ఆత్మీయ సమ్మేళనమా.. రాజకీయ తంత్రమా?
posted on Dec 17, 2022 @ 4:46PM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉన్నప్పటికీ ఎలక్షన్ హీట్ మాత్రం మిడ్ సమ్మర్ ను తలపిస్తోంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ కుల సమీకరణాలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం మద్దతు కోసం పార్టీలన్నీ తెగ ఆరాటపడుతుంటాయి.
ఈ నేపథ్యంలోనే ముగ్గురు రాజకీయ నాయకుల అడుగులు అన్ని పార్టీలలోనూ రాజకీయ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే.. మరొకరు కమలం పార్టీకి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇప్పుడు వారి కదలికలపై అన్ని పార్టీలలోనూ ఉత్కంఠ పెరిగేందుకు కారణమైంది. రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా జరుగుతున్న కాపు నేతల సమావేశాలు, సదస్సులూ రాజకీయ హీట్ ను పెంచేస్తున్న నేపథ్యంలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఆ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. వీరిలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నాయకుడు. అయితే గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా తెలుగుదేశం కార్యక్రమాలలో క్రియా శీలంగా పాల్గొనడం లేదు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేరా అన్న సందేహం కలిగేంతగా గంటా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇక బోండా విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో ఆయన గతంలోలా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నదాఖలాలుకనిపించడంలేదు. బోండా ఒకింత అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం శ్రేణులే అంటున్నాయి. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సంగతి తీసుకుంటే.. ఆయనకు కమలం పార్టీలో పొమ్మన లేక పొగపెడుతున్న పరిస్థితి ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన కన్నాకు.. ఆ పదవి పోయిన తరువాత బీజేపీలో ప్రాధాన్యత బాగా తగ్గింది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో అసలు పొసగడం లేదు.
ఈ నేపథ్యంలోనే బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు బేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నిటికంటే మించి ఈ ముగ్గురి భేటీకి కొద్ది ముందు కన్నా లక్ష్మీ నారాయణ తో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ స్వయంగా గంటా నివాసానికి వచ్చి మరీ భేటీ అయ్యారు. దీంతో బోండా, గంటా, కన్నాల భేటీ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఈ ముగ్గురూ మాత్రం తమది ఆత్మీయ సమ్మేళనంగా చెప్పుకుంటున్నా... రాజకీయ వర్గాలు మాత్రం ఈ ముగ్గురి సమావేశం వెనుకా ఉన్నది రాజకీయమేనని గట్టిగా చెబుతున్నాయి. అయితే ఈ ముగ్గురు నేతల భేటీకి కారణాలేమిటన్న దానిపై భిన్న చర్చలు, వాదనలు వినవస్తున్నాయి.