ఒక్క ఫలితం.. అనేక పరాభవాలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఖతం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఆ పార్టీకే దక్కాని. కానీ టీడీపీకి దూరం జరిగి వైసీపీతో జట్టుకట్టిన నలుగురు ఎమ్మెల్యేల బలం చూసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం దక్కకుండా చేయాలని చేసిన ప్రయత్నం వికటించింది. సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు. చివరికి వచ్చే సరికి సొంత పార్టీ వారే ఎదురు తిరుగుతారన్న అనుమానం ఆ పార్టీని వణికించింది. దీంతో క్యాంపు ఏర్పాటు చేసింది. అనుమానం ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించింది. బతిమలాడుకుంది. నిఘా పెట్టింది. ఎన్ని చేసినా చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేల మీద తనకు ఏ మాత్రం నియంత్రణ లేదన్న విషయాన్ని జగన్ కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. అలా కాకుండా వైసీపీ టీడీపీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఒక స్థానం ఆ పార్టీ గెలుచుకుంటుందని వదిలేసి ఉంటే కొద్దో గొప్పో గౌరవం అయినా నిలబడి ఉండేది.  అలా కాకుండా అహంకారానికి పోయి అప్రతిష్ఠ మూటగట్టుకోవడమే కాదు.. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడానికి భయపడే పరిస్థితుల్లో లేరని తనకు తాను చాటుకున్నట్లైంది. కుప్పం స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ సీఎం జగన్ అహంకారంతో చేసిన వ్యాఖ్యల తరువాత తెలుగుదేశం నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనూరాథ ఏ విధంగా చూసినా విజయం సాధించే అవకాశాలు లేవమాత్రంగా కూడా లేవన్నది అంకెలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ శిబిరంలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 22 మంది మద్దతు ఉండాలి. పోనీ వైసీపీలో ఇద్దరు పార్టీతో విభేదించి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు కనుక వారిరువురూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసిన తెలుగుదేశంకు వచ్చే ఓట్లు 21 మాత్రమే. అంటే ఎలా చూసినా పంచుమర్తి అనూరాథ పరాజయం పాలవ్వక తప్పదు. ఇదీ వైసీపీ లెక్క. మరి తెలుగుదేశం ఎందుకు గెలచింది. పంచుమర్తి అనూరాధకు 23 ఓట్లు ఎలా వచ్చాయి? అధికార పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వైసీపీకి పరాభవమే ఎదురైంది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాలలోనూ తెలుగుదేశం విజయఢంకా మోగించింది.  అందులోనూ వైసీపీకి పెట్టని కోటగా భావించే రాయలసీమలోనూ పరాజయ పరాభవమే జగన్ కు ఎదురైంది.   ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ వైఎస్ ఫ్యామిలీ తప్ప,  ఎవరూ సాధించని అమోఘ ఫలితాన్ని టీడీపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి సాధించారు. ఆ దెబ్బకు వైసీపీ అధినేత దిమ్మతిరిగి ఉంటుంది. ఆ పరాభవం నుంచి తేరుకోకముందే..   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగిలింది. ఈ వరుస ఎదురుదెబ్బల వెనుక ఉన్న అసలు కారణమేమిటన్నది అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఇక అర్ధం కావాల్సిందల్లా అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే.  ఔను  గ్రాడ్యుయేట్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ అన్నిటిలోనూ జయాపజయాలకు బాధ్యుడు ఒకే ఒక్కడు . ఆ ఒక్కడూ జగన్ రెడ్డే. ఆయన ఎవరి సలహాలు కానీ, సూచనలు కానీ పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయన వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరికీ కనీస గౌరవం దక్కదు. మర్యాద ఉండదు. ఈ విషయాన్ని తనపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఎమ్మెల్యే మేకపాటి స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్న విషయమనీ, తనకు అందిన సమాచారం మేరకు కనీసం 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారు బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  ఇందుకు కారణం జగన్ ఎమ్మెల్యేలు, నాయకులతో పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరే కారణమని వివరించారు. పీకే సర్వేలు, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది,  తాను బటన్ నొక్కడంతో ఖాతాలలో సొమ్ములు పడుతున్న లబ్ధిదారులు చాలన్నది జగన్ భావనగా మేకపాటి అభివర్ణించారు.   జగన్ తీరు కారణంగానే తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పూచికపుల్ల గౌరవం కూడా దక్కడం లేదు. అధికారులు మాట వినడం లేదు.  ఈ కారణంగానే ఆత్మాభిమానం ఉన్న ఎమ్మెల్యేలెవరూ మరో సారి జగన్ వెంట నడవడానికి ఇష్టపడరన్నది మేకపాటి మాటల సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం, సీఎంఓలో అధికారుల అపాయింట్‌మెంట్ల కోసం గంటలు ఎదురుచూడాల్సిందే. ఈ విషయాన్ని మేకపాటి తనకు ఎదురైన అనుభవాలను చెప్పడం ద్వారా తేటతెల్లం చేశారు. సీఎంను కలవడం కోసం తనలాంటి సీనియర్లు వెళ్లినా పలకరించే నాథుడు ఉండడని మేకపాటి చెప్పారు.  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి వంటి సీనియర్లు దూరం కావడానికీ అదే కారణం.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం కంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవ భారం ప్రభావం పార్టీ భవిష్యత్ లోనూ వెంటాడుతూనే ఉంటుంది. ఇకపై జగన్ నిర్ణయాలను పార్టీ గతంలోలా తలూపేసి ఓకే చెప్పేసే పరిస్థితి ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ.     

