ధరణి కోట టు ఎర్రకోట.. అమరావతి రైతుల మరో పోరు యాత్ర
posted on Dec 15, 2022 @ 9:53AM
ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అందుకు భూములు ఇచ్చిన రైతులు మరో పోరాటానికి సిద్దమయ్యారు. 2019, డిసెంబర్ 17వ తేదీన ఏపీ సీఎం వైయస్ జగన్.. ఏపీకి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు.. ఆయనా ప్రకటన చేసి 2022, డిసెంబర్ 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. అమరావతి రైతులు ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు... పేరుతో దేశ రాజధాని ఢిల్లీకి పోరు బాట పట్టనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో రైతులు.. నిరసనలు తెలపనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతులు ధర్నా చేపట్టనున్నారు. అలాగే 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి.. వారికి ఈ తమ గోడును విన్నవించుకోనున్నారు. ఇక 19వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొననున్నారు. అదీకాక.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలు.. ఢిల్లీలోనే ఉంటారని.. వారందరినీ కలిసి.. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని రైతులు కోరనున్నారు.
అందుకోసం అమరావతి నుంచి 1800 మంది రైతులు... ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని న్యాయస్థానం స్పష్టం చేసినా... జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై అమరావతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నాటి నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు.. వరుసగా నిరసనలు, దీక్షలు, యాత్రలలో పోరాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు.
అలాగూ అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు మరో మహాపాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద ఈ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ పాదయాత్ర ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
అయితే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర... ఉత్తరాంధ్ర జల్లాల్లో ప్రవేశిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ... జగన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోటీగా ఆందోళనలు నిర్వహించేందుకు రంగం చేస్తుకొన్నారని సమాచారం. అలాంటి వేళ.. ఈ అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశిస్తే.. పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయని ఓ చర్చ సైతం బలంగా సాగుతోంది.
మరోవైపు గతంలో శాతవాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. ఆ సమయంలో అమరావతిని ధాన్యకటకం.. ధరణికోట పేర్లుతో ప్రజలు పిలిచుకునే వారు. ఈ పేర్లను పురస్కరించుకొని. ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో అమరావతి రైతులు హస్తిన యాత్రకు శ్రీకారం చుట్టారు.