తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ స్వరం?
posted on Dec 14, 2022 @ 12:14PM
దేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆసక్తి కంటే జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల రాజకీయం పట్లే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలుగు రాష్ట్రాలపై పడింది. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పుట్టినట్లు చెప్పుకుంటూ.. రాష్ట్రం తెరాస చేతుల్లో ఉంటేనే ‘సేఫ్’ అని చెప్పుకుంటూ వస్తున్న తెరాస ఒక్కసారిగా జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడతామని ఢిల్లీకి చేరుకుంది.
జాతీయ స్థాయి రాజకీయం అంటే తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటకలలో కూడా బీఆర్ఎస్ కాలూనేందుకు ప్రయత్నాలు చేపట్టింది. తెలంగాణ నినాదాన్ని వదిలేసి కేసీఆర్ జాతీయ నినాదం అందుకోవడంతో తెలంగాణలో ఇతర ప్రాంతీయ పార్టీలకు స్కోప్ లేదా స్పేస్ లభించిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ తెలంగాణలో రాజకీయాలు వదులుకున్నా.. తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. కేడర్ విషయంలో మాత్రం గట్టి బలమే ఉంది. అందుకే ఈ సారి ఎన్నికలలో టీడీపీ కూడా తెలంగాణలో యాక్టివ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తన క్యాడర్ కు పిలుపునిచ్చేశారు. ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ చార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఆయన మరి కొన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే విషయం యోచిస్తున్నామని వివరించారు. అయితే ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీకి దిగితే రాజకీయంగా ఇరు రాష్ట్రాలలో ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరందుకున్నాయి. అలాగే పరిశీలకులు తమ విశ్లేషణలకు పదును పెడుతున్నారు.
ఏపీలో పొత్తుకు సిద్దమవుతున్న జనసేన-టీడీపీ తెలంగాణలో కూడా కలిసి పోటీకి దిగితే ఎలా ఉంటుంది?.. ఒకవేళ వీటికి బీజేపీ కూడా తోడై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా రంగంలోకి దిగితే ఏమౌతుందన్న చర్చ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగితే ఏపీలో ఈ కూటమికి ఎదురే ఉండదనీ, అదే ఫార్ములా తెలంగాణలో కూడా సక్సెస్ అయ్యేందుకే ఎక్కువ అకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా పోటీకి దిగితే ఏపీలో వైసీపీకి నష్టమని చాలా కాలంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్బావంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు.. సమైక్య ముద్రతో ప్రజలకు దూరం అవుతుందా అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసిన కేసీఆర్ బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. మొత్తం మీద పొత్తు పొడుపులు, రాజకీయ సమీకరణాల విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రంజుగా మారాయనడంలో సందేహం లేదు. మొత్తంమీద ఈ సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ స్థాయిలో ఏదో ఒక మేరకు ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.