‘వారాహి’ రైట్ రైట్

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల  ప్రచార వాహనం ‘వారాహి’కి లైన్ క్లియర్  అయ్యింది. ఆ వాహనానికిరిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. పవన్ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహీ’ ఇటీవలి కాలంలో వార్తలలో ప్రముఖంగా నిలిచింది. ఆ వాహనం రంగు, ఎత్తు, వాహనానికి ఉన్నటైర్లు.. ఇలా పలు అంశాలు కేంద్ర ట్రాన్స్ పోర్ట్ చట్టానికి అనుగుణంగా లేవంటూ ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ మాజీ మంత్రి  పేర్ని నాని అయితే ఆ వాహనానికి రోడ్లపై తిరిగే అర్హత లేదంటూ మీడియా మీట్ పెట్టి  మరీ చెప్పారు. ఇక ఏపీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అయితే.. వాహనం రంగు ప్రస్తావిస్తూ.. ఆ రంగు అంటే అలీవ్ గ్రీన్ కేవలం మిలిటరీ వాహనాలకు మాత్రమే పరిమితమని, మరో ఇతర వాహనాలకూ ఆ రంగు నిషిద్ధమని చెప్పారు. అందుకే వాహన తయారీ కంపెనీలేవీ అలీవ్ గ్రీన్ రంగుతో వాహనాన్ని విడుదల చేయలేదని అన్నారు. అంతే కాకుండా ఈ రంగుతో పవన్ కల్యాణ్ తన వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అసాధ్యమని కూడా అన్నారు. మొత్తం మీద జనసేనాని తన ఎన్నికల ప్రచార రథం ఫొటోలు విడుదల చేసిన క్షణం నుంచీ, ఆ వాహనం ‘వారాహి’ ఇంకా రోడ్ల మీదకు రాకముందే వివాదాలలో చిక్కుకుంది.  అయితే ఈ వాదనలూ, వివాదాలతో సంబంధంలేకుండా తెలంగాణ ట్రాన్స్ పోర్టు అధికారులు ‘వారాహి’ కి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఈ వాహనం చుట్టూ చుట్టుముట్టిన వివాదాలు దూది పింజెల్లా తేలియోయాయి. అయితే ఇప్పటి వరకూ అందరూ చెబుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం రంగు అలీవ్ గ్రీన్ కాదనీ, డాక్యుమెంట్లలో దానిని ఆల్ట్రాగ్రీన్ గా పేర్కొన్నారని తెలిసింది. వారాహికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ వాహనం రోడ్లపైకి వస్తుందో రాదో అన్న అనుమానాలకు తెరపడినట్లైంది.  అన్ని సర్టిఫికెట్ పరిశీలించిన మీదట, వారాహి’కి  రిజిస్ట్రేషన్  చేశామని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384ను కేటాయించారని తెలిపారు.  దీంతో వాహనం రోడ్లపైకి వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని అంటున్నారు. అయితే ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఏపీ రోడ్లపై తిరగకుండా ‘వారాహి’ని  అడ్డుకుంటారా అన్న అనుమానాలు మాత్రం జనసేన శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.