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ సారి కర్నాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అందుకు అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం అవ్వడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం (మార్చి 25) ప్రకటించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి జాబితాను విడుదల చేసింది.  మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది.  ఆ జాబితా ప్రకారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు టికెట్ దక్కింది.  మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ మంత్రి మునియప్ప,  పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తదితరులు తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్నవారిలో ఉన్నారు.

అదానీ అంశం లేవనెత్తినందుకే.. ప్రియాంక

గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడమే బీజేపీ నేతల పనిగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వధేరా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అదాని అంశాన్ని లేవనెత్తినందుకే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు తెరపైకి వచ్చిందని అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీపై పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టులో స్టే ఉందని ప్రియాంక అన్నారు. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తినందుకే పరువునష్టం దావా తెరపైకి వచ్చి వేగంగా విచారణ పూర్తై తీర్పు కూడా వచ్చేసిందని ప్రియాంక ఆరోపించారు.  అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక తేల్చిచెప్పారు. అయనా గాంధీ కుటుంబాన్ని  విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని,   అయినా కూడా ఏ జడ్జి కూడా వారికి రెండేళ్ల శిక్ష విధించరని, వారిపై అనర్హత వేటు పడదని ప్రియాంక అన్నారు.

జగన్ వైనాట్ 175 అని ఎలా అనగలుగుతున్నారు.. మేకపాటి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ కు ఉన్న అసంఖ్యాక సలహాదారులు చేస్తున్న పనేంటని నిలదీశారు. అసలు జగన్  వై నాట్ 175 అని  ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనపై  సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. పార్టీ అధినాయకత్వం వద్దకు తన వంటి సీనియర్లు వెళితే కూడా పలకరించే దిక్కు లేదన్నారు.  ఎమ్మెల్యేలకు సీఎం   గౌరవం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు చేసే పనేంటో కూడా ఎవరికీ తెలియదని మేకపాటి అన్నారు.   నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అది వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దాదాపు 50 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. 

ఆ నలుగురూ సస్పెండ్.. క్రాస్ ఓటింగ్ కు కోట్లు తీసుకున్నారు.. సజ్జల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ విషయంలో వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పేర్కొంటూ నలుగురు ఎమ్మెల్యేలను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తొలి నుంచీ పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డిలతో పాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని భావిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మార్చి 24) ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయంట్ వద్ద విలేకరులతో మాట్లాడిన సజ్జల పార్టీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, ఇందుకు వీరు విపక్ష నేత చంద్రబాబు నుంచి కోట్లాది రూపాయలు అందుకున్నారని పేర్కొన్నారు.  

ప్రధానిగా రాహుల్ లోక్ సభలో అడుగుపెడతారు.. రేవంత్

 అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో రాజ్యసభ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి శూర్పణఖ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. వారు గాంధీ కుటుంబాన్ని బెదరించాలని చూస్తున్నారనీ, ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీతోనే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు.  గతంలో జనతా పార్టీ ప్రభుత్వం  ఇందిరాగాంధీపై జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా గాంధీ పై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చి లోక్ సభలో అడుగుపెట్టకుండా బహిష్కరించిందనీ, అయితే ఆమె 1980లో భారత ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టారనీ రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ కూడా 2024లో భారత ప్రధానిగా సభలో అడుగుపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.  

