ఐటీలో ఏపీ బీహార్ కంటే అధమం
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చ మొత్తానికి కేంద్ర బిందువుగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిలిచారు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే సాప్ట్ వేర్ ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దిగువన 15వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు.
ఈ జాబితాలో కర్నాటక, మహారాష్ట్ర తరువాత మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడిన ఐటీ సాఫ్ వేర్ రంగం ఇప్పుడు అధమస్థానానికి చేరుకోవడానికి వేగంగా పరుగులెడుతోంది. ఇక రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఇంకా కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే 2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం ఉండగా, మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం. కాగా ఇందులో ఏపీ వాటా 0.111 శాతం మాత్రమే. సరిగ్గా కేంద్ర మంత్రి ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించిన రోజే హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) 20వ వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా హాజరయ్యారు.
ఈ రెండింటికీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది. హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు వెనుక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్, కృషి, పట్టుదల ఉన్నాయి. నాడు కేవలం చంద్రబాబు చొరవ వల్లే హైదరాబాద్ కు వచ్చిన ఐఎస్ బి ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అప్పటికే ఐటీ హబ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చారు. ఇందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్న విధానంపై దేశంలోనే కాదు, ప్రపంచంలోనే గుర్తింపు పొందడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. బెంగళూరును కూడా అధిగమించి ఐటీ పరిశ్రమ హైదరాబాద్ లో ఎదిగింది.
ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది. ఇందుకు నిదర్శనమే రాజ్యసభలో కేంద్ర ఐటీ మంత్రి ఐటీ ఉత్పత్తులపై వెల్లడించిన గణాంకాలు.