పొత్తులపై జనసేన పరస్పర విరుద్ధ ప్రకటనలు

జనసేన.. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ఈ పార్టీ ఏపీ రాజకీయాలలో కీలకంగా మారింది. సొంతంగా పోటీ చేస్తే విజయం సంగతి ఎలా ఉన్నా..ఇతర పార్టీల గెలుపు ఓటములను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో పొత్తుల చర్చకు తెరతీసిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఆ తరువాత మాత్రం పొత్తుల విషయంపై మాట్లాడకుండా.. రాష్ట్రంలో ఒంటరి ప్రయాణమంటూ సంకేతాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఒక వైపు బీజేపీతో మైత్రి ఉన్నా జనసేనాని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇక బీజేపీ హైకమాండ్ పలు సందర్భాలలో పవన్ ను విస్మరించినా.. ఇటీవల విశాఖ సంఘటనల తరువాత మాత్రం ఆయనకు ఒకింత ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై చార్జిషీట్ తయారు చేయాలంటూ విశాఖ పర్యటన సందర్భంగా మోడీ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించడంతో వచ్చే ఎన్నికలలో ఏపీలో త్రిముఖ పోటీకి రంగం సిద్ధమౌతోందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అదే జరిగితే పార్టీల గెలుపోటములపై పలు విశ్లేషణలూ వెల్లువెత్తాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో జనసేన కీలకం కానున్నదనే రాజకీయవర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. అయితే మొత్తంగా జనసేన రాజకీయ ప్రస్థానం మాత్రం పవన్ కల్యాణ్ ‘మూడ్’ కు అనుగుణంగానే సాగుతోంది. అయితే సామాన్య జనం  మాత్రం ఆయనను ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు తప్ప పరిపూర్ణ రాజకీయ నేతగా గుర్తించడం లేదు. ఇందుకు ఆయన సినిమాలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చి.. రాజకీయాలను ఇప్పటికీ పార్ట్ టైమ్ గానే చూస్తున్న తీరే కారణమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఒక సారి ఆయన అధికారమే లక్ష్యం అంటారు.. మరో సారి ప్రశ్నించే పార్టీగా జనసేన ఉంటుంది.. అధికారమే పరమావధి అంటారు. తన షెడ్యూల్ ప్రకారమే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్న తీరు ప్రజలలో   ఒక సంపూర్ణ ప్రజా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు విషయంలో పవన్ కు విషయంలో ఆయన రెండు పడవల మీద ప్రయాణమే కారణమనడంలో సందేహమే లేదు. ఆయన వరుస సినిమాలు అంగీకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారే తప్ప.. రాజకీయ నాయకుడిగా నిరంతరాయంగా ప్రజలతో మమేకమౌతూ.. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందే విషయంలో మాత్రం పెద్దగా చొరవ చూపడం లేదు. అందుకే ఆయన సభలకు వచ్చే జనసందోహం ఒక సినిమా హీరోను చూడటానికి వస్తున్నట్లుగా ఉంది తప్ప ఆయన చెప్పే విషయాలు, అంశాలపై శ్రద్ధతో కాదు. ఇలా చెప్పడానికి కారణమేమిటంటే.. పవన్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే జనసేన కనిపిస్తుంది. ఆయన మళ్లీ తన షూటింగ్ కు వెళ్లిపోతే జనసేన కార్యక్రమాలు ఏవీ ఉండవు. ఆయన సభలు, ఆయన పర్యటనలు మాత్రమే జనసేన కార్యక్రమాలు. ఆ తరువాత పార్టీ ఊసే రాష్ట్రంలో ఎక్కడా వినపడని పరిస్థితి. రాజకీయంగా ఆయన అడుగులు ఒకడుగుముందుకు ఒకడుగు వెనక్కు చందంగా ఉండడానికి ఆయన జోడు పడవల ప్రయాణమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతంలో సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి రాణించిన వారెంత మంది ఉన్నారో... వైఫల్యం చెందిన వారూ అంతే మంది ఉన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విషయం తీసుకుంటే.. ఆయన ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్న తరువాత ఇక సినిమాల వైపు చూడలేదు. ఆ తరువాతెప్పుడో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆయన ప్రథమ ప్రాధాన్యత మాత్రం రాజకీయ రంగానికే ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు స్వయానా సోదరుడు అయిన చిరంజీవి కూడా రాజకీయాలలో ఉన్నంత కాలం సినిమాల ఊసెత్తలేదు. దాదాపు రెండున్నరేళ్లు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్న తరువాత ఇప్పుడు సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆయన అడపాదడపా రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా.. అవన్నీ సినిమాలలో లేదా సినిమా ప్రమేషన్లలో భాగంగానే ఉంటున్నాయి. అయితే పవన్ కల్యాణ్ విషయం అది కాదు.. ఆయన అటు సినిమాలూ, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ప్రజా జీవితం కోసం సినిమాలను, సినిమాల కోసం ప్రజాజీవితాన్ని వదులుకోలేనని చెబుతున్నారు. అటో ఇటో తేల్చుకుంటే తప్ప ఆయన పరిపూర్ణ నాయకుడిగా జనం గుర్తించే పరిస్థితి లేదనే చెప్పాలి. సినిమా హీరోగా రాజకీయాలు చేస్తున్నంత కాలం ఆయన రాజకీయం కూడా ఒక సినిమాలానే జనం చూస్తున్నారు. అందుకే ఆయన అడుగేస్తేనే జనసేన పార్టీ , ఆయన షూటింగ్ లలో ఉంటే అందుకు సంబంధించిన విషయాలు తప్ప జనసేన గురించి మాట్లాడేందకు ఎవరూ లేరు. జనసేన  ఆవిర్బవించి ఇన్నేళ్లయినా ఇప్పటికీ క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ నిర్మాణం లేదంటేనే పవన్ కల్యాణ్  పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యత ఎంత, ఏమిటి అన్నది అవగతమౌతుంది.  వచ్చే ఏడాది జనవరి నుంచి  పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.  వారాహి అన్న పేరుతో ఆయన యాత్రకు వాహనం కూడా సిద్ధమైంది. అయితే స్పష్టమైన కార్యాచరణతో షెడ్యూల్ విడుదల కాకపోవడానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణం. ఇప్పుడాయన వరుసగా చేస్తున్న సినిమా ప్రకటనలు గమనిస్తే, ఆయన బస్సుయాత్ర నిరాటంకంగా సాగుతుందా అన్నది అనుమానమే. ఈ అనుమానాన్ని జనసేన శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. సినిమా షూటింగ్ ల మధ్య విరామంలో ఆయన తన బస్సుయాత్రను ఒక విరామ యాత్రగా సాగిస్తారన్న సెటైర్లూ పేలుతున్నాయి. అందుకే ఆయన ఒక సమయంలో పొత్తులు అంటారు.. మళ్లీ పొత్తుల సంగతి పక్కన పెట్టేసి.. అధికారమే లక్ష్యమని ప్రకటనలు చేస్తారు. ఇలా పరస్పర విరుద్ధప్రకటనలతో తనలోని కన్ఫ్యూజన్ ను పార్టీ శ్రేణులకూ, జనాలకు కూడా పంచుతారు. దీంతో అసలు జనసేన లక్ష్యం ఏమిటన్న విషయంలో పార్టీ శ్రేణులకే ఇంకా స్పష్టత లేని పరిస్థితి.  కొంత కాలం కిందట రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వననీ, ఇందు కోసం అవసరమైతే బీజేపీతో మాట్లాడతాననీ ప్రకటించి..  తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా పొత్తు పొడుపులపై చర్చకు తెరలేపారు. ఆ తరువాత ఎమైందో ఏమో కానీ పొత్తు చర్చలు కాదు.. రాష్ట్ర పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యమని ప్రకటించారు.  సరే తాజాగా మళ్లీ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తు పొడుపుల గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ గతంలో ఏం చెప్పారో మళ్లీ అదే విషయాన్ని మనోహర్ వల్లె వేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన పని చేస్తుందనీ, ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైతే పొత్తులకు కూడా వెనుకాడబోమన్నారు. అతి త్వరలో పొత్తులపై క్లారిటీ ఇస్తామన్నారు. దీని వల్ల రాష్ట్రంలో పొత్తల చర్చ మరో సారి తెరమీదకు రావడం వినా మరో ప్రయోజనం అయితే సిద్ధించదు. జనసేన క్యాడర్ లో కన్ఫ్యూజన్ పెరగడం తప్ప మరో లాభం ఉండదు. గతంలో క్షేత్ర స్థాయిలో జనసేన తెలుగుదేశం శ్రేణులు కలిసి పని చేసేవి. పొత్తులు కాదు.. అధికారం కోసమే జనసేన అన్న జనసేనాని పిలుపుతో ఆ వాతావరణం పోయింది. ఇప్పుడు మళ్లీ పొత్తుల గురించిన ప్రస్తావనతో క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్ అసలు తామేం చేయాలి, ఎలా మెలగాలి అన్న దిశానిర్దేశం లేక నిస్తేజంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జనసేనాని క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంలో క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? లిక్కర్ స్కాంలో కవితకు మరో నోటీసు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? విచారణ పేరిట సీబీఐ దూకుడు గమనిస్తే ఔననే సమాధానం వచ్చేలా ఉంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా ఆదివారం ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె   ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి  సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొంది. ఈ నోటీసులు విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు  అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు. మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన ఆధారాలను నిర్దారణ చేసుకున్న తరువాతనే సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు. సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్త మౌతోంది. అయితే మలి నోటీసు మేరకు ఆమెను ఎప్పుడు విచారిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.  ఎందుకంటే త్వరలోనే విచారణకు ఎక్కడకు హాజరు కావాలి, ఏ తేదీన హాజరుకావాలి, ఏ సమయంలో హాజరు కావాలని అన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సీబీఐ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.   ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు.  కాగా ఆదివారం సీబీఐ విచారణ పూర్తి అయిన వెంటనే కవిత తన నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్ కు చేరుకుని  సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విచారణ తీరును వివరాలను.. కవిత కేసీఆర్ తో భేటీ తరువాత మీడియాకు ప్రకటిస్తారని అంతా భావించినా అది జరగలేదు. కేసీఆర్ తో బేటీ అనంతరం కవిత ప్రగతి భవన్ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.   

షర్మిల.. సునీత ఒకరికి ఒకరు

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కోర్టు అనుమతించినా తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో నిరశన దీక్ష చేపట్టారు. అయితే ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఆమె లోటస్ పాండ్ లోనే దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ నిర్మల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక వైద్యురాలు పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఎవరంటే.. వైఎస్ వివేకా కుమార్తె సునీత. తన తండ్రివ హత్య కేసు తన సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో  పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదంటూ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ విచారణను పొరుగు రాష్ట్రానికి మార్పించుకున్న సుసీత.. షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.  శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్లుగా   షర్మిల..   వివేకా కుమార్తె వైయస్ సునీత ఒకరికొకరు స్నేహభావంతో ఉన్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసు.. తన సోదరుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అతి సూనాయాసంగా ఛేదించవచ్చునని వైయస్ సునీత తొలుత ఆశపడ్డారనీ,   ఆ క్రమంలో సీఎం జగన్‌ను కలిసి.. ఈ కేసు ఛేదించడంలో జరుగుతోన్న జాప్యాన్ని  ఆయనకు  సోదాహరణగా వివరించారనీ,   అయితే జగన్ స్పందనతో ఆమె హతాశురాలయ్యారనీ.. ఈ నేపథ్యంలో సోదరుడు జగన్‌ని నమ్ముకునే కంటే.. న్యాయస్థానాన్ని నమ్ముకోవడం ఉత్తమని భావించి ఆమె ఆ దిశగా అడుగులు వేశారనీ నెటిజన్లు అంటున్నారు.    జగన్ అధికారంలోకి రావడం కోసం జగనన్న వదిలిన బాణమంటూ ఉమ్మడి రాష్ట్రంలో  షర్మిల పాదయాత్ర చేశారనీ, అయితే  ఆ తర్వాత   జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను దూరం పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యలోనే  సునీత తండ్రి వివేకా హత్య కేసులో  జగన్ సొంత సోదరి  షర్మిల.. స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి సైతం వాంగ్మూలం ఇచ్చిన సంగతీ విదితమే. ఈ విధంగా జగన్ సోదరి, సవతి సోదరి ఇద్దరూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మారారు.  శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు ఇప్పుడు వీరిద్దరు ఒక్కటై.. జగనన్నకు బాణం దెబ్బ రూచి చూపించనున్నారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.   వివేకా హత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పులివెందుల్లో   అవినాష్ రెడ్డి కుటుంబానికి ఒక్క  జగన్ ఫ్యామిలీ మాత్రమే అండగా ఉందనీ, మిగిలిన వెఎస్ ఫ్యామిలీ  మొత్తం సునీత,  షర్మిలలకే మద్దతుగా ఉన్నారనీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.   ఏదీ ఏమైనా..   వివేకా హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరు అనేది వెలుగులోకి వస్తే.. అలాగే తెలంగాణలో వైయస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారితే... జగన్‌ ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అలాగే  హైదరాబాద్‌లో  షర్మిల  అరెస్టు, వాహనంలో ఉండగానే టోవింగ్ తదితర పరిణామాలపై  ప్రధాని మోదీ సైతం స్పందించినా... జగన్ మాత్రం స్పందించకపోవడాన్ని కూడా సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

