అవినాష్ పిటిషన్ సీజే బెంచ్ మీదకు రాకపోవడం వెనుక మర్మం ఏమిటి?..రఘురామకృష్ణం రాజు
posted on Mar 11, 2023 6:04AM
కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్టు చేయకుండా సీబీఐను ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు కాకుండా మరో బెంచ్ కు ఎలా వెళ్లిందన్న అనుమానాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు దాఖలు చేసే కేసులన్నీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించాలన్న విధానానికి విరుద్ధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ మరో బెంచ్ కి వెళ్లడం వెనుక ఏదో మర్మం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ,తాను పిటిషన్ దాఖలు చేయగా అది ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు విచారణకు వెళ్ళిందని ఆయన గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ లో అత్యవసరంగా కేసు మూవ్ చేయగా, జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ పైకి వెళ్ళింది. రోస్టర్ విధానంలో ఈ కేసు సంబంధిత బెంచ్ పైకి వెళ్లాల్సి ఉండగా, తన బెంచ్ పైకి రావడం పట్ల న్యాయమూర్తి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారన్నారు. అన్నిటికీ మించి తన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దని అవినాష్ రెడ్డి న్యాయస్థానంలో చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ అన్నారు.
ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారని వైయస్ అవినాష్ రెడ్డి కోర్టులో అభియోగం మోపడమేమిటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారన్న అభియోగాన్ని మోపాల్సింది సిబిఐ. కోర్టుకు వచ్చి అవినాష్ రెడ్డి అభియోగాన్ని మోపుతున్నారంటే దాని వెనుకనున్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. వివేక ఇంట్లో అదే రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి చెప్పి రక్తపు మరకలు తుడిచేయమని, కట్లు కట్టమని, సీఐ శంకరయ్యను కూడా మేనేజ్ చేయమని చెప్పారా? అని ప్రశ్నించారు.
దస్తగిరికి హత్య చేయమని వారే చెప్పారని అంటున్న అవినాష్ రెడ్డి ఇంట్లో హత్యకు ముందు, తరువాత దస్తగిరి తో పాటు ఇతర నిందితులంతా ఎందుకు ఉన్నారని నిలదీశారు. వైఎస్ వివేకా హత్య అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను తుడిపించింది నిజం కాదా?, గాయాలకు కట్లు కట్టించింది నిజం కాదా?, గుండెపోటుతో మరణించారని చెప్పింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా తన మామ గుండెపోటుతో మరణించారని చెప్పమని మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించారు.