కేరళలో కోళ్లు, బాతులకు చంపేస్తున్నారు.. ఎందుకో తెలుసా?
posted on Dec 15, 2022 6:26AM
కేరళలో కోళ్లు, బాతులను వెంటనే చంపేయాలని ఓ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిజమే.. కొట్టాయం జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులను చంపేసి క్రిమి సంహారక మందులు చల్లాలని ఆయన ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వేల సంఖ్యలో కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులను చంపేస్తున్నారు.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని మాళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మళ్లీ వైరస్ లు విజృంభించడం ఆందోళన రేకెత్తిస్తోంది. బర్డ్ ఫ్లూ, ఎబోలా, జికా ఇలా వైరస్ ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఉదృతి తగ్గినా మరో సారి పడగ విప్పేందుకు కరోనా, ఒమిక్రాన్ వైరస్ లు పొంచే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. చైనాలో కరోనా కోరలు చాస్తోంది.
ఈ నేపథ్యంలో కేరళలో బర్డ్ ఫ్లూ విజృంభణను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో పక్షులను చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొట్టాయం జిల్లాలో బుధవారం (డిసెంబర్ 14) నుంచి మూడు రోజుల పాటు వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చోటు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు,ఇతర పెంపుడు పక్షులు, అలాగే మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు నేరుగా ఎలాంటి హానీ లేకపోయినప్పటికీ, బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన.. పక్షుల మాంసం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు.