ఈ సారికి వెళ్లండి.. మళ్లీ రండి!
posted on Mar 10, 2023 @ 3:11PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ శుక్రవారం (మార్చి 10) ముచ్చటగా మూడో సారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం మళ్లీ పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించింది. యధా ప్రకారం విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ సవ్యదిశలో సాగడం లేదని మీడియాకు చెప్పారు.
ఇలా ఉండగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణపై తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనను సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. కేసు పూర్తి వివరాల ఫైల్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశించంది. కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో, వీడియో లను హార్డ్ డిస్క్ రూపంలో తమ ముందు ఉంచాలని కూడా హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసులో సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందన్నారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ పదుల సార్లు ఎడిట్ చేశారని పేర్కొన్నారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు.
ఇలా ఉండగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును కోరారు. మొత్తం మీద మూడో సారి విచారణకు సీబీఐ పిలవడంతో అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ విస్తృతంగా జరిగిన ప్రచారానికి తాత్కాలికంగా తెరపడింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ అవినాష్ రెడ్డికి చెప్పడంతో ఆయన అరెస్టు విషయంలో చర్చకు అయితే ఫుల్ స్టాప్ పడలేదు. మరో వైపు హైకోర్టు అవినాష్ రెడ్డిని విచారించిన సందర్భంగా రికార్డు చేసిన ఆడియో, వీడియోలను సమర్పంచాలని, అలాగే సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని ఆదేశించడంతో సోమవారం తరువాత ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం చూస్తుంటే ఈ కేసు ముగింపు దశకు చేరుకుందన్న అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.