అన్నంలో తలవెంట్రుక వచ్చిందని భార్యకు శిరోముండనం

పురుషాధిక్యతకు ఎల్లలు ఉండవా అని పిస్తుంది కొన్సి సంఘటనల గురించి వన్నప్పుడు. ఇక భార్య అంటే లోకువగా చూసే పురుష పుంగవులు కోకొల్లలు. చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద శిక్షలు వేయడంలో మృగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. మహిళలపై అఘాయిత్యాలు చేయడంలో, వారిని వేధింపులకు గురి చేయడంలో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి శాడిస్ట్ భర్త తాను బతికుండగానే భార్యకు గుండు కొట్టించేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ పురుష పుంగవుడు భార్యకు ఎందుకు గుండు కొట్టించాడో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోకమానరు. సాధారణంగా ఇంట్లోనే కాకుండా.. రెస్టారెంట్లు, హోటల్స్‌లో మనం తినే ఫుడ్‌లో తలవెంట్రుకలను చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఎంతో కొంత కోపం, అసహనం సహజం. అయితే అన్నంలో తల వెంట్రుకలు రావడం అన్నది కూడా అంతే సహజం. ఎవరైనా సరే అలా వస్తే సర్దుకు పోతారు. ఆహారంలో వచ్చిన తల వెంట్రుకను తీసి పక్కన పారేసి తినేస్తారు. కానీ ఆ భర్త మాత్రం ఏకంగా  కట్టుకున్న భార్యకు గుండు కొట్టించాడు.  భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో  వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా.. ఇంకోసారి అలా తలవెంట్రుకలు రాకుండా ఉండాలంటే భార్యకు గుండు చేయించడమే మార్గమని నిర్ణయం తీసేసుకున్నారు. వెంటనే అమలు చేసేశాడు. ఇందుకు ఆ వ్యక్తికి   అమ్మ , నాన్న అంటే సదరు బాధితురాలి అత్తమామలు కూడా తన వంతు సహకారం అందించారు.  దీంతో ఆ బాధితురాలు   భర్త, అత్తమామలపై   కేసు పెట్టింది. మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని పిలిభిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు, సీమాదేవితో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు ఆమెను వేధిస్తున్నారు. ఆ వేధింపులలో భాగంగానే  ఆమె వండిన భోజనంలో వెంట్రుక వచ్చిందని శిరోముండనం చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి  శిరోముండనం చేశారని  సీమాదేవి తన ఫిర్యాదులో పేర్కొంది.  

ఏపీ బీఆర్ఎస్ ఇన్ చార్జ్ తలసాని?

బీఆర్ఎస్ ఏపీపై దృష్టి సారించింది. ఇప్పటకే బీఆర్ఎస్ బ్యానర్లు, పోస్టర్లు  విజయవాడలో వెలిశాయి. తొలుత బీఆర్ఎస్ పేరు నిర్ణయించే సమయంలో సభ ఏర్పాటు తరువాత కూడా ఏపీలో పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ కు మద్దతుగా పోస్టర్లు వెలిసిన సంగతి విదితమే. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా పలు ప్రాంతాలలో అప్పట్లో పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు మూడు రోజుల కిందట బీఆర్ఎస్ అధికారికంగా ఆవిర్భవించిన తరువాత విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ఆ పార్టీ అధినేత తొలుత దృష్టి పెట్టింది ఏపీపైనే అని చెబుతారు.  ఆంధ్రప్రదేశ్‌లో  బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసే బాధ్యతను తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస  యాదవ్‌కు కేసీఆర్ అప్పగించనున్నారని ఆ పార్టీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తోంది.    2019 ఎన్నికలకు ముందు బీసీలను ఏకం చేసి, వారిని వైసీపీ వైపు మళ్లించేందుకు  తలసాని విజయవాడలో పర్యటించిన సంగతి విదితమే. అప్పట్లో ఆయనకు  ఘన స్వాగతం లభించింది. ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులను బీఆర్‌ఎస్ వైపు మళ్లించే వ్యూహంతో, తలసానినిని బీఆర్‌ఎస్ ఏపీ ఇన్చార్జిగా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాపుల తరువాత సంఖ్యాపరంగా పెద్ద  సమాజిక వర్గం యాదవులే కావడంతో వారిని బీఆర్ఎస్ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా, వారి మద్దతు పొందడమే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారంటున్నారు. సమైక్య రాష్ట్రంలో తలసాని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేశారు.  ఏపీలోని అనేక వర్గాలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి.   తలసాని,   తలసాని టీడీపీలో ఉండగా, ఆయనతో ఏపీకి చెందిన టీడీపీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆవి కొనసాగుతున్నాయి. దీంతో ఏపీ నేతలతో తలసానికి ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీకి,  ఏపీ ఇన్చార్జిగా తలసానినేనియమించాలని నిర్ణయించారని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే విజయవాడలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం తలసాని శ్రీనివాస యాదవ్ డిసెంబర్ నెలలో విజయవాడలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  

50 ఇళ్లు ధ్వంసం చేసిందేవరో తెలుసా?

ఒక గుంపు ఏకంగా 50 ఇళ్లను ధ్వంసం చేసేసింది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కడలూరులో ఈ దారుణం జరిగింది. దీంతో ముందు ముందు ఇంకెన్ని ఇళ్లను ఆ గుంపు ధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన ప్రజలలో వ్యక్తమౌతోంది. ఆ గుంపు జనావాసాల మధ్యలోకి రాకుండా అవసన చర్యలు తీసుకోవాలని జనం అధికారులను వేడుకుంటున్నారు. ఇంతకీ ఇళ్లను ధ్వంసం చేస్తున్నది ఒక ఏనుగుల గుంపు. కడలూరు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగుల గుంపు జనావాసాలపై పడి ఇళ్లను ధ్వంసం చేసింది. స్థానికులు ఇళ్లకు కాపాడు కోవడం సంగతి పక్కన పెట్టి ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఏనుగుల గుంపు వెళ్లిపోయిన తరువాత వచ్చి చూస్తే ఏముంది.. దాదాపు 50 గృహాలు పూర్తగా ధ్వంసమయ్యాయి. ఆ ఏనుగుల గుంపు మళ్లీ మళ్లీ జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామనీ, అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే జనావాసాలకు సమీపంలో అటవీ ప్రాంతం నుంచి ఏనుగులను దూరంగా వెళ్లేలా మళ్లించారు.

పెళ్లికి గంటల ముందు వధువు బలవన్మరణం.. కారణమేమిటంటే?