అప్రజాస్వామికం.. రాహుల్ పై అనర్హత వేటుపై కేసీఆర్ స్పందన

రాహుల్ గాంధీపై అనర్హత వేటును విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభ సెక్రటేరియెట్ పై ఒత్తిడి తెచ్చి రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని చెప్పించిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి తప్పుడు అన్వయమేనని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు విషయంలో మోడీ సర్కార్ చూపిన వేగం చూస్తుంటే రాహుల్ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేశారన్న సంగతి తేటతెల్లమౌతోందని కేసీఆర్ పేర్కొన్నారు. మోడీ సర్కార్ ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ను విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. కేంద్రం ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐలను ఎలా అయితే దుర్వినియోగం చేసిందో అలా క్రిమినల్ డిఫమేషన్ ను విపక్ష నేతలపై అనర్హత వేటు వేయడానికి ఉపయోగించుకుంటోందని, ఇది చాలా దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ  దురహంకారానికి, నియంతృత్వానికీ ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను వేధించే హేయమైన చర్యలకు వినియోగించుకోవడం దారుణమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులంతా కలిసి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను సమష్టిగా ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

క్షమాపణ చెప్పడానికి సావర్కార్ ను కాదు.. రాహుల్ ని

అనర్హత వేటు అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. మోడీని విమర్శించినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే మళ్లీ మళ్లీ విమర్శిస్తానని అన్నారు. భయపడి క్షమాపణలు చెప్పి పారిపోయేందుకు తాను సావర్కార్ ను కాదని అన్నారు. తాను రాహుల్ గాంధీనని చెప్పిన ఆయన తనలో ప్రవహించేది దేశంలోని సర్వజనుల స్వాతంత్ర్యం కోసం క్షమాపణ చెప్పకుండా జైలుకు వెళ్లిన వారి కర్తమని అన్నారు. తలవంచను, తగ్గను సకల జనుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తగ్గేదేలేదని రాహుల్ అన్నారు.   కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,   వయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీని  లోక్‌సభ సెక్రటేరియట్ డిస్‌క్వాలిఫై చేసిన సంగతి విదితమే,    ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.   ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అనర్హత వేటుకు, జైలుకు వెళ్లడానికి భయపడే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. 

గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సభలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్‌ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు గ్రామ, వార్డు స్థాయిల్లోనే  ప్రజలకు అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులను కూడా అసెంబ్లీ ఆమోదించింది.  

సిట్ విచారణకు బండి డుమ్మా!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు.  పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నందున సభ్యులంతా హాజరుకావాల్సిందిగా పార్టీ అగ్రనాయకత్వం విప్ జారీ చేయడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కార్యాలయం, పేషీపైన బండి సంజయ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘సిట్’పై నమ్మకం లేదని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీచేయగా ఆయన  గురువారం విచారణకు హాజరయ్యారు. అయితే బండి సంజయ్  మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. . సిట్ దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందో లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా సిట్ చీఫ్‌కు గవర్నర్ లేఖ రాశారు.

పొంగులేటి వర్గానికి తెలంగాణ సర్కార్ షాక్.. ముగ్గురు నేతలకు భద్రత కుదింపు

 పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.  ఇప్పటికే మాజీ ఎంపీకి గన్ మెన్లను తగ్గించిన కేసీఆర్ సర్కార్ తజాగా ఆయన వర్గానికి చెందిన  మరో ముగ్గురు నేతలకు భద్రత కుదించింది. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య కు గన్ మెన్ల సంఖ్యను . 2 ప్లస్ 2 నుంచి 1ప్లస్ 1కు కుదించింది. దీంతో ఆయన  తనకు గన్ మన్  అవసరం లేదని ఉన్నవారిని  వెనక్కి పంపారు. అదే విధంగా పినపాక మాజీ ఎమ్మెల్యే   పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ ఛార్జి వెంకట్రావుకు కూడా  గన్ మన్ లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   దీనిపై  పాయం తనకు కేటాయించిన గన్ మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదన్నారు. ఇక వెంకట్రావు స్పందిస్తూ సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే అని స్పష్టం చేశారు. సెక్యూరిటీ తొలగింపు నిస్సందేహంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు.  

పట్టుదల, అంకిత భావం పంచుమర్తి విజయ రహస్యం

పార్టీ పట్ల అంకిత భావం, పని పట్ల శ్రద్ధ, సాధించాలన్న పట్టుదల ఇవే పంచుమర్తి అనూరాథ ప్రత్యేకతలు. కష్టంలోనూ కర్తవ్యాన్ని విస్మరించకపోవడం, పదవుల కన్నా ప్రజాసేవే మిన్న అన్న భావం ఆమెను ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయతీరాలకు చేర్చాయి. రాజకీయ ప్రవేశంతోనే ఆమె  విజయవాడ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పంచుమర్తి అనురాధ సరిగ్గా 23 ఏళ్ల కిందట రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా  ఎన్నికయారు?  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  అనంతరం   పంచుమర్తి విజయం విజయం తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ సంచలనమే . ఆమె కుటుంబానికి  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు.  తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్‌. ఆదాయపన్నుశాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.  ప్రాథమిక విద్య హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదివిన పంచుమర్తి అనూరాథ హైస్కూల్‌, ఇంటర్‌ విద్యను విజయవాడలోనూ,  పూర్తి   బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు.  ఆ తర్వాత  ఆమె   నాగార్జున యూనివర్సిటీ నుంచి నుంచి జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధంలేకపోయినా ఆమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు.  2000 సంవత్సరంలో 26 ఏళ్ల పిన్న వయస్సులో విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. విజయవాడ మేయర్ పోస్టును మహిళలకు రిజర్వ్ చేసిన విషయాన్ని వార్తా పత్రికలో చదికి ఆసక్తితో  తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో   మేయర్‌ పదవికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేది.   తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేయర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన   అనురాధకు చక్కటి అవగాహన ఉందని గ్రహించిన చంద్రబాబు ఆమెనే ఎంపిక చేశారు. అప్పుడు జరిగిన మేయర్ ఎన్నికలలో   కాంగ్రెస్‌ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల ను ఓడించి 6800 కు పైగా ఓట్ల మెజారిటీతో  అనురాధ విజయం సాధించారు. డైరెక్ట్ ఎన్నికలలో మేయర్ గా ఎన్నికైన అనురాధ తొలి నాళ్లలో రాజకీయ అనుభవం లేక ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అనతి కాలంలోనే అన్ని విషయాలలోనూ నైపుణ్యం సంపాధించారు.  మేయర్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె భావించలేదు. కానీ  2007 నుంచి మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆక్రమంలో  2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు  బీజేపీకి  తెలుగుదేశం కేటాయించింది.   దీంతో పోటీ చేయడం కుదరలేదు. అయితే పార్టీలో పలు పదవులు నిర్వహించారు.  అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.

రాహుల్ పై అనర్హత వేటు పడింది!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడైన రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నది. ఈ అనర్హత గురువారం  (మార్చి 23, 2023) నుంచి అమల్లోకి వస్తుందని లోక్ సభ సెక్రటరీ జనరల్   శుక్రవారం (మార్చి 24) ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.   ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు 30 రోజుల బెయిలు ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  

వైసీపీ సీన్ రివర్స్.. పంచుమర్తి విజయం జగన్ భవిష్యత్ పతనానికి దర్పణం?

