సంక్షేమమే చాలదు గురువా..!
posted on Dec 17, 2022 @ 12:13PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అడిగింది ఒక్క ఛాన్స్ మాత్రమే అయినా.. మరో సారి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశ పడడంలో తప్పులేదు. కానీ, అందుకు ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం ఆయన్ని గమ్యానికి కాదు కదా, ఆ దరిదాపుల్లోకి కూడా తీసుకుపోయేలా లేదు. రాజకీయ ఆర్థిక రంగంలో ఓనమాలు తెలిసిన ఎవరైనా ఈ విషయం చెపుతారు. అయితే జగన్ రెడ్డి దురదృష్టం ఏమంటే లక్షల్లో జీతాలు తీసుకునే వందల సంఖ్యలో ఉన్న సలహాదారులు ఎవరూ ఆయనకు ఆ విషయం చెపుతున్నట్లు లేదు. సంక్షేమ పథకాలతోనే అధికారం వెతుక్కుంటూ వస్తుందని ముఖ్యమంత్రి కంటున్న కలలు.. వాస్తవ పరిస్థితికి ఎంత దూరంలో ఉన్నాయో చెప్పే నాథుడే లేక పోయాడు. సంక్షేమ పధకాలు మోతాదు మించినంత వరకు, ఓకే.. కానీ, గీత దాటితే.. ఏమవుతుందో.. చెప్పనక్కర్లేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ.. తమకే ఓటేస్తారన్న జగన్ రెడ్డి లెక్క తప్పు. లబ్దిదారులో, కులాల కూడికలూ, తీసివేతలూ ఉంటాయి.. పార్టీ అఫ్లియేషన్ తిరకాసులుంటాయి. లబ్దిదారుల ఎంపికలో వ్యతిరేకత లుంటాయి.. చివరకు జగన్ రెడ్డి లెక్క మంచం కోళ్ల లెక్కలా తయారవుతుంది.
అదలా ఉంచితే.. ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఉచితాలు గుడ్ ఎలక్షన్ పాలిటిక్స్ అయితే అవ్వచ్చేమో కానీ, బ్యాడ్ ఎకనామిక్స్. ఇది పలు సందర్భాలలో తేలింది. అందుకే.. అంతో ఇంతో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎంతవరకు అవసరమో అంత వరకే అమలు చేస్తాయి. అందుకే దివంగత ప్రియతమ నేత సహా పెద్దలు ఏట్లో వేసినా ఎంచి ఎంచి వేయాలని..చెప్పారు. కానీ జగన్ రెడ్డికి మీట నొక్కడమే తప్ప, ఆ సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి.. ఎందుకు ఖర్చవుతున్నాయానే స్పృహ లేదు. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తింటోందని మిగిలిన దేశం అంతా కోడై కూస్తున్నా చెవికెక్కించుకోవడం లేదు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ మరో శ్రీలంక అయినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమిటయ్యా అంటే.. ఉత్పాదకత, అభివృద్ధి పథకాలను అటకెక్కించేసి.. సంక్షేమ పథకాల పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నది.
అయితే ఖర్చు మీట్ అవ్వడానికి అవసరమైన ఆదాయం లేకపోవడంతో అప్పులు చేస్తోంది. ఎడాపెడా అప్పులు చేసి.. సంక్షేమం అంటోంది. ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు.. వాటికి వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పు.. చివరాఖరికి ఉద్యోగుల వేతనాలను కూడా అప్పులు తెచ్చి విడతల వారీగా చెల్లించే పరిస్థితికి దిగజారిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఫ్రై చేస్తూ జగన్ రెడ్డి సంక్షేమ పథకాలే ఎన్నికలలో గెలిపిస్తాయని నమ్ముకున్నారు. అయితే కేవలం సంక్షేమం ఒక్కటే ఎన్నికలలో గెలిపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. సంక్షేమం దారి సంక్షేమానిదే.. ప్రజల నిర్ణయం ప్రజలదే అని పలు మార్లు రుజువైంది. సంక్షేమంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే.. ప్రజలు సంతృప్తి చెందుతారు. ఓ చేత్తో సంక్షేమం అంటూ తాయిలాలు ఇచ్చి మరో చేత్తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి కొడితే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు.
అదీ కాకుండా జగన్ రెడ్డి ఓ చెత్తో సంక్షేమం పేరుతో తాయిలాలు పందేరం చేస్తూ.. మరో చేత్తో పన్నుల రూపంలో అంతకు రెండింతలు జనం నుంచి గుంజేస్తున్నారు. అదీ కాక సంక్షేమం పేరిట మీట నొక్కి డబ్బులు తమ ఖాతాల్లో వేస్తున్నారని జనం సంబరపడటం సంగతి పక్కన పెడితే అది జగన్ సొంత జేబులో సొమ్ము కాదని జనానికి తెలియదని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదు. సుపరిపాలన అంటే సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రయోజన చేకూరేలా అభివృద్ది జరగాలి. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంక్షేమం దారీతెన్నూ లేకుండా సాగుతోంది. ఆ పథకాల లబ్ధిదారులకు సైతం సంతృప్తి లేని విధంగా జగన్ పథకాలు ఉంటున్నాయి. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అప్పులు పుట్టని స్థితిలో ఏపీ దివాళా అంచులకు చేరుకుంది. కేంద్రం జీఎస్టీ తదితర అక్కౌంట్ల కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను పాత బకాయిల కింద వెనక్కు తీసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి వేరే ఉదాహరణ చెప్పనవసరం లేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు, జీతాలు సకాలంలో రావడం లేదు. చివరకు పెన్షనర్ల పెన్షన్లు కూడా సకాలంలో జమ కావడం లేదు. చిన్నా చితక కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు, కొండల్లా పేరుకు పేరుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి నిలువెత్తు నిదర్శనలే. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఆర్థిక వ్యవస్థ తప్పుటడుగులే వేస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా ‘ఉచిత’వ్యయ పద్దును పెంచేస్తుండటంతో ఇప్పుడిక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. అయినా కూడా జగన్ రెడ్డి రాష్ట్రం గురించిన చింత లేకుండా వైనాట్ 175 ఔటాఫ్ 175 అంటూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ చిత్రం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వై ఎట్ లీస్ట్ వన్ అని జనం ప్రశ్నించే పరిస్థితి మరెంతో దూరంలో లేదు. కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాలుస్తాయన్న భ్రమలను వదుల్చుకోకుంటే 2019లో జనం ఇచ్చిన ఒక్క చాన్సే లాస్ట్ చాన్స్ అవుతుంది.