అమ్మలాలింపు.. కూతురు తాళింపు
posted on Dec 17, 2022 @ 10:43AM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. తన నివాసంతో పాటు పార్టీ కార్యాలయానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ.. పాలేరు మట్టిని చేతిలోకి తీసుకొని. ఆ మట్టి సాక్షిగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.. సైతం తనదైన శైలిలో మాట్లాడారు.
అయితే వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పాలేరులో ఈ భూమి పూజ అనంతరం తొలుత వైయస్ విజయమ్మ మాట్లాడుతూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటికి రెండు సార్లు.. మాట్లాడుతుంటే.. వెనుక ఉన్న వారు అమ్మ.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ ఆమెకు గుర్తు చేయడం.. దీంతో వైయస్ విజయమ్మ.. తలకొట్టుకొంటూ... సారీ అమ్మ.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సవరించుకొని మాట్లాడడం.. చూస్తే.. ఇదో కొత్త నాటకం అని వారు గుర్తు చేస్తున్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సైతం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైయస్ జగన్ 16 మాసాలు చంచల్‌గూడ జైల్లో ఉండగా.. ఈ తల్లీకూతుళ్లు.. సోదరుడు జగనన్న కోసం పాదయాత్రలు, ప్రచారాలు సైతం చేశారని ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేసుస్తున్నారు. ఆ క్రమంలో... తాను జగనన్న వదిలిన బాణం అంటూ ఆయన సోదరి వైయస్ షర్మిల..తనకు తాను అభివర్ణించుకొని మరీ ఆమె పాదయాత్ర చేసిందని వారు పేర్కొంటున్నారు.
అలాగే వారి పాదయాత్రలో అయితేనేమీ.. వారి బస్సు యాత్రలో అయితేనేమీ.. ఏ ప్రచారంలో అయినా.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా వీరు.. సెంటిమెంట్ అనే అయింట్‌మెంట్‌తో చాలా చాకుచక్యంగా.. తమ మాటల గారడీతో ప్రజలను బుట్టలో పడేశారని.. వీరి మాటలను నమ్మిన అమాయక ప్రజలు.. వీరిద్దరి బుట్టలో పడిపోయి.. నాడు ఫ్యాన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దేశారని.. అలా వైయస్ జగన్ అధికారలోకి వచ్చారని.. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఈ వైయస్ విజయ్మమ్మ కానీ, వైయస్ షర్మిల కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని... జగన్ పరిపాలనలోని లోపాలను సైతం ఏనాడు వీరిద్దరు ఎత్తి చూపలేదని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా గుర్తు చేస్తున్నారు.
అదీకాక తొలుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము అనుకూలమంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి లేఖ సైతం ఇచ్చిందని... ఆ తర్వాత తూచ్.. తూచ్.. మేము ఒప్పుకోమంటూ.. ఉమ్మడి రాష్ట్రానికే తాము కట్టుబడి ఉన్నామంటూ నాడు సదరు ఈ ప్యాన్ పార్టీ యూటర్న్ తీసుకోందని.. ఆ సమయంలో వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలను జగన్ పార్టీలోనే ఉన్నారని నెటిజనులు ఈ సందర్బంగా చెబుతున్నారు.
మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే..ఈ తల్లీకూతుళ్లు .. పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోవడం.. ఆ క్రమంలో వైయస్ షర్మిల.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం. అనంతరం ఆమె చేపట్టిన మంగళవారం దీక్షలు.. అలాగే రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ఆమె పాదయాత్ర చేపట్టడం.. నాటి నుంచి నిన్న మొన్నటి హైదరాబాద్ ఎపిసోడ్ వరకు అంతా చాలా వ్యూహాత్మకంగా .. పకడ్బందీగా వీరిద్దరు అడుగులు వేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా.. వైయస్ షర్మిల ఏడాదిగా చేస్తున్న పాదయాత్రకు రానీ హైప్ ఒక్కసారిగా.. హైదరాబాద్ ఎపిసోడ్‌తో వచ్చేసిందని.. చివరకు ప్రధాని మోదీపై.. షర్మిలకు స్వయంగా పోన్ చేశారంటే... వీరి వేస్తున్నది.. పాదయాత్రలో అడుగులు కాదని.. అధికార పీఠం కోసం వీరు వేస్తున్న పాదముద్రలని అర్థమవుతోందని నెటిజనులు పేర్కొంటున్నారు.
గతంలో అంటే... 2019 ఎన్నికలకు ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం... జగనన్నతోనే సాధ్యమంటూ వీరిద్దరు ప్రచారం చేసి.. ఆయన్ని అందలం ఎక్కించారని.. ఆ తర్వాత వైయస్ జగన్ మాత్రం వీరికి అందకుండ పోయారని.. జగన్ అధికారంలోకి రావడం కోసం.. ఈ తల్లీకూతుళ్లు లాలింపు.. ఆ తర్వాత వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తల్లీకూతుళ్లకు తాళింపు బాగానే వేశారని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా సెటైరికల్‌గా వ్యాఖ్యానిస్తున్నారు.