తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన కుమ్ములాటలు.. హై కమాండ్ సపోర్ట్ రేవంత్ కే!?
posted on Dec 19, 2022 9:01AM
తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పుతోంది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెడుతోంది. వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ వర్గాయులపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది. టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు.
అక్కడితో ఆగకుండా తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. సీనియర్లు ఏదో ఒక రూపంలో పార్టీ నడకకు, పురోగతికి అడ్డు పడుతూనే ఉన్నారు. అన్నిటినీ సహించి పార్టీని ఏకతాటిపై నడిపించాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు ఏమంత సఫలం కాలేదు. ఇక మునుగోడు ఉప ఎన్నిక తరువాత నుంచీ రేవంత్ పై సీనియర్ల విమర్శల దాడి ఒక రేంజ్ కు చేరుకుంది.
తాజాగా పీసీసీ కమిటీల నియామకంతో సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకించే విషయంలో ఓపెన్ అప్ అయిపోయారు. రేవంత్ పట్టుబట్టి లేదా పైరవీలు చేసి పీసీసీ కమిటీలను వలస నేతలతో నింపేశారంటూ రోడ్డెక్కారు. కొందరు రాజీనామాల బాట పట్టారు. దీంతో ఇక లాభం లేదని రేవంత్ వర్గీయులూ కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణ పీసీసీ కమిటీ పదవులకు రాజీనామా చేసిన 12 మంది నేతలు.. పార్టీ సీనియర్లపై మాటల యుద్ధానికి దిగారు. పీసీసీ కమిటీలకు రాజీనామాలు చేసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు రాజీనామా చేసి ఊరుకోకుండా.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లతో అటో ఇటో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. రాజీనామాల అనంతరం వీరు సీనియర్ల పై విమర్శల దాడికి దిగారు. నిజానికి గతంలో ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో నియమించిన కమిటీల్లో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వాస్తవంగా చూస్తే తాజాగా అధిష్ఠానం నియమించిన కమిటీలు మొత్తంలో కలిపి తెలుగుదేశం నుంచి వచ్చిన వారు 13 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా తెలంగాణలో తెలుగు దేశం క్రీయాశీలంగా వ్యవహరించకపోవడంతో అనివార్యంగా కాంగ్రెస్ లో చేరిన వారే. వీరంతా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తున్నవారే. పదేపదే వలస నేతలంటూ తమపై వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాల్న నిర్ణయానికి వచ్చారు. అందుకే రాజీనామాలు, విమర్శలతో రచ్చకెక్కారు. దీంతో ఇప్పటి వరకూ రేవంత్ పైన, రేవంత్ వర్గీయులపైనా విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్లంతా డిఫెన్స్ లో పడ్డారు. దీంతో పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడటం కరెక్టు కాదు.. ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక వైపు పార్టీలో ఈ స్థాయిలో వాద ప్రతివాదాలు జరుగుతున్నా.. అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బహిరంగం అయిపోయినా.. రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.
ఇప్పటి వరకూ ఆయన తలపెట్టిన పాదయాత్రకు హై కమాండ్ అనుమతి ఉంటుందా... సీనియర్లు ఏమంటారు? అడుగులు పడనిస్తారా? అన్న అనుమానాలున్నాయి. నిజానికి రేవంత్ పాదయాత్ర చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. సీనియర్లు పదే పదే అడ్డు పడుతుండటంతో రేవంత్ పాదయాత్ర వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ పీసీసీ కమిటీల నియామకం తర్వాత సీన్ మారిపోయింది. పార్టీ సీనియర్లు తమ వ్యతిరేకతను బహిరంగం చేయడంతో ఇక రేవంత్ కు దారి క్లియర్ అయిపోయినట్లైంది. దీంతో జనవరి నుంచి సకల జనుల సంఘర్షణ పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ఆయన కార్యాచరణ ప్రకటించేశారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసేశారు. సీనియర్లు కలిసి వచ్చినా, రాకున్నా తన పని తాను చేసుకుపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.
టీపీసీసీ చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, 2023 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా.. ఎంతగా బుజ్జగించినా, ఎన్నిసార్లు సీనియర్లను సమాధానపరిచినా వారి తీరు మారకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా సీనియర్లను పట్టించుకోకుండా పని చేసుకుపోవాలని రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ లో కీలక నేత ప్రియాంక గాంధీ కూడా రేవంత్ కు పూర్తి మద్దతు ప్రకటించి గో ఎహెడ్ అని అనుమతి ఇచ్చేశారని అంటున్నారు. రేవంత్ పైనా, రేవంత్ వర్గీయుల పైనా విమర్శలు గుప్పిస్తున్న సీనియర్లెవరూ తమ సొంత నియోజకవర్గంలో కూడా గెలిచే సత్తాలేనివారేనని హై కమాండ్ గుర్తించడం వల్లనే వారిని లైట్ తీసుకుని రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించే విషయంలో పీసీసీ చీఫ్ కు స్వేచ్ఛ ఇచ్చిందని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.