వైసీపీకి సీన్ రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉగాదికి ముందు రోజు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ పరాజయం, ఉగాది మరునాడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం. అయితే ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం లేని వైసీపీ నాయకులు అసలు గ్యాడ్యుయేట్ లు తమ ఓటర్లే కాదని డిజోన్ చేసుకున్నారు. సమాజంలో వారో చిన్న భాగం మాత్రమేననీ, తమ ఓటర్లే వేరే ఉన్నారనీ గంభీర ప్రసంగాలు చేశారు.  గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలలోనూ పరాజయం పాలైన తరువాత వైసీపీ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి గ్యాడ్యుయేట్లు తమ ఓటర్లు కాదని చెప్పారు. వారెవరూ తమ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాదని నిస్సంకోచంగా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే.. చంద్రబాబు వారిని ప్రలోభాలకు గురి చేసి తమ అభ్యర్థి ఓటమికి కారకుడయ్యారే తప్ప తాము ఓడిపోలేదని కొత్త భాష్యం చెప్పుకున్నారు. పోనీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అంటే సజ్జల గారు దానికి కూడా తనదైన ప్రత్యేక శైలిలో  ఇదేమీ ఉద్యోగం కాదు తప్పు చేశారని తేలగానే చర్యలు తీసుకోవడానికి ఇది రాజకీయం.. సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  ఇంతకీ సజ్జలగారి భాష్యం ఏమిటంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ ఓ స్థానాన్ని కోల్పోవడానికి తమ ఓటమి కారణం కాదట.. చంద్రబాబు తమను ఓడించారు అని చెబుతున్నారు. అంతే కాదు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే పాటి ధైర్యం కూడా లేని దయనీయ పరిస్థితికి వైసీపీ దిగజారిందని సజ్జల మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వని జగన్ ఇప్పుడు వారికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయంతో వణికిపోతున్న పరిస్థితికి ఇది అద్దం పడుతోందని చెబుతున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న భయం వారిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే.. ఉప ఎన్నిక ఎదుర్కొనవలసిన అనివార్య పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే.. కోరి కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందన్నది జగన్ భయంగా పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతో ఉన్న కాస్త పాటి పరువూ గంగలో కలుస్తుందన్న బెరుకు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  అసలు పార్టీపై, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు సడలడం ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన సమయంలోనే తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులలో అసమ్మతి, ఆగ్రహం ఒక్క సారిగా భగ్గుమన్నాయి. బతిమాలో, బామాలో ఎలాగోలా ఆ పరిస్థితిని నుంచి బయటపడిన జగన్ ఇప్పుడు ఈ ఓటముల తరువాత ఇప్పటి వరకూ తాను ఎవరిపైనైతే పెత్తనం చెలాయంచారో వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామని భావించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్థానంలో ఎదురైన పరాజయంపై వైసీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ  పరాభవం పార్టీ శ్రేణుల్లో కూడా నిరాశను నింపేసిందని అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధినేత ఆదేశాన్ని ధిక్కరించడం, క్యాంపులు ఏర్పాటు చేసి, ఒకటికి నాలుగు సార్లు మాక్ ఓటింగ్ చేయించినా క్రాస్ ఓటింగ్ జరగడం వైసీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక ముందున్నది అంతా గడ్డుకాలమే అన్న నిర్ణయానికి వైసీపీ అధినాయత్వం వచ్చేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

ఉగాది పురస్కారాల్లో 'తెలుగు వన్'కి రెండు అవార్డులు

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రకటించారు. మొత్తం 23 విభాగాలకు గాను వందల సంఖ్యలో జర్నలిస్టులు పోటీ పడగా.. వారి ప్రతిభ, వారు రాసిన కథనాల ఆధారంగా ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేశారు. ఈ పురస్కార గ్రహీతల జాబితాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగు వన్ రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. సినిమా విభాగంలో సీనియర్ జర్నలిస్టు బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ విభాగంలో సీనియర్ జర్నలిస్టు ఎస్. కె సలీం ఉత్తమ జర్నలిస్టులుగా పురస్కారాలు గెలుచుకున్నారు. అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉగాది పురస్కారాల ద్వారా సత్కరించి, గౌరవించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు అన్నారు. అక్షరాన్నే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఇటువంటి ప్రోత్సాహం ఎంతగానో ఉత్తేజాన్నిస్తుందని చెప్పారు. జర్నలిస్టు సంఘాలంటే పోరాటాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యే మూస ధోరణిని దాటి.. జర్నలిస్టులను వృత్తిపరంగా ప్రోత్సాహించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలోనే ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు.

భారీ ర్యాలీతో టీడీపీ గూటికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ తిరుగుబాటు  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం (మార్చి 24) తెలుగుదేశం గూటికి చేరనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో గిరిధర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.     నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపిన గిరిధర్ రెడ్డి.. నెల్లూరు నుంచి 300 కార్లతో భారీ ర్యాలీగా అమరావతి చేరుకోనున్నారు.    గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా తెలుగుదేశంలో చేరనున్నారు.    గిరిధర్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆ నేపథ్యంలోనే వైసీపీను వీడాలని గిరిధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ముందు ముందు గిరిధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. గురువారం (మార్చి 23) జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని కాదని ఆత్మప్రభోదానుసారం ఓటు వేసిన సంగతి తెలిసిందే.  

