పిళ్ళై యూ టర్న్ కవితకు కాసింత ఊరట?
posted on Mar 10, 2023 @ 3:51PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొంత ఊరట లభించిందా? మూడు రోజుల క్రితం కవితకు బినామీగా వ్యవహరించానని ఈడీ ఎదుట వాగ్ములం ఇచ్చిన అరుణ్ రామచంద్ర పిళ్లయ్.. యూటర్న్ తీసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన నా వాంగ్మూలాన్ని ఉప సంహరించుకోవటానికి అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం (మార్చి 10) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. నిజానికి, పిళ్ళై వాంగ్ములం ఆధారంగానే ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు సమన్లు జారీ చేసింది. శనివారం (మార్చి 11)వ విచారణకు హాజరయ్యేందుకు కవిత సిద్ధమయ్యారు. అయితే కవిత విచారణకు హాజరు అవ్వడానికి 24 గంటల ముందు.. పిళ్ళై పిటిషన్ దాఖలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.
విచారణ సందర్భంగా అరుణ్ పిళ్ళై ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. కవిత బినామీ అంటూ పిళ్ళై ఛార్జిషీట్ లో ఈడీ ఆనేక మార్లు కవిత పేరును ప్రస్తావించింది. పిళ్ళై విచారణ తర్వాతే కవితకు నోటీసులు జారీ చేయటం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో తీహార్ జైల్లోనే ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాను సైతం ఈడీ అరెస్ట్ చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారిస్తారనే వార్తలు వస్తున్న క్రమంలో.. పిళ్ళై తన వాగ్మూలం వెనక్కి తీసుకునెందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం అనూహ్య పరిణామంగా చెప్పవచ్చు.
ఈ నేపధ్యంలో ఒక సారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. చట్టంలో అలాంటి వెసులు బాటు ఉందా, అనే విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తే.. అప్పుడు కవిత విచారణ వాయిదా పడుతుందా లేక యథావిధిగానే జరుగుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే, ఒక వేళ కోర్టు, పిళ్ళై వాంగ్ములం ఉపసంహరణకు అనుమతిచ్చినా, అది కవిత విచారణకు అవరోధం కాబోదని అంటున్నారు. నిజానికి, ఏదైనా కేసు విచారణ సమయంలో ముద్దాయి, సాక్షి లేదా కేసుతో సంబంధం ఉన్న వారెవరైనా అప్ప్రోవర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలాన్ని, విచారణ సంస్థలు యథా తథంగా తీసుకోవని, సర్కమ్ స్టెన్స్ ఎవిడెన్స్, ఫోన్ సభాషణలు ఇతర ఆధారాలు చూసుకునే సమన్లు జారీ చేయడం, విచారించడం లేదా అరెస్ట్ చేయడం వంటి చర్యలకు ఉపక్రమిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, పిళ్ళై యూ టర్న్ తో కవితకు ఒక వేళ కొంత ఉపశమనం లభించినా అది తాత్కాలికమే అంటున్నారు.