ఇప్పటికి ముగిసింది.. మళ్లీ రండి మేడమ్!
posted on Mar 12, 2023 @ 10:31PM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శనివారం సుదీర్ఘంగా ఉంటే ఎనిమిది గంటలకు పైగా విచారించింది. ఉదయం ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లినప్పటి నుంచీ తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బయటకు వచ్చే వరకూ అక్కడ హస్తినలో, ఇక్కడ తెలంగాణలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.
కవితను అరెస్ట్ చేస్తారంటూ ఉదయం నుంచి ఏర్పడిన ఓ టెన్షన్ వాతావరణానికి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగింపు లభించింది. ఎనిమిది గంటల విచారణ తర్వాత కవితను వదిలేశారు. దాంతో ఆమె ఢిల్లీలోని ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి రాత్రికి రాత్రే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు.
మళ్లీ కవితను ఈడీ ఈ నెల 16న విచారించనుంది. అయితే శనివారం రోజంతా మాత్రం హై డ్రామా నడిచింది. తొలుత సాయంత్రం ఐదు గంటల వరకూ కవిత విచారణ సాగుతుందన్న వార్తలు వచ్చినా, విచారణ మాత్రం రాత్రి ఎనిమిది దాటే వరకూ కొనసాగింది. మధ్యలో ఆమె ఫోన్ ను ఈడీసీజ్ చేసింది. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు.దీంతో అప్పటికప్పుడు ఆమె తన డ్రైవర్ ను డిల్లీలో తాను బస చేసిన నివాసానికి పంపి ఫోన్ ను తెప్పించారు. వెంటనే సామాజిక మాధ్యమలో ఫోన్ సీజ్ చేశారంటే అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారని.. అలాగే ఇతర నిందితుల నుంచి విచారణలో భాగంగా రాబట్టిన అంశాలను ఆధారం చేసుకుని కూడా కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని అంటున్నారు.
ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు. అంతే కాకుండా శుక్రవారం నాడే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను అరెస్టు చేయవచ్చంటూ చెప్పడంతో ఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ, తెలంగాణల్లో ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్దా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు మోహరించారు. కవితకు సంఘిభావంగా … మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే ఇతర సీనియర్ నేతలు.. బీఆర్ఎస్ న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. చివరకు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఆమెను పంపేశారు.
కవిత హైదరాబాద్ చేరుకోగానే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఈడీ విచారణకు సంబంధించి అంశాలన్నీ వివరించారు. ఇక కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించి పంపిన క్షణం నుంచీ బీఆర్ఎస్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి కానీ, ఈడీ కవితను విచారించడంపై కానీ ఆ పార్టీ నేతలు కానీ, శ్రేణులు కానీ మాట్లాడటం లేదు.
అలా మాట్లాడవద్దని వారికి పార్టీ అగ్రనేత నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా పార్టీ శ్రేణులే అంటున్నాయి. దీంతో ఈ కుంభకోణం విచారణలో బీఆర్ఎస్ రాజీధోరణి అవసంబిస్తోందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి. హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన ప్రయత్నాల వల్లే కవిత అరెస్టు కాకుండా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చారని కూడా పరిశీలకులు అంటున్నారు. అయితే కల్వకుంట్ల కవిత మరోసారి ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అంత వరకూ ఈ అనుమానాలు, ప్రచారాలు అయితే సాగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి.