నీ హక్కులు నీవే రక్షించుకో
గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉన్నాం. మనకు అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే ఉంటాయి. మనం కొనే... కాస్ట్లీ వస్తువులే కాదు, ఉప్పు, పప్పు మొదలు ప్రతి కొనిగోలులో మోసం ఎదురవుతుంది. ధర విషయంగానో, నాణ్యత పరంగానో, తూకం కొలతల విషయంలోనో, కల్తీల విషయంగానో మరో విధంగానో మనం మోస పోతూనే ఉన్నాం. ఒక్క వస్తువుల కొనుగోలు విషయంలోనే కాదు, వైద్య, బీమా సేవలు మొదలు ప్రభుత్వ సేవల వరకు, సేవల విషయంలోనూ, అనేక విధాల మనం మోస పోతున్నాం. మోసాలకు గురవుతున్నాము.
మార్కెట్ మోసాల కారణంగా వినియోగ దారులు కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య పరంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలే కోల్పోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కల్తీ మందులు, కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ పానీయాలు ప్రాణాలు తీసిన సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇక మద్యం కల్తీ గురించి అయితే చెప్పనే అక్కర లేదు. ఇక కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు, విత్తనాలు,పురుగుల మందులు, ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అలాగే, బీమా సంస్థలు కూడా మోసాలకు పాల్పడుతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, మార్కెట్ మోసాలు మహమ్మారిని మించిన విషాదాలను సృష్టించాయి.సృష్టిస్తున్నాయి.
ఈ మోసాలని కట్టడి చేసేందుకు, వినియోగ దారుల హక్కులను రక్షించేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమాలు నడిచాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం మార్చి 15 తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినం, జాతీయ స్థాయిలో డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపు కుంటున్నాం.
వినియోగదారులకు హక్కులున్నాయి. ఆ హక్కులను పరిరక్షించే చట్టాలున్నాయి. నిజానికి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకి జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ వంటి వ్యవస్థలున్నాయి. మోసాలకు పాల్పడిన వ్యాపార, వాణిజ్య,ఉత్పాదక సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని సందర్భాలలో కాకున్నా, కొన్ని సందర్భాలో అయినా కఠినంగా శిక్షిస్తున్నాయి. అయినా, మార్కెట్ శక్తుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు, ఇంకా ఇతర కారణాలున్నా,వినియోగదారులకు తమకున్న హక్కులు, చట్టాల గురించి అవగాహన లేక పోవడం ఒక ప్రధాన కారణం. అందుకే, వినియోగాడులకు తమకున్న హక్కుల గురించి అవగాహన కల్పించేందుకే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతోంది.
అంతర్జాతీయ, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వేర్వేరు తేదీలో జరుగుపుకుంటున్నా లక్ష్యం మాత్రం ఒక్కటే. వినియోగదారులకు హక్కులు, బాధ్యతలను గుర్తు చేయడం, ఉద్యమాన్ని ఐక్యంగా మరింత ముందుకు తీసుకు వెళ్ళడం ఇవే వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రధాన లక్ష్యాలు. మన దేశంలో 1986 డిసెంబర్ 24న, వినియోగదారుల హక్కుల చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ రోజు నుంచి వినియోగదారుల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం, అదే రోజున దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయిత, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తీసుకుని డిసెంబర్ 24 న, జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది.
దేశంలో అవినీతి, అక్రమ వ్యాపారాలను అరికట్టేదుకు, ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న సంస్కరణల నేపధ్యంలో, దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో, ఈ సంవత్సరం, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ప్రధాన థీమ్ గా తీసుకుని, ఈ డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
నిజానికి, సుస్థిర స్వచ్ఛ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణ కారణంగా ఆర్థిక వ్యవస్థలో,వ్యాపార కార్యకలాపాలలో,వ్యాపార,సేవా కార్యకలాపాల స్వరూప, స్వభావాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగానూ ‘ఆన్లైన్’ కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ‘ఆన్లైన్’ మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, 1986 నుంచి అములులో ఉన్న నియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని, డిజిటల్ యుగానికి తగిన విధంగా సవరించింది. గతంలో, 1991, 1993లోనూ చట్ట సవరణలు జరిగినా, 2020 జూలై 20 నుంచి అమలులోకి వచ్చిన, 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారుల హక్కుల పరిధిని విస్తృత పరిచింది. ఒక విధంగా నూతన చట్టం డిజిటల్ చట్టం..పాత మోసాలకు పగ్గాలు బిగిస్తూనే, డిజిటల్ మోసాలకు కళ్ళెం బిగించేందుకు ఉద్దేశించిన చట్టంగా పేర్కొనవచ్చును.
