చేత్తో పార్టీకి అధికారాన్ని సముపార్జించి పెట్టారు.  అయితే ఈ మూడున్నరేళ్లలో జగన్ కు ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు  అని జనం వగచేలా ఆయన పాలన ఉంది.    రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అది మూడు శాతానికి పడిపోయింది.   నిజానికి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. అందుకే, ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న  పర్యటనలకు లభిస్తున్న ఆదరణ చూస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో,  అర్థమవుతుంది. జగన్ పార్టీ విజయావకాశాలపై ఇటీవలి కాలంలో వచ్చిన సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయి. ఆయన గ్రాఫ్ అతి వేగంగా పడిపోతోందని.  కాగా తాజాగా శ్రీ ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కనీసంలో కనీసం 60 స్థానాలలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉందని.. అంటే 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ పార్టీ ఎన్నికలు జరగడానికి ముందే కనీసం 60కి పైగా స్థానాలలో వైసీపీ విజయం కోసం ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయని శ్రీ ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.   రాష్ట్రంలోని 70 వరకూ నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మంత్రులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని  శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. ఆయా   నియోజకవర్గాలలో మంత్రి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం,  మరో మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరి పేట నియోజకవర్గం, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం కూడా ఉన్నాయి. కూడా ఉండటం గమనార్హం.  ఇక పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, విజయనగరం, బొబ్బిలి, కురుపాంలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, అనకాపల్లి, అరకు, పాయకరావు పేల, గాజువాక నియోజవర్గాలలో వైకాపీ అత్యంత బలహీనంగా ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, నిడదవోలు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాలలో వైపీపీ పరిస్థితి ఎదురీతగానే ఉందని సర్వే వెల్లడించింది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జిల్లా పరిధిలోని విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ, పెడనలలోనూ, గుంటూరు జిల్లాలోని తాడి కొండ, వినుకొండ, చిలకలూరి పేట, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, వేమూరు, పొన్నూరులలో వైసీపీ తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జల్లాలోని సంత నూతల పాడు, కనిగిరి, పరుచూరు, అద్దంకి, దర్శిలలోనూ, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, కావలి, గూడూరు, ఉదయగిరిలలోనూ వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో కూడా మైదుకూరు, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, కల్యాణ దుర్గం నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. అదే విధంగా కర్నూలుజల్లాలో కూడా కర్నూలు, నంది కొట్కూరు, పత్తికొండ, పాణ్యం, ఆలూరులలోనూ, చిత్తూరు జిల్లా నగరి, సత్యవేడు, పుతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తున్నది.  ముఖ్యమంత్రి జగన్ సహా అధికార పార్టీ నాయకుల సభలు జనంలేక వెలవెలబోవడం, అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టడంతో రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే కూడా ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేదిగానే ఉంది.

వరుడి పేరుకు మ్యాచ్ అయ్యే కానుక.. ఏమిటో తెలుసా?

