కవితకు కల్వకుంట్ల దూరం.. తెలంగాణ జాగృతే రక్ష?
కల్వకుంట్ల కవిత. ఎంపీ కావచ్చును, ఎమ్మెల్సీ కావచ్చును, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కావచ్చును, రాజకీయంగా ఆమె ఏమైనా కావచ్చును, ఏమీ కాకపోనూ వచ్చును.కానీ, ఆమె ముఖ్యమంత్రి, తెరాస/ భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు. నిజానికి ఆమె రాజకీయానికి పునాది, ఆమె కుటుంబం. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇలా అయితే ఉండేది కాదు.
కల్వకుట్ల బ్రాండ్ నేమ్ , కేసేఆర్ కుమార్తె అనే ట్యాగ్లైన్ తోనే ఆమె రాజకీయంగా ఎదిగొచ్చారు. నిజానికి, కేసీఆర్ అనే మూడక్షరాలు లేకున్నా తెలంగాణ వచ్చేదేమో కానీ, కవిత, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరు ఈరోజున్న స్థితిలో అయితే ఉండేవారు,కాదు. అలాగే, ఈరోజు కవిత సహా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలు చికాకులు కూడా ఉండేవి కాదేమో, ఇది ఏవరైనా అంగీకరించి తీరవలసిన నిజం.
సరే అది వేరే విషయం.అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేని కుటుంబంగా నిలిచిన, కల్వకుంట్ల కుటుంబం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి నంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా, జాగ్రత్త వహిస్తున్నారా. అందుకే, తెలంగాణ జాగృతి నుంచి నైతిక మద్దతు పొందేందుకే ఆమె ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ ఎదుట హాజరైన మరుసటి రోజే, తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఇంత కాలంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు, ప్రముఖంగా వినిపిస్తున్నా, కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు.అయితే ఈ కేసు విచారణ చేస్తున్న, సీబీఐ ఆమెకు సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె మూడు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి చర్చించినట్లు వార్తలొచ్చాయి.
కవితకు నోటీసు వచ్చిన వెంటనే, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులూ పోటీలు పడి మరీ, కవితకు మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు. కేంద్రాన్ని, మోడీని, సిబిఐ, ఈడీలను విమర్శించారు. బీఆర్ఎస్ భయానికి మోడీ, కేసీఆర్ ను కట్టిడి చేసేందుకు కవితను టార్గెట్ చేశారని విమర్శించారు.
అలాగే,ఆదివారం ఆరుగంటలకు పైగా ఆమెను, విచారించే వరకు కూడా కల్వకుంట్ల కుటుంబం కాకున్నా పార్టీ నాయకులు, మంత్రులు,ఎమ్మెల్యేలు ఆమెకు అండగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరికించిందని వాదించారు. అయితే, విచారణ పూర్తయి, ఆమె ప్రగతి భవన్ కు వెళ్లి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. అంతలోనే సీబీఐ కవితకు 91 సీఅర్పీసీ నోటీసు ఇచ్చి ఆమె ఇచ్చిన వాంగ్మూలానికి సంబదించిన ఆధారాలను ఇవ్వాలని కోరింది.
అంతే తెరాస నాయకులు మెల్లగా మెల్లగా మౌనంలోకి వెళ్లి పోయారు. ముఖ్యమంత్రి, కేసేఆర్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఇక ఆపైన కల్వకుంట్ల కుటుంబం, తెరాస/భారాస నాయకులు అవసరానికి మించి మాట్లాడడం లేదు.ఈ పరిణామాలను గమనిస్తే, వ్యూహాత్మకంగానే కావచ్చును కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస / భారాస, కల్వకుంట్ల కుటుంబం తాత్కాలికంగా అయినా దూరం పెట్టిందనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆమె తనను తాను రక్షించుకునేందుకు తెలంగాణ జాగృతిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అందుకే ఆమె, తెలంగాణ జాగృతి విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు. ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి శాఖ సిద్ధమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. సానుభూతికోసమో సెంటిమెంట్ పండించేందుకో తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది నీళ్లు కాదు నిప్పులని, అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, తనపై జరుగతున్న దాడులు కూడా అదే కోవకు చెందుతాయని నమ్మ పలికారు. అయినా దాడులకు తాను భయపడనని ప్రకటించారు. అయితే, ఇప్పడు ప్రశ్న ఆమె భయపడుతున్నారా, లేదా అని కాదు. ఇంత అర్జెంటుగా కల్వకుంట్ల కవిత ఫ్యామిలీని, పార్టీని కాదని తెలంగాణ జాగృతిని ఎందుకు వేదిక చేసుకోవలసి వచ్చింది? కవితకు కల్వకుంట్ల దూరమయిందా? ఏమో తెలియదు కానీ, ఆమె తమ భవిష్యత్ పోరాటానికి తెలంగాణ జాగృతిని వేదిక చేసుకున్నారా, అన్న అనుమానాలు మాత్రం నిజమని అంటున్నారు.