ఏపీలో పొత్తులు పొడిచేసినట్లేనా? పవన్ మాటల మర్మమేటిటి?
posted on Dec 19, 2022 5:19AM
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడుపులపై జనసేనాని స్పష్టత ఇచ్చేసి నట్లేనా.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వను అని పునరుద్ఘాటింవచిన పవన్ మాటల వెనుక ఉన్నది, తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కూటమేనా? అంటే ఔననక తప్పదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవదు అని ఖరాఖండీగా చేప్పేసిన పవన్ ఇప్పటికే బీజేపీతో మిత్రుత్వం ఉన్న జనసేన తమ కూటమితో తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళతామన్న సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కల్యాణ్ అనడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా రాష్ట్రంలో పొత్తుల గురించి తొట్ట తొలుత మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆ తరువాత దారి మార్చినట్లు కనిపించినా తాజాగా మరోసారి..అదు మాట పునరుద్ఘాటించారు. కొద్ది రోజుల ముందు శ్రీకాకుళంలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కూడా ఇదే మాట చెప్పారు. రాష్ట్రంలో వైసీపీని తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాల ఐక్యత పై తమ అధినేత జగన్ త్వరలో ప్రకటిస్తారన్నారు. ఆయనా మాట అన్న రోజుల వ్యవధిలోనే పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఈసారి వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా.. అన్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. పల్నాడులో జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని.. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదన్న పవన్.. వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలిన మాటలేనని.. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానన్నారు. వాళ్ళు నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తానన్న పవన్.. అందుకు జన సైనికులే రక్షగా ఉండాలన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చేసినట్లైంది.
అంతే కాకుండా 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీలతో జనసేన పొత్తు ప్రస్తావించారు. 2014 మాదిరి 2019లో కూడా బీజేపీ, టీడీపీలతో పొత్తులో పెట్టుకుంటే వైసీపీ గెలిచేది కాదన్న పవన్.. ఈసారి ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీకి ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈసారి ఎన్నికలలో మహా పొత్తు (అంటే తెలుగుదేశం, జనసేన అలయెన్స్) ఖరారైనట్లే. ఈ మాట పవన్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. 2019ని ప్రస్తావిస్తూ ఈసారి అలా జరగదని చెప్పారంటే ఆయన మాటల వెనుక ఉన్న అర్ధమదే అని అంటున్నారు. దానికి తోడు వైసీపీ వ్యతిరేక శక్తులన్నటినీ ఏకం చేస్తానని కూడా చెప్పేశారు. సో.. మొత్తంగా ఈసారి ఏపీలో తెలుగుదశం పార్టీతో బీజేపీ, జనసేనలు కలసి పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.