మాచర్లలో వైసీపీ శ్రేణుల గూండాగిరీ.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం
posted on Dec 16, 2022 @ 9:40PM
పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం (డిసెంబర్16) మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, మాచర్ల పట్టణంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ వార్డులో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. దీంతో అక్కడి వైసీపీ శ్రేణులు బ్రహ్మానందరెడ్డితోపాటు, టీడీపీ నేతలపై దాడి చేశాయి. రాళ్లు, కర్రలతో దాడికి యత్నించాయి. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. వెంటనే టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పరస్పరం దాడికి పాల్ప్డడ్డాయి. వైసీపీ శ్రేణులు తాజాగా టీడీపీ ఆఫీసును దగ్ధం చేశాయి. టీడీపీ ఆఫీసులోనే బ్రహ్మానంద రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఇక్కడికి చొరబడిన వైసీపీ శ్రేణులు ఫర్నీచర్ ధ్వంసం చేశాయి.
మరోవైపు రైల్వే ట్రాక్ సమీపంలో ఆందోళనకారులు పలు కార్లను దహనం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నుంచి తరలించారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులపై విమర్శలు చేశారు. వైసీపీ దాడికి పాల్పడుతున్నప్పటికీ, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలే తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ శ్రేణులు స్థానిక బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దీనికి ఈ ఘటనే నిదర్శనమని నారా లోకేష్ అన్నారు.
కాగా తెలుగుదేశం ఆంధ్ర్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాచర్ల లో వైసీపీ అరాచకత్వం పరాకాష్టకుచేరిందని విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మాచ్చర్ల ఏమైనా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జాగీరా ? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా? దాడులు చేసిన వైసీపీ వాళ్లను వదిలేసి టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడం దారుణం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు గూండాల్లా వ్యవహరించారనీ, ఐదుకార్లు ధ్వంసం చేసి, టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి ఈ దాడులకు నాయకత్వం వహించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మాచర్లలో టీడీపీ సానుభూతి పరుల షాపులను కూడా తగలబెట్టారని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తున్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారన్నారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పుంది. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా టీడీపీ కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తాం. మా బ్రహ్మారెడ్డిని చూసి పిన్నెల్లి ప్రతి రోజూ భయపడుతూ బ్రతుకుతున్నాడు.ఖబడ్దార్ పిన్నెల్లి..నీ పని అయిపోయింది. నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఉండగా మాచర్ల ఘటనలను తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు డీఐజీకి ఫోన్ చేశారు. కి టీడీపీ మాచర్లలో పరిస్థితులు ఇంత దారుణం గా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్య తీసుకోవాలని, వైసిపి గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.