అందుకే, 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం, థీమ్’గా తీసుకోవడం జరిగింది. నిజానికి కేంద్ర కన్స్యూమర్ అఫైర్స్ డిపార్టుమెంట్ కొవిడ్ కాలంలోనూ 2019 చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే వుంది. అందులో భాగంగానే, గత సంవత్సరం 2021లో, వర్చువల్ గా నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, ‘వినియోగాదరుడా .. తెలుసుకో నీ హక్కులు అన్న థీమ్ తీసుకుని ప్రచారం కల్పించడం జరిగింది.
కొత్తగా 1986 హక్కుల చట్టానికి తెచ్చిన సవరణలలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏర్పాటు ప్రధామైనది. అలాగే, కాంట్రాక్టుల్లో అక్రమాలను అరికట్టేందుకు పొంచుపరిచిన నిబంధనన అసంబద్ధ నిబంధనలకు అడ్డు కట్టవేస్తుంది.కొత్త చతంలో నినియోగాదరుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గా మార్చారు.
అలాగే. ఇంతకు ముందు చట్టం పరిధిలో లేని, ఆన్లైన్ ప్రకటనల మోసాలను చట్టం పరిధిలోకి తీసుకు వచ్చారు. వినియోగదారులను పక్కదారి పట్టించే ఆన్లైన్ ప్రకటనలపైన 2019 చట్టం కొరడా ఝుళిపించింది. అంతే కాదు, సవరణ చట్టం, పక్కదారి పట్టించే వాణిజ్య ప్రకటనలకు చక్కని నిర్వచనం కూడా ఇచ్చింది. వస్తు సేవల తప్పుడు వర్ణన, ఒక ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి తప్పుడు హామీ, తప్పుడు గ్యారెంటీ ఇవ్వడం. వస్తు సేవల మౌలిక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి గోప్యంగా ఉంచడం, ఇలా, వినియోగదారుని తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు చట్ట పరిధిలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. వాణిజ్య ప్రకటనల మోసాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( సిసిపిఎ) చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్, టెలీషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్ వివాదాలు సిసిపిఎ పరిధిలోకి వస్తాయి. అందులో భాగంగా, వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు, రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విదేంచే అధికారం సిసిపిఎకు ఉంటుంది.
నిజానికి, గతంలో గానీ ప్రస్తుతంలో గానీ, వినియోగదారుల హక్కుల రక్షణకు చట్టాలు లేక పోవడం కంటే, ఉన్న చట్టాల గురించి వినియోగదారులకుసరైన అవగాహన లేక పోవడం వల్లనే వినియోగదారులు మరింతగా దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా చట్టాలు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతలు గురించి తెలియక పోవడం, తెలిసినా చిన్న మొత్తాల కోసం, సమయం ‘వృధా’ చేసుకోవడం ఎందుకని, ఎవరికి వారు, చట్టం తలుపులు తట్టక పోవడం వలన, మార్కెట్ శక్తులు వినియోగదారులను తేలిగ్గా చీట్ చేస్తున్నాయని వినియోగదారుల హక్కుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.
ఉదాహరణకు, డి మార్ట్ క్యారీ బ్యాగుల కేసునే తీసుకుంటే, డి మార్ట్ ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్) ఇవ్వాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్- సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్ డీమార్ట్ శాఖను ఆదేశించింది.అయితే, ఒక్క డి మార్ట్ అనే కాదు, ప్రతి షాపింగ్ మాల్. క్యారీ బ్యాగ్ కు ఛార్జ్’చేస్తూనే ఉన్నాయి. ఎవరికివారు ముష్టి మూడు రూపాయలే కదా అని ఉపేక్షించడం వల్లనే, షాపింగ్ మాల్స్ కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నాయని వినియోగ దారుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు. అందుకే, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మొదటి అడుగు, వినియోగదారులదే కావాలని, వినియోగదారులు కళ్ళు తెరిస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవుతుందని అంటున్నారు. నీహక్కులకు నేవే రక్ష ..నీ హక్కులు నీవే రక్షించుకో అంటున్నారు.