ఎమ్మెల్యేలకు జగన్ మరో వార్నింగ్!
posted on Dec 16, 2022 @ 10:15PM
జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు మరోసారి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, , రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ చార్జి మంత్రులతో శుక్రవారం (డిసెంబర్ 16) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాన్వయ కర్తలు సైతం హాజరయ్యారు.
గతంలో నిర్వహించిన ఇలాంటి సమావేశాలలో గడప గడపకూ తిరగడం లేదంటూ ఎమ్మెల్యేల పై ఆగ్రహం వ్యక్తం చేసి, గడప గడపకూలో క్రియాశీలంగా, చురుకుగా పాల్గొనని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వనని తెగేసి చెప్పిన జగన్ తాజా సమీక్షా సమావేశంలో కూడా అదే వార్నింగ్ రిపీట్ చేశారు. కాకపోతే ఈ సారి సరిగా పని చేయడం లేదంటూ వేలెత్తి చూపి మరీ వార్నంగ్ ఇచ్చారు.పని తీరు మెరుగు పరచుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పునరుద్ఘాటించారు. కొత్త వారిని బరిలోకి దింపడం ఖాయమన్నారు.
వ్యక్తగతంగా తనకు ఎవరినీ మార్చాలని లేదనీ, ఎమ్మెల్యేలందరిపైనా తనకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పిన జగన్.. పార్టీ కోసం పని చేయకుండా వారే వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పని పరిస్థితికి కొని తెచ్చుకుంటున్నారని చెప్పారు. జగన్ వార్నింగ్ ఇచ్చిన వారిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. వారంతా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్నారని తనకు అందిన నివేదిక ప్రకారం జగన్ వారికి మరో లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల దగ్గర పడుతున్నందున ప్రజలలోకి వెళ్లాలనీ, గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ కనీసం ఐదు నిముషాలు కేటాయంచాలని జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
ప్రభుత్వం ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరాలన్నారు అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులను గుర్తించి.. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకుండా.. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించకుండా ముందుకి సాగాలని సూచించారు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని.. అందరూ ముందుకు సాగాలని సూచించారు.