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి.. పెళ్లికి గంటల ముందు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పెళ్లింట విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆదివారం (డిసెంబర్11) జరిగింది. ఆదివారం మధ్యాహ్నం తన వివాహం. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా బంధు మిత్రులతో గడిపిన రవళి తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా ఆమె తనకు కాబోయే భర్తతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. వివాహం కుదిరినప్పటి నుంచీ కాబోయే భర్త ఆంక్షల పేర వేధిస్తుండటంతోనే రవళి బలవన్మరణానికి పాల్పడిందని పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికూతురి అలంకరణలోనే రవళి విగత జీవిగా పడి ఉండటం చూపరులను కలచివేస్తోంది.  

సానియాతో విడాకులపై షోయబ్ స్పందన.. అంతరార్ధమేమిటి?

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారన్న వార్తలపై ఇప్పటి వరకూ ఇరువురూ పెదవి విప్నని సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సానియా, షోయబ్ జంట విడిపోనున్న వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతున్నాయి. అయితే ఈ వార్తల పట్ల ఇంత వరకూ ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలా మంది ఇరువురూ విడాకులకు సిద్ధమయ్యారనే నమ్ముతూ వచ్చారు. అయతే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకింత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్.. అది మా వ్యక్తిగత విషయం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించాడు. అయితే షోయబ్ మాలిక్ స్పందన  తరువాత కూడా సానియాతో అతడు విడిపోతున్నాడా.. లేదా అన్న విషయంపై స్పష్టత రాలేదు. దీంతో వీరిరువురి విడాకులు ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి.  సానియా–షోయబ్ విడిపోయారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే  ఇటీవలి కాలంలో ఈ ప్రచారం ఎక్కువైంది. పైగా సానియా తన సోషల్ మీడియా ఖాతాలో చేస్తున్న పోస్టులు ఈ ప్రచారానికి తావిస్తున్నాయి.   సానియా తన భర్త ఫొటో లేకుండానే  ఫొటోల్ని షేర్ చేస్తోంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా, సానియా మీర్జా–పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు దుబాయ్‌లో ఉంటున్నారు.

కోహ్లీ నెక్ట్స్ టార్గెట్ సచిన్

పరుగుల యంత్రం కింగ్ కోహ్లీ నెక్ట్స్ టార్గెట్ సచిన్ టెండూల్కర్. ఔను నిజమే క్రికెట్ లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగుల దాహం తీర్చుకుంటున్న విరాట్ కోహ్లీ.. తరువాతి టార్గెట్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టడమే. ఔను సచిన్ తరువాత అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పుడు కోహ్లీ పేరిటే ఉంది. సచిన్ టెండూల్కర్ మొత్తం 100 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, 72 ఇంటర్నేషనల్ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో చిట్టగ్యాంగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాని అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 44వ సెంచరీ మొత్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇది అతడికి 72వ సెంచరీ. క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ ఒక్కడే కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.  కాగా బంగ్లాతో మూడో వన్డేలో చేసిన సెంచరీతో  కోహ్లీ మరో అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లీ ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర (1045) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగా రికార్డును విరాట్ బ్రేక్‌ చేశాడు. 

కోమటరెడ్డికి దారి చూపిన కాంగ్రెస్

కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ ఈ రెండింటినీ వేరు చేసి చూడటం సాధ్యం కాదన్న పరిస్థితి నుంచి వారిరువురి వల్ల తెలంగాణ కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందన్నంత వరకూ పరిస్థితి వచ్చింది. వచ్చింది అనే కంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకు వచ్చారని చెప్పడమే సబబు. కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత విభేదాలు, గ్రూపుల కుమ్ములాటలూ సహజమే. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ మాత్రం పార్టీలో తమఅసమ్మతి, అసంతృప్తి ని ప్రదర్శించే విషయంలో వేరే లెవల్ చూపించారు. ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వానికీ, అటు హై కమాండ్ కీ కూడా చుక్కలు చూపించారు. నల్గొండ జిల్లాలో తమకు ఉన్న పట్టు కాంగ్రెస్ పార్టీకి అవసరమ్మన్న అతి ధీమానూ ప్రదర్శించారు. తామేం చేసినా చెల్లి పోతుందన్న అతిశయంతో వ్యవహరించారు.  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది దక్కకపోయే సరికి.. తన అసమ్మతి రాగాన్ని పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడేందుకు దారితీసే విధంగా వినిపించారు. పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టడాన్ని పార్టీలో పలువురు సీనియర్లు వ్యతిరేకించారు. తమ వ్యతిరేకతను, అసమ్మతిని తమ తమ స్థాయిల్లో ప్రదర్శించారు కూడా అయితే.. ఆ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన స్థాయిని మించి వ్యక్తం చేశారు. అధిష్ఠానానికి విధేయుడిని అని అంటూనే.. అవిధేయతను వ్యక్త పరచడంలో కొత్త పుంతలు తొక్కారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ కాంగ్రెస్ బ్రాండ్ అన్నంతగా రెచ్చిపోయారు. కానీ హై కమాండ్ నుంచి బుజ్జగింపులే తప్ప.. తాము కోరుకున్న విధంగా పదవి రాకపోవడంతో.. ముందుగా సొదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు తెరతీశారు. మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్ వరస ఓటములు చవి చూస్తున్న సమయంలో  సిట్టింగ్ సీటుకు ఉప ఎన్నిక జరగడం కాంగ్రెస్ కు ఏ విధంగానూ కలిసి వచ్చే వ్యవహారం కాదు. అయినా అనివార్యంగా ఉప ఎన్నికను తీసుకు వచ్చి కాంగ్రెస్ బలహీనతలను బట్టబయలు చేసి సత్తాచాటాలన్న వ్యూహంతోనే రాజగోపాలరెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు తెర తీశారు. ఇక అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసమ్మతి ప్రదర్శనలో విశ్వరూపం ప్రదర్శించారు. అనుక్షణం తన ప్రకటనలతో పార్టీని, పార్టీ అధినాయకత్వాన్ని ఇబ్బందుల పాల్జేశారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉండి కూడా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శలతో చెలరేగారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి తథ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మునుగోడు పరాజయం తరువాత రాష్ట్ర పార్టీ పగ్గాలు తనవే అంటూ ఆయన చేసిన కామెంట్లూ కాంగ్రెస్ ను చీకాకు పెట్టాయి. అయినా చర్య తీసుకోకుండా కాంగ్రెస్ హై కమాండ్ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. లోక్ సభలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ మరో ఎంపీని వదులు కోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వెంకటరెడ్డిపై చర్యలకు వెనుకాడింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కంటే తానే ఎక్కువ అన్న భావనతో తనది రాజకీయ విరామమే తప్ప సన్యాసం కాదంటూ కాంగ్రెస్ ను వీడనున్నట్లు ఘనంగా ప్రకటించారు. ఇంత జరిగిన తరువాత కానీ కాంగ్రెస్ కళ్లు తెరవలేదు. కన్నెర్ర చేయలేదు. ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బయటకు దారి చూపింది. తనంత తాను పొమ్మనకుండానే.. పొగబెట్టిన చందంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పీసీసీ కమిటీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పూర్తిగా విస్మరించింది. 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీస్‌ని.. అలాగే 26 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించింది. ఈ జాబితాలో ఎక్కడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. అంతే కాదు పార్టీలో ఆయన అనుయాయులనూ దూరం పెట్టింది.  అంటే కోమటిరెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా విస్మరించింది. మీ సేవలు చాలు ఇక దయచేయండని మర్యాదగా చెప్పింది. దీంతో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల వేడి కూడా చల్లారుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని కోమటిరెడ్డిని పూర్తిగా విస్మరించడం ద్వారా అసమ్మతీయులకు బలమైన సంకేతాన్ని పంపింది. 

