కింగ్ కోహ్లీ సాధిస్తాడా?
posted on Dec 14, 2022 @ 1:09PM
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ విఫలమయ్యాడు. అయితే ఈ సిరీస్ లో కోహ్లీ కనుక ఒక శతకం బాదితే ఓ అరుదైన రికార్డు అతడి ఖాతాలో పడుతుంది. అదేమిటంటే ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన రికార్డు. అంటే టెస్టులు, వన్డేలు, టి20లలో సెంచరీ చేసిన ఘనత సాధించాలంటే.. కోహ్లీ బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేయాలి. ప్రస్తుతమున్న ఫామ్ లో కోహ్లీకి అదే మంత పెద్ద విషయం కాదు.
ఇప్పటి వరకూ అలా మూడు ఫార్మాట్ లలోనూ ఒకే క్యాలెండర్ ఇయర్ లో సెంచరీ సాధించిన వారిలో మహేలా జయవర్థనే(2010), సురేశ్ రైనా(2010), దిల్షాన్(2011), అహ్మద్ షెహజాన్(2014), తమీమ్ ఇక్భాల్(2016), కేఎల్ రాహుల్(2016), రోహిత్ శర్మ(2017) డేవిడ్ వార్నర్(2019), బాబర్ అజామ్(2022) ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. వారి సరసన కోహ్లీ చేరాలంటే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కానీ, రెండో టెస్టులో కానీ సెంచరీ చేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ ఏడాది ఆసియా కప్ లో టి20లలో కోహ్లీ సెంచరీ చేశాడు. అలాగే బంగ్లాదేశ్ లో వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో సెంచరీ ఒక్కటే మిగిలింది. ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీ 72 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడు సచిన్ టెండూల్కర్. టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరో 28 సెంచరీలు చేయాల్సి ఉంది.