రాహుల్ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్
posted on Dec 14, 2022 @ 1:42PM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ లక్ష్యం వైపుగా అడుగులు వేస్తోంది. నిజానికి భారత్ జోడో యాత్ర ఇంతలా ప్రజలను ఆకర్షిస్తున్నదని కానీ, ఇలా ఎక్కడా ఒక చిన్న ప్రతిబంధకం అయినా లేకుండా సాఫీగా సాగిపోతుందని ఎవరూ ఉహించి ఉండరు. కానీ, ఇంతవరకు యాత్ర జరిగిన ఏ రాష్ట్రంలోనూ యాత్రకు ప్రతిబంధకాలు ఏర్పడలేదు. చివరకు, ప్రస్తుతం యాత్ర సాగుతున్న రాజస్థాన్’లో కాంగ్రెస్ వైరి వర్గాలు కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో యాత్రఫై కాంగ్రెస్ ‘ఇంటర్నల్ ఫైట్’ ప్రభావం ఉంటుందని విశేషకులు భావించారు.
ముఖ్యంగా యాత్ర రాజస్థాన్ లో ప్రవేశించే ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం, నేపథ్యంలో రాహుల్ యాత్రపై నీలి మేఘాలు కమ్ముకున్న మాట నిజం. అయితే, అంతవరకు ఫైటింగ్ మూడ్ లో ఉన్న గెహ్లాట్, పైలట్ వర్గాలు రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టే సరికి ఎదో మంత్రం వేసినట్లు సర్కస్ పులుల్లా సైలెంటై పోయారు.
సరే ఇంతవరకు సాగిన యాత్ర ఎన్నికల ఫలితాలను అంతగా ప్రభావితం చేయలేక పోయిందనే అసంతృప్తి ఉన్నా, యాత్ర మాత్రం ఎలాంటి ఒడిడుడుకులు లేకుండా సాగిపోతోంది. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ శ్రేణులతో పాటు బాలీవుడ్ తారలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ వెంటన నడిచారు. బుధవారం డిసెంబర్ 14)ఉదయం సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్న్.. రాహుల్‌తో పలు అంశాల గురించి చర్చించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్న ఫోటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాదం కలిపారు.. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి నిలబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం మనం విజయం సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుంది అని ట్వీట్ చేసింది.
రాహుల్ పాదయాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొనడంపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేరడం ఆశ్చర్యకరం కలిగించలేదు.తదుపరి మన్మోహన్ సింగ్‌గా తనను తాను అభివర్ణించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను తృణప్రాయంగా తోసిపుచ్చాలి. ఇది రంగులు మార్చే అవకాశవాదం అని విమర్శించారు.
కాగా, 2013 నుంచి 2016 వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన సైతం పలు సందర్భాల్లో నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది కాంగ్రెస్ నిర్వహించిన ఓ సదస్సులోనూ పాల్గొన్న రాజన్.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని రాజకీయ నాయకులు కప్పిపుచ్చుకోవాలని భావిస్తే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. కాగా, రాహుల్ సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్ర కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. మేర కొనసాగనుంది.