జగన్మాత..జగన్మాయ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ రెడ్డికి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు   షర్మిలకు తల్లి అయిన వైఎస్ విజయమ్మ తాజా వ్యవహారశైలిపై పై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ఆమె తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో  షర్మిల అరెస్ట్, వాహనంలో ఉండగానే షర్మలను టోవింగ్ చేసి మరీ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు   తరలించడం.. ఆ సందర్భంగా విజయమ్మ ఆందోళనకు దిగడం.. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. పక్క రాష్ట్రంతో,  జగన్‌తో మనకేమిటమ్మా సంబంధం అంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇప్పుడు   తన పాదయాత్రకు తెలంగాణలో అనుమతి ఇవ్వకపోవడంపై వైయస్ షర్మిల ఆందోళనకు దిగారు. అలాగే .. టీఆర్ఎస్ అంతర్ధానమై బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌పైన.. జగన్ మోహన్ రెడ్డిపైన ఎలాంటి ప్రభావం చూపుతాయంటూ మీడియా ప్రశ్నలకు..   జగన్‌ను ఎవరు తాకలేరంటూ ఆమె సమాధానం  ఇచ్చారు. ఈ పరస్పర విరుద్ధమైన విజయమ్మ మాటలపైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న పక్క రాష్ట్రంతో, వైయస్ జగన్‌తో మనకేం పనమ్మా అన్న విజయమ్మ, రోజుల వ్యవధిలోనే ఆయన్ని ఎవరు తాకలేరంటూ వెనకేసుకురావడంలో ఆంతర్యం ఎమిటని నిలదీస్తున్నారు.  2019 ఎన్నికలకు ముందు.. రాజన్న రాజ్యం కోసం జగన్ ను గెలిపించండి.. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిస్తే.. మీ సమస్యలన్నీ హుష్ కాకి అన్నట్లుగా పరిష్కరించేస్తారని  విజయమ్మ ప్రచారం చేసిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే  జగనన్న వదిలిన బాణమంటూ  షర్మిల సైతం సోదరుడి కోసం పాదయాత్ర చేశారు. తీరా జగన్ ఏపీలో అధికారంలోని రాగానే ప్రజలను పట్టించుకోక పోవడమే కాదు.. తల్లి, చెల్లిని సైతం పక్క రాష్ట్రానికి సాగనంపాడని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యంగా మూడు రాజధానులంటూ ఆయన చేస్తున్న విన్యాసాల కారణంగా.. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, అలాగే పీఆర్సీ, సీపీఎస్ ల విషయంలో జగన్ తీరుతో  ప్రభుత్వ ఉద్యోగులు, జాబ్ కాలెండర్ వాగ్దానాన్ని నిలుపుకోకపోవడంతో నిరుద్యోగులు, నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులు, ఇలా జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ కూడా సంతోషంగా లేని పరిస్ధితి ఉంది. ఇలా ప్రతిపక్ష నేతగా  జగన్ చేసిన వాగ్దానాలు... ఏవీ నేటికి నెరవేరలేదని... ఆ క్రమంలో జగనన్న రాజ్యంలో ప్రతి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని.... కానీ ఈ మూడున్నరేళ్లలో ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏ ఒక్క రోజు  విజయమ్మ కానీ  షర్మిల కానీ పెదవి అయితే విప్పిందే లేదని నెటిజనులు   గుర్తు చేస్తున్నారు.   కానీ తన కుమార్తెకు కానీ.. తన కొడుకుకు కానీ ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా..   విజయమ్మ  ఆగమేఘాల మీద స్పందిస్తారని.. మరి ప్రజలకు సమస్య వస్తే.. ఎందుకు స్పందించరనీ నిలదీస్తున్నారు.  మొన్న  జగన్‌తో మనకెందుకమ్మా అన్నారు.  ఇప్పుడు అదే జగన్‌ను ఎవరూ తాకలేరంటున్నారు జగన్మాత, జగన్మాయ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

హిమాచల్’లో కమలం కకావికాలం నడ్డాకు ఉద్వాసన?

హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి  రోజులు గడచి పోతున్నాయి  కానీ వేడి మాత్రం తగ్గడం లేదు.అలాగే హిమాచల్ ఎన్నికల దుమారం రేపిన ధూళి మాత్రం సర్దుకోవడం లేదు.  ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపిక కసరత్తును పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సుఖీందర్ సింగ్ సుంఖుని సీఎఎంగా, ఉప ముఖ్యమంత్రిగా అగిహోత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రేపు ఆదివారం(డిసెంబర్ 11) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుంతుందని కాంగ్రెస్ పార్టీ  అధికారికంగా ప్రకటించింది. అయితే, ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోయినా సీట్లు భారీగా కోల్పోయి అధికారం కోల్పోయిన బీజేపీలో మాత్రం రాజకీయ సెగలు బుసలు కొడుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ఓటమి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మెడకు చుట్టుకుంటోంది. హిమాచల్ నడ్డా స్వరాష్ట్రం. అదొకటి అలాఉంటే, హిమాచల్లో బీజేపీ ఓటమికి, గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణంగా అధినాయకత్వం గుర్తించినట్లు చెపుతున్నారు. ఈ  నేపధ్యంలో స్వరాష్ట్రంలోనే పార్టీని ఏక తాటిపై నడిపించలేక పోయిన నడ్డా దేశంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే చర్చ పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది.  అంతేకాదు హిమాచల్ బీజేపీలో ముఠా కుమ్ములాటలకు నడ్డానే కారణమని రాష్ట్రంలో తన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ ను కావాలనే పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా తిరుగుబాట్లను ఎగ దోశారని బిజెపి పెద్దలకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఏకంగా 21 మంది రెబల్స్ రంగంలోకి దిగి పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బ తీశారు. దీనిపై ప్రధానికి నిఘా వర్గాలు నివేదిక కూడా ఇచ్చాయి. నడ్డా ప్రేమ్ కుమార్ ఒకరిని ఒకరు ఓడించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందింది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సైతం నడ్డా విషయంలో కొంత అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో చర్చజరుగుతోంది. అలాగే హిమాచల్ వ్యవహారం పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రదాని కోరినట్లు తెలుస్తోంది.  యితే నడ్డాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని, పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి నడ్డా పదవీకాలం ముగియక ముందే ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్ళ పాటు పొడిగిస్తూ, పార్టీ నిర్ణయం తీసుకుంది. నడ్డా పదవీకాలం జనవరి 20న ముగుస్తుంది. అయితే, 2024 ఎన్నికల వరకు ఆయన్నే అధ్యక్ష పదవిలో కొనసాగించాలని 2024 లోక్ సభ ఎన్నికలు కూడా ఆయన సారధ్యంలోనే వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అయితే హిమాచల్ ఓటమి తర్వాత ఆయన స్థానంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను జాతీయ నూతన అధ్యక్షుడిగా నియమించాలని మోడీ షా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారాం జరుగుతోంది. అయితే నడ్డా సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని ఇదంతా మీడియా సృష్టిగా కొట్టి వేస్తున్నారు. కానీ ఒకసారి మోడీ, షా నిర్ణయం తీసుకుంటే, మార్పు ఉండదని అంటున్నారు. గతంలో సీనియర్ మంత్రులకు ఉద్వాసన చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

షర్మిల మైలేజీని పెంచే వ్యూహమేనా?

