2022 రౌండప్ .. సమతామూర్తి విగ్రహావిష్కరణ
posted on Dec 14, 2022 @ 11:01AM
ఫిబ్రవరి..
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ... నిన్న జనవరిలో ఏమి జరిగింది తెలుసుకున్నాం .. ఈరోజు ఫిబ్రవరిలోకి వెళదాం రండి ..
జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.
ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్ లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.
అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.
ఫిబ్రవరి 6:
ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు. వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.
(మార్చి 22 లో ఏమి జరిగింది ..రేపు చూద్దాం)