తెరపైకి మళ్ళీ ముందస్తు ముచ్చట!
posted on Mar 10, 2023 8:56AM
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో రాటు తేలిన నాయకుడు. సందేహం లేదు. రాజకీయ వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు రాష్ట్ర నేతలలో మరొకరు లేరు. నిజానికి కేసీఆర్ విజయ రహస్యం కూడా అదే. ఆయన రాజీయ చాణిక్యమే ఆయన విజయ రహస్యం. ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలే ఆయన ప్రధాన రాజకీయ అస్త్రాలు అంటారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ గత కొంత కాలంగా చాలా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ మార్కు సందడి కనిపించడం లేదు. ఆయన ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అయితే, ఒక పక్షం రోజుల క్రితం కావచ్చును, ఆయన వరసగా మూడు నాలుగు రోజులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినట్లు తెలుస్తోందని కథనాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా ఆ తర్వాతనే, అంతకు ముందు చెప్పినట్లుగా సిట్టింగులు అందరికీ మళ్ళీ టికెట్ రాక పోవచ్చని , కొందరికి మొండి చేయి తప్పదనే ప్రచారం జరిగింది.
అదలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ముందస్తు ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, ఆమె అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసేఅర్ మళ్ళీ ముందస్తు ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చారు.
నిజానికి 2018లో ఆరు నెలలు ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో సెంటిమెంట్స్ కు పెద్దపీట వేసే కేసీఆర్, మూడవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు.. మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజురాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలు చేస్తున్నారనే కధనాలు వస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను వినవస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం సభ’ ముందూ వెనకా కొంత కాలం ఇదే ప్రచారం నడిచింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ , అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ గురువారం(మార్చి9) క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారం(మార్చి10) బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడంతో మరో మారు ముందస్తు ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి.
కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు చర్చను మరో మారు తెరపైకి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడితో ఆగకుండా కాళేశ్వరం అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు కాగ్ ను రంగలోకి దించినట్లు తెలుస్తున్న నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, హ్యాట్రిక్ సాదించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదైనా అంతిమ నిర్ణయం ఇప్పటిప్పుడు రాదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయితే ఆ తర్వాత ప్రజల్లో ముఖ్య్మగా మహిళలలో ఏ మేరకు సానుభూతి వస్తుందనేది అంచనా వేసుకుని ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అదలా ఉంటే.. శనివారం(మార్చి 11) కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈవిచారణ ఎన్ని రోజులు జరుగుతుంది .. అంతిమ నిర్ణయం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరి ఊహకు అందని విషయం. సో .. ముందస్తు వ్యూహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి .. అనేది ఈడీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.