పెళ్లి కానుకలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. స్నేహితులు పెళ్లి కానుకగా పాలసీతా ఇచ్చిన ఉదంతాలు చూశాం. అలాగే కండోమ్ లు ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి.  అయితే ఉత్తర ప్రదేశ్ లో మాత్రం పెళ్లి కూతురి తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక మాత్రం ఎవరికైనా షాక్ కలిగించక మానదు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నిబంధనల ఉల్లంఘనులు, నేరస్థులు, పన్ను ఎగవేతదారులు ఇలా ఒకరేమిటి తప్పు చేశారనిపిస్తే చాలు వాళ్ల ఇళ్ల మీదకు బుల్ డోజర్లను పంపించేస్తుంటారు. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బుల్డోజర్ సిఎం అని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూ, పెళ్లికుమారుడికి వధువు తండ్రి ఇచ్చిన కానుకకూ సంబంధం ఏమిటంటారా? ఉంది. ఆ సంబంధం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా వరుడి పేరు తెలుసుకుని తీరాలి. సరే వివరాల్లోకి వెళితే..   యూపీలోని దేవ్‌గావ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు పరశురామ్ కుమార్తె నేహాకు నౌకాద‌ళంలో ప‌నిచేస్తున్న సౌఖ‌ర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగికి ఈ నెల 15న వివాహం జరిగింది. ఈ సందర్భంగా నేహా తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేససింది. ఇంతకీ ఆ మామ తన కొత్తల్లుడికి ఇచ్చిన కానుక ఏమిటంటారు. బుల్డోజర్. ఔను బుల్డోజరే. పెళ్లి కొడుకు పేరు యోగి అవ్వడంతో సింబాలిక్ గా ఆయన తన అల్లుడికి బుల్ డోజర్ కానుకగా ఇచ్చాడు. ఇది పెళ్లికి వచ్చిన వారినే కాదు పెళ్లి కుమారుడినీ ఆశ్చర్య పరిచింది. వరకట్నం వద్దన్న అల్లుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని భావించిన మామ  త‌న అల్లుడికి క‌ట్నంగా బుల్డోజ‌ర్‌ను ఇచ్చాడు ప‌ర‌శురామ్. ఇది చూసిన అక్క‌డి వారు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. యోగి అన్న పేరున్నందుకు బుల్ డోజర్ బహుమతిగా వచ్చిందా బ్రో.. బాధపడకు.. అన్యాయాన్ని బుల్ డోజ్ చేసేయ్ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు సంధిస్తున్నారు.  దీనిపై పెళ్లి కొడుకు యోగి మాట్లాడుతూ..   తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్‌డోజర్‌ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారన్నారు.

ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన

అదో వంతెన.. పూర్తయ్యి ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి నోచుకోకపోవడానికి కారణం తెలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్దమౌతుంది. బీహార్ లో సీఎం నాబార్డ్ పథకం కింద నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన పర్తై ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభం కాకుండానే కుప్పకూలిపోయింది. ఇంతకీ బగుసరాయ్ లోని గండక్ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ఎందుకు నోచుకోలేదంటే.. ఆ వంతెనకు అప్రోచ్ రోడ్డు లేకపోవడమే. నాడా దొరికిందని గుర్రం కోసం వెతికిన చందంగా నిధులు మంజూరయ్యాయనీ వంతెన నిర్మించేశారు. అప్రోచ్ రోడ్డు కు మాత్రం ఐదేళ్లుగా మోక్షం కలగలేదు. ఈ వంతెనే ఆదివారం కుప్పకూలింది. వంతెన ముందు భాగం కూలి నదిలో పడింది. ఇంతకీ కూలిపోవడానికి కారణమేమిటంటే.. అప్రోచ్ రోడ్ లేకపోవడంతో వంతెన ప్రారంభం కాలేదు కానీ, భారీ వాహనాలు, ట్రాక్టర్లు ఈ వంతనపై  యథేచ్ఛగా రాకపోకలు సాగించాయి. దీంతో  పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. దీంతో వంతెన కూలిపోయింది.  

కొనసాగాలా? వద్దా.. ఎలాన్ మస్క్ సంశయం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అదినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు. ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది. అయితే తాజాగా ట్విటర్ల వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో  ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు.  ఇంత కాలం ట్విట్టర్ కు షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సీఈవో ఎలాన్ మస్క్.. తనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో అసలు ట్విట్లర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. అదేదో సినిమాలో హీరో ప్రేమించాలా వద్దా అన్న డైలమాలో పడిన విధగా తయారైంది ఇప్పుడు ఎలాన్ మస్క్ పరిస్థితి. సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న తన సంశయాన్ని తీర్చుకోవడానికి ఆయన నెటిజన్లు ఆశ్రయించాడు.   తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు. 

చైనాలో కరోనా టెర్రర్

కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలకు వర్క్ ఫ్రం హోం నేర్పింది. ఇప్పుడు అలసి పోయి తాను ఇంటి నుంచి పని చేస్తోంది అంటూ సామాజిక మాధ్యమంలో జోకులు పేలుతున్నాయి. అయితే చైనాలో పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది.   ప్రపంచాన్ని కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు వణికించేసింది. ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారిని వదిలించుకుని యథాపూర్వస్థితికి చేరుకుంటోంది. అయితే కరోనా పుట్టిన దేశం చైనా మాత్రం మహమ్మారి గుప్పిట్లో విలవిలలాడుతోంది. ప్రపంచంలో కరోనా తొలి, మలి దశలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో.. ఇప్పుడు చైనాలో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. స్మశానాలు కరోనా మృతులతో నిండిపోతున్నాయి. అంతిమ సంస్కారాని నోచుకోక వందల సంఖ్యలో మృతదేహాలు స్మశానం బయట పడి ఉంటున్నాయి. ప్రస్తుతం చైనాలో రోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. కరోనా నియంత్రణకు ఆ దేశం ఆంక్షలు విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో అనివార్యంగా ఆంక్షలను ఎత్తివేయాల్సి వచ్చింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కరోనా అక్కడ కరాళ నృత్యం చేయడం ప్రారంభించింది. దీంతో ఆంక్షలతో సంబంధం లేకుండా జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమైపోతున్నారు. ఇందుకు ఆదివారం (డిసెంబర్ 18) దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ నిర్మానుష్యంగా కనిపించడమే తార్కానం. ఇక చైనా బయటకు అయితే వెల్లడించడం లేదు కానీ..  కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కర స్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. స్మశాన వాటికల వద్ద కనిపిస్తున్న రద్దీయే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 

వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీలో పోటీ

వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ.. ఔను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి ఇటీవలే వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చుకున్న వర్సిటీయే.. ఆ వర్సిటీలో పదవుల కోసం వైసీపీలోని కీలక వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వర్సిటీలో కీలక పదవులైన వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీ నేతల సమీప బంధువుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలా పోటీ పడుతున్న వారు సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ నేతల బంధువులే కావడంతో ఈ వర్సిటీ పదవులు దక్కించుకునే వారెవర్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హెల్త్ వర్సిటీ ప్రస్తుత చాన్సలర్ శ్యాంప్రసాద్ పదవీ కాలం జనవరి 13తో ముగియనుంది. ఈ పదవి కోసం మంత్రి సురేష్ సమీప బంధువు బాబ్జి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుత వీసీ కూడామరో సారి  వీసీగా కొనసాగేందుకు తన  వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక వీసీ తరువాత అంత కీలకమైన వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు కోసం వైసీపీ ఎంపి వేంరెడ్డి ప్రభాకరరెడ్డి సమీప బంధువు, డాక్టర్ రాధికారెడ్డి ప్రయత్రాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పోస్టులలో జగన్ ఎవరిని నియమిస్తారన్నవిషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.  

మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఏమయ్యిందంటే?

పెళ్లి విందులో విషాదం చోటు చేసుకుంది. పందిట్లో పెళ్లి జరుగుతోంది. పక్కనే పెళ్లి విందు. అందరూ ఆనందంగా ఉన్నారు. పెళ్లి పందిరంతా కళకళలాడుతోంది. అంతలోనే విషాదం. విందారగిస్తున్న ఓ ఆహుతుడు కుప్పకూలిపోయాడు. అంతలోనే మరణించాడు. ఇంతకూ అతడు ఎందుకు మరణించాడంటే విందారగిస్తుండగా ఆయన ఇష్టంగా తింటున్న మటన్ ముక్క గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఉక్కిరిబిక్కిరై కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామామాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది. పెళ్లి విందారగిస్తున్న రమణాగౌడ్ అనే వ్యక్తి గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. ఉక్కిరిబిక్కిరై కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు నిర్దారించారు. దీంతో పెళ్లింట విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.

విపక్షాల ఐక్యత ఎండమావేనా?