ఎవరా నలుగురు.. ఏమా కథ.. వేటేనా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇంతవరకు ఓ లెక్క ..ఇకపై మరో లెక్క, అన్నట్లుగా మారి పోయాయి. గత సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఓటమి చూడలేదన్న అహంకారంతో విర్రవీగుతున్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అక్కడితో ఆగలేదు...అక్కడ గ్రాడ్యుయేట్స్  అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్’ ఇస్తే,  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మైండ్ బ్లాక్ అయ్యే మరో షాక్ ఇచ్చారు. నేను మోనార్క్ ను నా మాటే శాసనం అన్నట్లుగా తమకు తిరుగులేదని విర్ర వీగిన జగన్ రెడ్డికి సొంత పార్టీ ఏమ్మేల్యేలు ఝలక్ ఇచ్చారు. పకడ్బందీ వ్యూహంతో పావులు కదిపినా ఒకరు ఇద్దరు కాదు  ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు సాహసించారు. జగన్ రెడ్డి హుకుంను ధిక్కరించారు. టీడీపీ  అభ్యర్ధి పంచుమర్తి అనురాధను గెలిపించారు. అయితే ఇప్పడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? జగన్ రెడ్డిని పరాభవానికి  గురి చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ రెడ్డి స్పందన ఏమిటి? ఇక ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తారు? ఎమ్మెల్యేల ధిక్కారాన్ని దిగమింగి ఊరుకుంటారా? ఆ నలుగురిని గుర్తించి వేటు వేస్తారా? ఉప ఎన్నికలకు సాహసిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  నిజానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం అనూహ్యం అయితే కావచ్చును కానీ కచ్చితంగా ధర్మ విజయం. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఒక అభ్యర్ధి గెలవాలంటే  22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీ బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేల్లో కరణం బలరాం, మద్దాళి గిరిధర్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌ అధికారికంగా తెలుగు దేశం ఏమ్మేల్యేలుగా కొనసాగుతూనే  వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభలో టీడీపీ  వాస్తవ సంఖ్యా బలం 19కి తగ్గింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా టీడీపీ విప్‌ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే.. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన  ఆ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే..  ముందుగానే అత్మప్రభోధం మేరకు ఓటి వేస్తామని బహిరంగంగా ప్రకటించిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు కలిపినా టీడీపీకి పడాల్సింది -21 ఓట్లు మాత్రమే. దీంతో అనూరాధ కు ఓట్లు వేసిన ఆ ద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ముందుగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇదే సమయంలో.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరూ ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో.. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఉండవల్లి శ్రీదేవి కూడా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉదయమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిశానని.. తాను ఎందుకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతానని ప్రశ్నించారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో అధికార వైసీపీలో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి. వీరందరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోతే.. ఆ పని ఎవరు చేశారనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏడుకు.. ఏడు స్థానాలు గెలవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ముందుకెళ్లారు. అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు వేస్ట్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఓట్లు వేస్ట్ కాలేదు గానీ.. క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. దీనిపై జగన్ కూడా చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. వారిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అనురాధ విజయంపై వైకాపాలో సంబురాలు

 అవును. మీరు చదివింది కరెక్టే. అందులో అచ్చు తప్పులేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. అది సహజం. కానీ టీడీపీ అభ్యర్ధి అనురాధ విజయంపై టీడీపీ  నాయకులు శ్రేణుల కంటే, వైసీపీ నాయకులు ఎక్కువ సంతోష పడుతున్నారు. అయితే తెలుగు దేశం సంబురాలకు, వైసీపీ సంబురాలకు ఓ చిన్న తేడా అయితే వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకుంటుంటే, వైసీపీ నేతలు లోలోపలే మురిసి పోతున్నారు. అదేదో సినిమాలో శృతిహాసన్ లోలోపల డాన్స్ చేసినట్లుగా, వైసీపీ నేతలు కొందరు లోలోపల ఏకంగా ఆనంద తాండవం చేస్తున్నారు. తెలుగు దేశం మిత్రులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.   ఇంతకీ వైసీపీ నాయకులు ఎందుకు అంతగా సంతోష  పడుతున్నారంటే.. వారి  సంతోషానికి కారణం లేక పోలేదని అంటున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో సంపూర్ణ ఓటమితో కొంత కిందికి దిగివచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ ఓటమితో మరో మెట్టు దిగివస్తారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా చులకన చేసి మాట్లాడడం, తానొక్కడే పునీతుడు, సర్వ శక్తిమంతుడు మిగిలిన వారంతా పనికి మలిన వారు అన్న విధంగా వ్యవహరించడం వంటి ముఖ్యమంత్రి విపరీత పోకడలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇతర ముఖ్యనేతలు చాలా కాలంగా లోలోపల కుమిలి పోతున్నారు. అలా విసిగి పోయిన నాయకులు ఇప్పటికైనా జగన్ రెడ్డి దారికి వస్తారని ఆశిస్తున్నారు. అందుకే సంబురాలు చేసుకుంటున్నారని, అంటున్నారు.  కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన అనురాధను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23వ తేదీన అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా గెలుపు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్‌ అంటే అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. తెదేపా అభ్యర్థి విజయం సాధించడం పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా పతనం ఆరంభమైందని అన్నారు.