హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహన పూజ..
posted on Dec 15, 2022 @ 9:36AM
ఆలయాల్లో వాహన పూజలు సర్వసాధారణం. ఎవరైనా కొత్త వాహనం కొనుక్కుంటే ముందుగా ఆలయానికి తీసుకువచ్చి వాహన పూజ చేయిస్తారు. ఇలా చేయిస్తే ఆ వాహనంపై ప్రయాణం ఎలాంటి ప్రమాదాలకూ తావు లేకుండా సజావుగా సాగుతుందని ఒక విశ్వాసం. కార్లు, బైకులు, ట్రక్కులు, బస్సులు, వ్యానుకు ఇలా రకరకాల వాహనాలకు వాటి యజమానులు పూజలు చేయించడం విశేషమేమీ కాదు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన యాదాద్రి ఆలయం వద్ద తమ వాహనాలకు వాహన పూజలు చేయిచుకునే వారి సంఖ్య చిన్నదేం కాదు. కానీ ఒకాయన ఏకంగా తాను కొనుక్కున్న చాపర్ కు పూజలు చేయించడానికి ఆలయానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సంఘటన యాదాద్రిలో జరిగింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..యాదాద్రిలో మొట్టమొదటి సారిగా ఒక హెలికాప్టర్ కు వాహన పూజ జరిగింది. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి వచ్చిన జనం పర్వదినాలలో యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని చూడటానికి వచ్చిన భక్త జనసందోహం కంటే తక్కువగా లేరు.
ఇంతకీ తన చోపర్ కు వాహన పూజ చేయించిందెవరయా అంటే.. కరీంనగర్ ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ అయిన బోయినపల్లి శ్రీనివాసరావు. ఆయన తాను కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు యాదాద్రి పెద్దగుట్టపై బుధవారం (డిసెంబర్ 14) వాహన పూజ చేయించారు.
హెలికాప్టర్ కు పూజారులు వాహన పూజ చేస్తుంటే.. ఆ విషయం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ ను చూసేందుకు పోటెత్తారు.