2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ యేతర పార్టీల జాబితాలోకి తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేరింది. ఇప్పటికే  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ లు ఆ ప్రయత్నాలలోనే ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నిటికీ ఒంటరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనడం అంత తేలిక కాదని స్పష్టంగా తెలుసు. అందుకే కూటముల ఏర్పాటు విషయంలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే స్వరాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా.. కూటమిలో కీలక పొజిషన్, సముచిత ప్రాధాన్యత విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేక చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా విడతల వారీగా కొనసాగిస్తూ వార్తలలో ఉండేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి పరిమితమైపోయాయి.  వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు  ఏకతాటి మీదకు వచ్చి, సంఘటితంగా బీజేపీపై పోరాటం జరిపే అవకాశం ఉందంటూ   జాతీయ దినపత్రిక ఇటీవల ఒక విశ్లేషణను ప్రచురించింది.  నిజానికి, ఏ దినపత్రికా ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంపై పెద్దగా దృష్టి  సారించడం  లేదు. అయితే తాజాగా ఓ జాతీయ దినపత్రిక  విపక్షాల ఐక్యతపై ఓ కథనం ప్రచురించడమే కాకుండా.. ఆ ఐక్య కూటమికి లేదా ఫ్రంట్ కు  నతీష్ కుమార్ ఔను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే  నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషించింది. అయితే ఈ విశ్లేషణను నితీష్ కుమార్ వెంటనే ఖండించారు. విపక్షాల ఐక్యతా ప్రయత్నాలను ఖండించకుండానే.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు.  ఇంత వరకూ బానే ఉంది.  ప్రతిపక్షాల   ఐక్యత కోసం నడుంబిగించి ముందుకు వచ్చే నాయకుడు ఎవరు?  గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతి సారీ వామపక్షాలు ముందుకు వచ్చేవి. ముఖ్యంగా సీపీఎం నాయకులు తమంత తాముగా చొరవ తీసుకునే వారు. 1996, 2004 సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పుడు కూడా సీపీఎం చొరవ తీసుకుని  ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకు రాగలిగింది. ఇక జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేత అనడంలో సందేహం లేదు.  ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. ఆ పొత్తుల ఎత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజా పరిస్థితి తీసుకుంటే..  ఇటీవల వరకు బీజేపీతో కలిసి సాగిన నితీశ్‌ కుమార్‌  ఇప్పుడు అదే బీజేపీని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు.   ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దింపేందుకు  ప్రతిపక్షాల మధ్య ఐక్యత అంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీ కొనాలంటే పొత్తుల  విషయంలో దూరదృష్టి మాత్రమే ఉంటే సరిపోదు. గతానికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలుచేపట్టిన తరువాత  భారత ఎన్నికల ముఖచిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పు వచ్చింది. ప్రజలు పార్టీలు ఏవైనా సరా, కూటములు ఏవైనా సరే.. ముందు ఆయా పార్టీల, కూటముల ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చూస్తున్నారు. అంటే విపక్షాల ఐక్యత సాకారం కావడమంటే.. అవి ఎన్నకలకు ముందే ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఆవిషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడే జనం ఆ కూటమిని కన్సడర్ చేసే పరిస్థితి ఉంటుంది.   అందుకే 2004 వరకూ ఒక లెక్క.. 2004 తరువాత నుంచీ మరో లెక్క అన్నట్లుగా జాతీయ రాజకీయాలు మారిపోయాయి.   ఈ మార్పును పరిగణనలోనికి తీసుకుంటేనే విపక్షాల ఐక్యత సాకారమవుతుంది. లేదంటే ఐక్యతా ప్రయత్నాల దారి గతుకుల బాటగానే మిగిలిపోతుంది. 

కేసీఆర్ బీఆర్ఎస్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసిందా?

