ఏపీలో కొత్త కూటమి ?
posted on Mar 10, 2023 @ 2:08PM
మనం ప్రేమించేవారి కంటే, మనల్ని ప్రేమించే వారితో కలిసి ప్రయాణం చేయడం మంచింది. ఇది ప్రేమ పెళ్లి విషయంలో సినిమా పెద్దలు చెప్పే మాట. అయితే, సినిమా ప్రేమకే కాదు, రాజకీయ ప్రేమలకూ ఇది వర్తిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు, తద్వారా వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, తెలుగు దేశం, జనసేన పార్టీలు బేషజాలు మరిచి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో బీజేపీ కూడా కలసిరావాలని ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.
అయితే బీజేపీ నాయకత్వం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది. నిజానికిమ ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కమల దళాన్ని కలుపుకు పోవడం వలన వైసేపీ ఎన్నికల అరాచకాలకు కొంత వరకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో కావచ్చు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తును కోరుకుంటున్నాయి.
అయితే బీజేపీ కలిసి రాకపోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీని వదిలేసి వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంలతో జట్టుకట్టే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తే, 2014 కంటే మంచి ఫలితాలు సాధించవచ్చని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారని అంటున్నారు. నిజానికి బీజేపీతో జట్టు కట్టడం వలన మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎదుర్కుంటున్న వ్యతిరేకతను మోయవలసి వస్తుంది. అదే కమల దళంతో పొత్తు లేకుండా టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు జట్టుకడితే అటు మోడీ ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత కొత్త కూటమికి కలిసొస్తాయని విశ్లేషిస్తున్నారు.
నిజానికి ఇటు టీడీపీకి అటు జనసేనకు కూడా గతంలో వామపపక్ష పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం వుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీచేసిన సందర్భాలు లేక పోలేదు. ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలకు సీట్ల పరంగా గౌరవమైన ప్రాతినిధ్యమే దక్కేది. అయితే గత కొన్నేళ్లుగా వామపక్షాలు ప్రాభవాన్ని కోల్పోయినా ఇప్పటికీ, కొన్ని కొన్ని పాకెట్స్ లో ఎర్ర జెండాను నమ్ముకున్న జనమున్నారు. మంగళగిరి వంటి కొన్ని కీలక నియోజక వర్గాల్లో వామ పక్షాలకు నిర్దిష్టమైన ఓటు బ్యాంకుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూపు లెఫ్ట్ పార్టీల వైపుకు తిరిగిందని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు పట్టభద్రుల స్థానాలతో పాటు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే బరిలో దిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. అయితే వామపక్షాల అనుబంధ కమిటీలు సంయుక్తంగా పీడీఎఫ్ కూటమిగా అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ స్థానాల్లో పోటీకి దిగారు. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలదే పట్టు. కానీ గత కొన్నేళ్లుగా వామపక్షాలు వెనుకబడ్డాయి. మళ్లీ తమ ప్రాభవాన్ని పెంచుకోవాలన్న యోచనలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహకారం కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
రెండు పార్టీల మధ్య పరస్పర సహకార పద్దతిలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రాతిపదికన రానున్న రోజుల్లో, టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు కూటమి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.