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అయినా, సజ్జల సమైక్యరాగమైనా.. ఈ రెండూ అనేమిటి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి పొలిటికల్ మూవ్ కూ ఆమె లింక్ ఉందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రను అడ్డుకోవడం నుంచి.. ప్రగతి భవన్ కు వెళ్లే దారిలో ఆమెను కారులో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించడం దాకా.. కోర్టు అనుమతి ఇచ్చినా  షర్మిల పాదయాత్ర కొనసాగించలేని పరిస్థితి నుంచి.. ట్యాంక్ బండ్ పై నిరసన వరకూ.. ఇంటి ముందు కూడా నిరసనకు అంగీకరించకపోవడం నుంచి విజయమ్మ సైతం నిరశనకు దిగడం వరకూ అన్నీ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి షర్మిలనే తమ బాణంగా ఎంచుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  అసలు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఎవరికీ పట్టని పాదయాత్రను తెలంగాణలో నిరాటంకంగా సాగిస్తున్నప్పటి నుంచీ కూడా షర్మిల ఎవరు వదిలిన బాణం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అసలామె తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసిన సమయం నుంచే ఈ అనుమానాలు రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనం నుంచీ వ్యక్తమయ్యాయి.  పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె ఆ రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది.   ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, తెలుగు రాష్ట్రాల రాజకీయ తెరమీద కనిపిస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు షర్మిల రాజకీయ ‘యాత్ర’పై విశ్లేషణలు చేస్తూ వచ్చారు. అయితే  వరంగల్ ఎపిసోడ్ కు ముందు వరకూ షర్మిల పాదయాత్రను కానీ, ఆమె హస్తిన వెళ్లి మరీ చేసిన ఫిర్యాదుల గురించి కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై రాళ్ల దాడి, కార్ వ్యాన్ దగ్ధం సంఘటనలు జరిగాయో అప్పటి నుంచీ ఆమె రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఏకంగా ప్రధాని మోడీ కూడా ఆమెపై దాడి, అరెస్టులపై స్పందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రగతి భవన్ కు వెళ్లే దారిలో షర్మిల కారులో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించిన సంఘటనతో ఆమె పొలిటికల్ మైలేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ తరువాత కూడా వరుస సంఘటనలు ఆమె మైలేజ్ పెంచేవిగానే సాగుతున్నాయి.  తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓ ఇరవై మందితో షర్మిల ధర్నాకు దిగారు.  ఆమె ధర్నాను పట్టించుకోకుండా వదిలేసి ఉంటే.. గత ధర్నాలు, నిరసనలలాగే కొద్ది సేపటి తరువాత ఆమే విరమించి వెళ్లిపోయే వారు. కానీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి  పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర విడిచి పెట్టారు. ఇంటి దగ్గర కూడా హై డ్రామా నడిచింది. షర్మిల ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే కూర్చుని నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు మళ్లీ రంగ ప్రవేశం చేసి బలవంతంగా ఇంట్లోకి పంపారు. నివాసంలో షర్మల  దీక్ష కొనసాగిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే నిరవధిక నిరశనకు దిగుతానని కూడా హెచ్చరించారు.   ఇదిలా ఉంటే.. ఇంత కాలం లేనిది ఇప్పుడు షర్మిల పాదయాత్రకు, నిరసనలకు ఎందుకీ ఆంక్షలు అన్న ప్రశ్నలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణమని చెప్పక తప్పదు. ముందుగా ఏపీ విషయానికి వస్తే.. జగన్ మూడున్నరేళ్ల పాలనలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.   రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్యా చిచ్చు పెట్టైనా సరే పబ్బం గడుపుకుందామని చేసిన ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అయ్యాయి. మూడు ప్రాంతాలలోనూ వైకాపాకు చుక్కెదురే అయ్యింది. ఏ ప్రాంతంలోనూ వైసీపీని జనం ఆదరించడం లేదన్న సంగతి ప్రస్ఫుటమయ్యేలా వరుస సంఘటనలు జరిగాయి. ఆఖరికి జగన్ సభలకు కూడా జనం రావడానికి విముఖత చూపుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారాన్ని కోరుతున్న పరిస్థితి. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించడానికి పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం అందించిన ‘సహాయ’ సహకారాలు తెలిసిందే. ఇప్పుడు మరో సారి జగన్ కేసీఆర్ సహకారం కోసం చూస్తున్నారు. అదే సమయంలో వరుసగా రెండు సార్లు కేసీఆర్ తెలంగాణలో తెరాసను అధికారంలోకి రావడానికి కారణాలెన్ని ఉన్నా ప్రధాన కారణం మాత్రం తెలంగాణ సెంటిమెంట్. 2014 ఎన్నికలలో తెలంగాణను సాధించిన నేతగా తనను తాను ప్రమోట్ చేసుకుని ఆ సెంటిమెంట్ తో అధికారంలోకి రాగలిగారు. ఇక 2019 ఎన్నికలలో మళ్లీ సమైక్య వాదుల కుట్ర అంటూ చంద్రబాబు కాంగ్రెస్ సహా పలు పార్టీల పొత్తుతో రాష్ట్రంలో ప్రచారం చేయడాన్ని బూచిగా చూపి సెంటిమెంట్ రగల్చగలిగారు. అయితే ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలనుకుంటున్న కేసీఆర్ కు ఈ సారి తెలంగాణ సెంటిమెంట్ ను తురఫు కార్డుగా ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది.  ఆయన స్వయంగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో ఆయన తెరాసను భారాసగా మార్చేశారు.  అలా ఆయన ఇక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని వదిలేశారు. అయితే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను అధిగమించి మరో సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండాతో అయినా సరే.. అధికారంలోకి రావాలంటే..  సెంటిమెంటే శరణ్యం అన్న సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే తన వైపు నుంచి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే అవకాశం లేని పరిస్థితి ఉండటంతో అటువైపు నుంచి నరుక్కు వద్దామన్న వ్యూహ రచన చేశారు. అటు వైపు అంటే ఏపీ వైపు అన్న మాట. అక్కడ ఎలాగూ.. జగన్ సర్కార్  ఏం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చాలా ఉన్న యోచనలో ఉంది. దీంతో రోగీ వైద్యుడూ సామెతలా.. సమైక్య వాదాన్ని ఏపీలో తెరపైకి తీసుకు రావడం... అదే జరిగితే.. మళ్లీ వలస పాలనలోకి తెలంగాణ అంటూ ఇటూ  అంటే తెలంగాణలోనూ సెంటిమెంటును రగల్చవచ్చు. ఈ వ్యూహంతోనే.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారంటున్నారు. అదే సమయంలో షర్మిల మైలేజీని పెంచితే.. తెలంగాణలో కూడా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందనీ, ఏపీ వ్యక్తి తెలంగాణలో రాజకీయాలేంటనే వాదన కూడా తెరమీదకు తేవచ్చన్నది ఇరు రాస్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఫార్మ్ హౌస్ కథలో మరో ట్విస్ట్... ఏమిటో తెలుసా?

అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన కుట్ర చుట్టూ అల్లుకున్న ఫార్మ్ హౌస్  కథ .. మరో కంచికి చేరని కథలా ముందుకు సాగుతోందా? ముగింపు లేని మరో ఓటుకు నోటు కథలా కాలగమనంలో  తెరమరుగై పోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే  ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి, నందకుమార్ కు రాష్ట్ర హై కోర్టు షరతులతో కూడిన బెయిల్  మంజూరు చేసింది. ముగురు నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు. సరే  రాష్ట్ర పోలీసులు వారిని వేరే కేసుల్లో మళ్ళీ ఆరెస్ట్ చేశారనుకోండి అది వేరే విషయం. ఈ కేసుకు సంబంధించినంత వరకు అయితే, ఆ ముగ్గురు బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు.   మరోవంక  కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్  కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే బిఎల్ సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై రివిజన్ పిటిషన్ వేసిన సిట్ కోర్టు వ్యాఖ్యలను హైకోర్టులో  సవాల్ చేసింది. ఆ కేసు నడుస్తోంది. ఎప్పటికి తేలుతుందో, ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. ఫార్మ్ హౌస్ కేసు విచారణకు సంబందించిన వ్యవహారం అలా ఉంటే  ఈ కేసుకు సంబందించి బీజేపీ సీనియర్ నాయకడు బీఎల్ సంతోష్  ను సిట్  నిందితుల జాబితాలో చేర్చింది. ఈ  కేసులో ఆయనే సూత్రధారి అని చెపుతోంది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీఎల్ సంతోష్ న్యాయస్థానాలకు వెళ్లి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. ఈలోగా సిట్  కు ఈ కేసు విచారించే అధికారమే లేదని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది. ఏసీబీ కోర్టు తేర్పుపై  రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది  ఈ కేసుల్లో ఇంకా విచారణలు జరుగుతున్నాయి.  అయితే  ఇప్పడు బిఎల్ సంతోష్ హైదరాబాద్ వస్తున్నారు.హైదరాబాద్ లో  డిసెంబర్  28,29 తేదీలలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ వస్తున్నారు.  దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్ సభ నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు  పార్టీ బలోపేతం  ప్రచార శైలిపై కార్యకర్తలకు నేతలు శిక్షణ ఇవ్వనున్నారు.   తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు తెలంగాణ వ్యూహ రచనలు చేస్తోంది. దీంతో ఆ పార్టీ తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడే పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ్గా.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కార్యకర్తల సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గోనేందుకే, సంతోష్ హైదరాబాద్ వస్తున్నారు. సరే అదెలా ఉన్నా బీఎల్ సంతోష్ హైదాబాద్ వచ్చిన సందర్భంగా, తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సిట్  ఏమి చేస్తుంది. పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమి జరుగుతుంది  అనేది రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది. సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. విఫల మయ్యారు. ఇప్పుడు సంతోష్ హైదరాబాద్ కే వస్తున్న నేపధ్యంలో పొలిటికల్ డ్రామా ఏ మలుపు తిరుగుతుందననది  ఆసక్తికరంగా మారింది.

రాహుల్ భారత్ జోడో యాత్ర.. వాట్ నెక్ట్స్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. పార్టీ ఎన్నికల వైఫల్యాలతో సంబంధం లేకుండా రాహుల్ తన యాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలలో ఘోర పరాజయం,  ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో తేరుకోలేని ఎదురుదెబ్బ వీటిని వేటినీ రాహుల్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరికొన్ని రోజుల్లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. మరి యాత్ర ముగిశాక వాట్ నెక్స్ట . ఈ ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. రాహుల్ యాత్ర కారణంగా ఆ యాత్ర సాగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్న సూచన లేదు. మరి యాత్ర ఉద్దేశం నెరవేరినట్లేనా. ఎంత ఎన్నికల రాజకీయాలతో సంబంధం లేని యాత్ర అని రాహుల్ బలంగా చెబుతున్నా..పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనొం చేకూర్చిన యాత్ర ఎందుకు చేపట్టినట్లు అన్న ప్రశ్నకైనా ఆయన  ఇప్పుడుకాకపోతే తరువాతైనా సమాధానం చెప్పుకోక తప్పదు. అది అలా ఉంచితే.. రాహుల్ భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ  ప్రణాళిక ఏమిటి? మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత ఆయనపైనే పడినా, పార్టీ మనుగడ సాగించాలన్నా.. ప్రజలలో కొద్దో గొప్పో ఆదరణ, గౌరవం దక్కాలన్నా కాంగ్రెస్ కు ఇప్పటికీ గాంధీ కుటుంబమే దిక్కు. అందుకే రాహుల్ గాంధీ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ఆశలూ పెట్టుకుంది.  ఇప్పటికే పాతిక వందల కిలోమీటర్ల పైన సాగిన రాహుల్ పాదయాత్ర ఏడు రాష్ట్రాలను చుట్టేసింది.  మరో వెయ్యి కిలోమీటర్లపైన యాత్ర మిగిలి ఉంది. అది పూర్తి అయితే  రాహుల్ నిర్దేశించుకున్న  కన్యాకుమారి నుంచి కశ్మీర్ లక్ష్యం నెరవేరినట్లే. ఇంత వరకూ ఓకే కానీ యాత్ర తరువాత వాట్ నెక్ట్స్.. రాహుల్ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేంద్రంలోని బీజేపీని ఎలా ఎదుర్కొంటుంది? ఇంత కాలం కేంద్రంలోని మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా పార్టీ  పరిస్థితి రోజు రోజుకూ బలహీనమౌతున్న సూచనలే కనిపిస్తున్నాయి. హిమాచల్  అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినా.. అది పార్టీలో పెద్దగా ఉత్సాహాన్ని నింపలేదు. ఎందుకంటే అధికార పార్టీకి మరో సారి అధికారం కట్టబెట్టక పోవడమన్నది హిమాచల్ సంప్దాయంగా వస్తోంది. దీంతో ఇక్కడి గెలుపు కాంగ్రెస్ తన సొంత ప్రతిభగా క్లెయిమ్ చేసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. కానీ గుజరాత్ లో పరాజయం మాత్రం ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీసిఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే.. వరుసగా ఏడో సారి గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పుంజుకోవడం సంగతి అటుంచి గతం కంటే బలహీన పడింది. ఈ నేపథ్యంలోనే కనీసం  రాహుల్ భారత్ జోడో యాత్రతో ఆయన వ్యక్తిగతంగానైనా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా జనామోదాన్ని పొందారా? పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా అర్హత సాధించారా? అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం పార్టీ శ్రేణుల నుంచే రాలేదు.   భారత్ జోడో యాత్రతో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది, బీజేపీకి దీటుగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నిలబడే బలం సమకూరుతుంది  అని ఆశలు పెట్టుకున్న  కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ ముగింపు దశకు వస్తున్నప్పటికీ ఆ ఆశలు నెరవేరుతాయన్న విశ్వాసాన్ని పొందలేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.    కొత్త సంవత్సరంలో సరికొత్తగా రాజకీయాలు చేసేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోందని మాత్రం పార్టీ హైకమాండ్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. వచ్చే ఏడాది  ఫిబ్రవరి రెండవ వారంలో  మూడు రోజులపాటు సాగే కాంగ్రెస్ ప్లీనరీ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా దిశానిర్దేశం చేస్తుందని చెబుతున్నది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ వరుస యాత్రలకు ప్రణాళికలు రూపొందిస్తోంది.  ఇందులో భాగంగా  హాత్ సే హాత్ జోడో అభియాన్  అంటూ జనవరి 26 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమైంది.   బూత్ లెవెల్, బ్లాక్ లెవెల్, స్టేట్ లెవెల్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్    పాదయాత్ర భారీ ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ పాదయాత్రలో యువతను పార్టీతో కనెక్ట్ చేస్తూ ఉత్సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహించనుంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర సాగనుంది.  మొత్తానికి ఓవైపు బీజేపీ 2024 ఎన్నికల సన్నాహకాలు జోరుగా చేస్తుంటే మరోవైపు బీజేపీకి దీటుగా గ్రౌండ్ వర్క్ చేస్తూ కాంగ్రెస్ కూడా   కసరత్తులు చేస్తున్నది. ఇది ఏ మేరకు సక్సస్ అవుతుందన్నది చూడాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

బోరు బావికి మరో బాలుడు బలి

దేశంలో బోరుబావిలో పడి చిన్నారులు మరణిస్తున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నా.. ప్రభుత్వాలలో కదలిక రావడం లేదు. బోరుబావులను పూడ్చకుండా వదిలేసిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో మరో బాలుడు బోరు బావిలో పడి మరణించారు. గత మంగళవారం (డిసెంబర్6) బేతుల్ జిల్లా మాండవి అనే గ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడు పూడ్చకుండా వదిలేసిన బోరు బావిలో ప్రమాద వశాత్తూ పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ బాలుడి అక్క వెంటనే  తండ్రికి చెప్పింది. ఆయన అధికారులకు సమాచారం అందించారు. అదికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరు బావిలో 55 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించిన అధికారులు బోర్ వెల్ లోపల కెమెరాలు అమర్చి బాలుడి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆక్సిజన్ సరఫరా చేశారు. అయితే బోరు బావి ప్రదేశంలో బండరాళ్లు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమౌతూ వచ్చింది ఎట్టకేలకు బాలుడు బోరు బావిలో పడిన నాలుగు రోజుల తరువాత అంటే శనివారం (ఉదయం) బయటకు తీశారు.  అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. 

యువతి కిడ్నాప్.. సినిమాను తలపించిన యాక్షన్

సినిమాను మించిన యాక్షన్.. వంద మంది శుభకార్యం జరుగుతున్న ఇంటికి చేరుకుని.. విధ్వంసం సృష్టించి ఓ యువతిని కిడ్నాప్ చేశారు. సాధారణంగా ఇలాంటి వయలెంట్ సన్నివేశాలను సినిమాలలోనే చూస్తాం. కానీ తెలంగాణలోని ఆదిభట్ల గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తాను ప్రేమించిన యువతికి  మరోకరితో వివాహ నిశ్చితార్ధం జరుగుతోందని తెలిసిన ప్రేమికుడు వంద మంది గ్యాంగ్ తో వాహనాలలో వచ్చి.. ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. అడ్డు వచ్చిన యువతి తండ్రిని, బంధువులను తీవ్రంగా కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మిస్టర్ టీ టైమ్ యజమాని నవీన్ రెడ్డి బీడీఎస్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు. తొలుత ఇరు కుటుంబాల వారూ వారి ప్రేమకు ఆమోదం తెలిపినా.. ఆ తరువాత కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఆ యువతి  నవీన్ రెడ్డిని దూరం పెట్టింది. అతడు ఫోన్లు, మెస్సేజీలతో వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అదలా ఉంటే తాను ప్రేమించిన యువతికి  వేరే వ్యక్తితో వివాహ నిశ్చితార్ధం జరుగుతోందని తెలుసుకున్న నవీన్ రెడ్డి సినీఫక్కీలో తన గ్యాంగ్ తో ఆమె ఇంటిపై దాడి చేసిన  మరీ యువతిని కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల చెరనుంచి యువతిని రక్షించారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాప్ నకు గురైన యువతి నల్గొండలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఆ సమాచారాన్ని నల్గొండ పోలీసులకు అందజేయడంతో వారు ఆ యువతిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి పీఎస్ కు తరలించారు. అక్కడ నుంచి ఆమె తన తండ్రికి ఫోన్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి  పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా మిగిలిన వారు పరారీలో ఉన్నారు.

తెలంగాణ రాజకీయ ముఖ్యచిత్రం మారి పోయింది !

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒకసారిగా మారిపోయింది. ఇంతవరకు, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర సమితి (భారాస)గాపేరు మార్చుకుని  జాతీయ పార్టీగా అవతరించింది.  ఈనేపధ్యంలో  ఇప్పడు రాష్ట్ర రాజకీయ ముఖ్య చిత్రం పై ప్రధానంగా, జాతీయ పార్టీలే కనిపిస్తున్నాయి.  భారాస, బీజేపీ, కాంగ్రెస్ మూడూ  జాతీయ పార్టీలు కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి తెలంగాణ తొలిగి పోయింది. తెలంగాణ అస్తిత్వ వాదం ప్రధాన లక్ష్యంగా, జై తెలంగాణ నినాదంగా  పన్నెండువందల మంది ఆత్మబలిదానంతో అవతరించిన తెలంగాణ రాష్రంలో  ఈ రోజు తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది.  నిజమే  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం తెరాస, భారాసగా పేరు మార్చుకున్నా, జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇల్లు అలకగానే పండగ రాదు, పేరు మార్చుకున్నంత మాత్రాన, జాతీయ పార్టీ గుర్తింపు రాదు. ఎప్పుడో 2012లో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్)  అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నా, నిన్న మొన్న గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు, ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తర్వాత గానీ, జాతీయ పార్టీగా గుర్తింపు రాలేదు. నిజానికి, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి  పుట్టిన ఆప్  కు స్వభావ రీత్యా, సిద్ధాంత పరంగా ఎలా చూసినా మొదటి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. అయినా జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన నిబంధనలను దాటుకుని వచ్చేందుకు దాదాపు పుష్కర కాలం పట్టింది.  నిజానికి  భారాసతో పోలిస్తే  ‘ఆప్’ కు జాతీయ స్థాయి గుర్తింపు ఎక్కువ  అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం తెరమీదకు వచ్చే వరకూ మధ్యతరగతి, మేథావి వర్గాల్లో మంచి పేరుంది. ఢిల్లీలో ఆప్  ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలతో పేద ప్రజల్లోనూ మంచి గుర్తింపే సంపాదించుకున్నారు. అలాగే, 2014,అంతకు ముందు నించి కూడా కేజ్రీవాల్ పార్టీ విస్తరణపై దృష్టిని కేంద్రీకరించారు. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పై కేజ్రీవాల్ పోటీ చేశారు. ఓడి పోయారు. అయినా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే,ఆప్ 2017, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి  2022 లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయినా, జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి ఇంత కాలం  నేపధ్యంలో ఇప్పుడే పేరు మార్పుతో తొలి అడుగు వేస్తున్న భారాస కు జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చేందుకు అదనంగా ఇంకో పుష్కర కాలం పట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. అదొకటి అలా ఉంటే తెరాస ప్రధానంగా ప్రాంతీయ వాదం పునాదులపై ఏర్పడిన పార్టీ  ఇప్పటికీ ప్రాంతీయ వాదాన్నే నమ్ముకుంటున్న పార్టీ  ఇంతవరకు తెలంగాణ అవతల ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసింది లేదు. జాతీయ స్థాయిలో అనేక రాజకీయ నాయకులకు తెరాస, కేసీఆర్ తో  పరిచయం ఉన్నా, ఏపీ మినహా మిగిలిన ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో, ఈశాన్య భారతంలో సామాన్య ప్రజలకు  పెద్దగా తెరాస తెలియదు. కేసీఆర్ ఎవరో తెలియదు. అలాగే, ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా తెరాస/ భారాసతో చేతులు కలిపేందుకు సిద్దంగా లేవు.  ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి ఏర్పాటుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ  ఫలించలేదు.  నిజానికి  ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి వచ్చిన  గౌరవం గుర్తింపు  పుష్కరకాలం పైగా ఉద్యమం జరిగినా  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణకు జాతీయ స్థాయిలో రావలసిన గుర్తింపు రాలేదు. తెరాస పేరు మార్పును ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖలో తెరాస కార్యాలయం, చిరునామాలో హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. అంటే  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ తర్వాత కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తించలేక పోయారు. అది సాంకేతిక తప్పిదమే కావచ్చును కానీ, ఒక విధంగా అది తెలంగాణ నాయకత్వం తప్పిదం కూడా అవుతుంది.  అదొకటి అలా ఉంటే  భారాస  జాతీయ పార్టీగా గుర్తింపు పొందే విషయాన్ని పక్కన పెడితే  తెలంగాణలో భారాస పరిస్థితి ఏమిటి? అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ లేనిదే తెరాస లేదు. తెరాస లేనిదే తెలంగాణ లేదు. నిన్నమొన్నటి వరకు తెరాస నాయకులు, తెరాస తెలంగాణ ఇంటి పార్టీగా ప్రచారం చేసుకున్నారు.అయితే ఇప్పడు తెలంగాణ పదాన్ని తీసేసి బిఆర్ఎస్ గా   పేరు మార్చుకున్నారు. మరోవంక భారాస ఏర్పాటుతో కెసిఆర్ కి తెలంగాణా కు ఉన్న పేగు బంధం తెగిపోయిందనే విమర్శలొస్తున్నాయి. చివరకు ఏమవుతుంది ? భారాస భవిష్యత్ ఎలాఉంటుంది? అది కాలమే, నిర్ణయిస్తుంది.