తెరాస అధినేత కేసీఆర్  పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేసి భారత చేర్చడం.. తమది ఇక తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదంటూ హస్తిన కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పుతాననడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లైందన్న టాక్ తెలంగాణలో జోరుగా సాగుతోంది.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు  ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్కీచాన్స్ కొట్టేశారంటూ.. తెరాస శ్రేణులు అంటున్నాయి. తెరాస అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి.. దేశ రాజధాని ఢిల్లీలో కారు స్టీరింగ్ తిప్పేస్తున్నారు.  దాంతో రాష్ట్రంలో సైకిల్ పార్టీ మళ్లీ పుంజుకోనేందుకు  కేసీఆర్ స్వయంగా బాటలు వేసినట్లు అయిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం   దాదాపు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ .. తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం.. అందులో భాగంగా.. ప్రజల్లో ఆ సెంటిమెంట్ రాజేసి గెలవడంలో వందకి వంద శాతం  సఫలమైంది. అందుకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలే ఉదాహరణ అని.. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్‌గా మారడంతో..  తెలంగాణ అనే పదం మాయమైపోయింది..  దీంతో  వచ్చే అసెంబ్లీ ఎన్నకలలో  తెలంగాణ వాదాన్ని ఎత్తుకునే చాన్స్ కేసీఆర్ కోల్పోయారు. కేసీఆర్ అనేమిటి ఆయన కుటుంబం, బీఆర్ఎస్ కు లేకుండా పోయింది.  దీంతో తెలంగాణలో మళ్లీ టీడీపీకి పుంజుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.   మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించడంతోపాటు.. రాష్ట్రంలో సైకిల్  సవారీకి అవసరమై వ్యూహాలపై  కసరత్తు చేశారు... చేస్తున్నారు.  అలాగే గతంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాలపై వీరు దృష్టి సారించారు. ఆ క్రమంలో వివిధ జిల్లాల నేతలతోపాటు కేడర్‌తో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.      ఇప్పటికీ ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పసుపు పార్టీకిఇప్పటికీ బలంగా ఉందన్న సంగతి తెలిసిందే.   ఆ క్రమంలోనే ఖమ్మంలో టీ టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో సైతం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి సైకిల్ పార్టీని మరింత బలోపేతం చేస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీకే కాదు.. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి సైతం టీడీపీ గట్టి కిక్ ఇస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల తర్వాత.. టీ టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా.... తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని.. ఇది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఓ విధంగా లక్కీ ఛాన్సేనని  విశ్లేషకులు అంటున్నారు.

పెళ్లిని క్యాన్సిల్ చేసిన షాంపూ

పెళ్లిళ్లు రద్దు కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలతో కూడా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పీటల వరకూ వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడానికి వివాహ విందులో చికెన్ లేదనీ, వరుడి ముక్కు చిన్నగా ఉందనీ, పెళ్లిలో స్వీట్ తినడానికి వధువు నిరాకరించిందనీ ఇలా అతి చిన్న చిన్న విషయాలు కూడా కారణం అవ్వడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ అయ్యింది. అయితే వీటన్నిటినీ మించిన  సిల్లీ కారణంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో జరిగింది. అన్నీ కుదిరి పెళ్లికి ముహూర్తం కూడ పెట్టేసుకున్న తరువాత అతి చిన్న కారణంతో పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో ఇంతకీ ఆ సిల్లీ కారణం షాంపూ. ఔను షాంపూ కారణంగా పెళ్లి నిలిచిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే హౌలీకి చెందిన అమ్మాయికి అసోంకు చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. వరుడు ఇంజనీర్. అక్కడి సంప్రదాయం ప్రకారం వరుడి కుటుంబం అమ్మాయి పెళ్లి అలంకరణకు కావలసిన వస్తువులు పంపాలి. ఆ అబ్బాయి తరఫు వారు అలాగే పంపారు. అయితే ఆ పంపిన వస్తువులలో షాంపూ కారణంగా అన్నీ కుదిరి పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ ఆ షాంపూ కారణమేమిటో తెలుసా... అబ్బాయి తరఫు వారు పంపిన  వస్తువుల్లో ఉన్నషాంపూ ఒకింత చవకదట. దీంతో వధువుకు ఒళ్లు మండింది. వెంటనే ఇంజనీరింగ్ చదివారు ఇంత చవక రకం షాంపూ పంపుతారా? ఇదేనా మీ స్థాయి అంటూ మెసేజ్ పంపింది. దీంతో వరుడికి మనిషికి రావలసినంత కోపమూ వచ్చింది. వెంటనే పెళ్లి క్యాన్సిల్ అనేశాడు. వరుడిపైపు వారూ, వధువు వైపు వారూ ఎంత చెప్పినా వినలేదు.