బెంజి కారుకు ఆటో ఆసరా!
posted on Dec 17, 2022 @ 2:22PM
తాతకు దగ్గులు నేర్పినట్లుఅన్నా.. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు అన్నా.. తమ కంటే పై స్థాయి వాళ్లకు సాయం చేస్తామనడం, సలహాలిస్తామనడం సరికాదు అని చెప్పడమే. అయితే అరుదుగానైనా అటువంటి సందర్బాలు ఎదురౌతుంటాయి. ఓ బెంజి కారు ఓనరుకు అలాంటి పరిస్థితే వచ్చింది. ఆగిపోయిన తన కారుకు ఆటోయే ఆసరా అయ్యింది.
హాయిగా ఝామ్మంటూ వెళుతున్న వాహనం హఠాత్తుగా రోడ్డు మీద ఆగిపోతే.. దగ్గర్లో మెకానిక్ ఉంటే వెళ్లి పిలుచుకుని వచ్చి రిపేర్ చేయించుకుంటాం. అదే దగ్గరలో మెకానిక్ షాపేదీ లేకపోతే ఏం చేస్తాం. టూ వీలర్ అయితే తోసుకుంటూ వెళిపోతాం. అదే కారైతే.. రోడ్డు మీద వెళ్లే మరో కారు వాళ్లనో, ట్రాలీ డ్రైవర్ లో బతిమలాడుకుని దానికి ఓ తాడు కట్టి మెకానిక్ షాపు వరకూ తీసుకు వెళతాం. రోడ్డు మీద అలాంటి దృశ్యాలను చాలానే చూసి ఉంటాం. ఓ ఆటో ఆగిపోతే.. మరో ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ కాలితో ముందు ఆగిపోయిన ఆటోను తీసుకువెళతాడు.
ద్విచక్రవాహనాలనూ అలా తోసుకుంటూ వెళుతున్న సందర్భాలు మనకు చాలానే తారసపడి ఉంటాయి. అయితే ఏకంగా ఓ బెంజి కారుకు ఆటో డ్రైవర్ తన కాలి ఆసరా ఇచ్చాడు. ఔను నిజమే.. రోడ్డు మీద ఆగిపోయిన మెర్సిడీస్ బెంజ్ కారును ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ ముందు బెంజికారుకు తన కాలు ఆసరాగా ఇచ్చి తోసుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన పుణెలో జరిగింది.
కోరాగావ్ పార్క్ ప్రాంతంలో ఓ బెంజ్ కారు ఆగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఆగిపోయిన కారు ముందు బిక్కముఖం వేసుకు నిలుచున్న ఆ కారు యజమానిని చూసి జాలేసిందో ఏమో.. ఆ దారిలో వెళుతున్న ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ.. తన కాలును కారు బంపర్ పై పెట్టి తోసుకుంటూ మెకానిక్ షెడ్ వరకూ తీసుకు వెళ్లాడు. ఆ ఆటో డ్రైవర్ సహకారాన్ని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు.