సమైక్యాంధ్రవాదికి కమలం పార్టీలో తెలంగాణ బాధ్యతలా?
posted on Mar 12, 2023 5:59AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియ పూర్తయ్యిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే ఆయన కమలం గూటికి చేరతారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పేరుకైతే కాంగ్రెస్ లో ఉన్నారు కానీ పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తో విభేదించి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించి 2014 ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నది లేదు. రాహుల్‌గాంధీ ఏపీ-తెలంగాణలో పాదతయాత్ర సాగినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చివరాఖరికి ఆయన తన సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి టీడీపీలో చురుకుగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా. అంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ప్రకటించి రాజకీయ సన్యాసం తీసుకుంటే.. ఎటువంటి ప్రకటనా లేకుండా ఇంతకాలం అదే పని చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు అటువంటి ఆయన ఇప్పుడు బీజేపీలో చేరి రాజకీయాలలో క్రియాశీలంగా మారేందుకు సమాయత్తమౌతున్నారు. అయితే ఆయనకు బీజేపీలో ఏపీ బాధ్యతలు కాకుండా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడం బీజేపీకి ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ మాత్రం స్వయంగా తెలంగాణ జాతిపితగా తనను తాను అభివర్ణించుకున్న కేసీఆరే తెలంగాణ వాదానికి స్వస్తి చెప్పి జాతీయ వాదమంటూ ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితుల్లో ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి వాదనలకు తావే ఉండదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే తెలంగాణలో బీజేపీకి రెడ్డి సమాజిక వర్గాన్ని చేరువ చేసే బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాజీ సీఎం పార్టీలో చేరారంటే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా ఉన్నారా లేదా అన్నది తరువాత ఇప్పటి పరిస్థితుల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తి కమలం గూటికి చేరారు అని చెప్పుకోవడం ఎంత కాదనుకున్నా బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నందునే చేరికకు ఇతర పార్టీల నేతలు ఉత్సుకత చూపుతున్నారన్న ప్రచారమైనా జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.